సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో మార్చి 15న సాధారణ రకం మామిడి ధర టన్నుకు రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షలు పలికింది.. అదే నెల 30న రూ. 65 వేలకు తగ్గిపోయింది.. ఏప్రిల్ 15న ధర రూ.50 వేలకు దిగజారింది. మే 1న(మంగళవారం) మామిడి ధర రూ.40 వేలకు పడిపోయింది. మామిడి ధరలు సగానికి సగం పడిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నాడు. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మామిడి ధర పడిపోవడంతో వినియోగదారులకు ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే అదీ లేదు. బహిరంగ మార్కెట్‌లో మాత్రం మామిడి ధరను రెండింతలు పెంచి విక్రయిస్తున్నారు. మొత్తంగా అటు రైతును, ఇటు వినియోగదారులను దళారులు ఎడాపెడా దోచేస్తున్నారు.
30 శాతానికిపైగా పడిపోయిన ఉత్పత్తి
రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల ఉత్పత్తి వస్తుంది. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో ఈసారి ఎకరానికి రెండు మూడు టన్నులకు మించి ఉత్పత్తి కాలేదు. రాష్ట్రంలో సాధారణంగా 28 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఈసారి 8 నుంచి 10 లక్షల టన్నులలోపే ఉత్పత్తి అవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. మొత్తంగా 30 శాతం వరకు ఉత్పత్తి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ పెరిగి రైతుకు ఎక్కువ ధర రావాలి. కానీ రైతుకు దక్కాల్సిన సొమ్మును దళారులు సొంతం చేసుకుంటున్నారు.
వినియోగదారులపై బాదుడే..
రైతుల నుంచి టన్నును రూ.40 వేలకు వ్యాపారులు కొంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లో వినియోగదారుల నుంచి దీనికి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి రూ.40 వరకు ఉండాలి. కానీ మార్కెట్లో ఏకంగా రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ.150–200 వరకూ ఉన్నాయి. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తుంది. డిమాండ్ ఉన్నా సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతన్న పడిపోయాడు. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడంతోనే మామిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
రూ. 41 వేలకే కొన్నారు
రెండ్రోజుల కిందట నాలుగు టన్నుల మామిడి కాయలను తీసుకొచ్చాను. కానీ హైదరాబాద్‌లో దళారులు నాణ్యత సరిగా లేదనే సాకుతో టన్ను రూ. 41 వేలకే కొనుగోలు చేశారు. గత్యంతరం లేక దళారులకు నష్టాలకే మామిడి అమ్ముకున్నాను.
– రాజశేఖర్, రైతు, సత్తుపల్లి
మామిడి ధర ఢమాల్
Published Wed, May 2 2018 3:08 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment