- సాల్వాపూర్, మన్‌సాన్‌పల్లిలో భారీగా పంటనష్టం
- వెయ్యి ఎకరాల్లో ధ్వంసమైన వరి పంట
- రాలిపోయిన మామిడి కాయలు
బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వారం రోజుల క్రితం కురిసిన వడగళ్లతో కుదేలైన రైతులు, ఆదివారం రాత్రి మరోసారి ప్రకృతి సృష్ట్టించిన బీభత్సానికి విలవిలలాడారు. వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, వాన దుమారంతో వందలాది ఎకరాల్లో మామిడి చెట్లు విరిగిపోవడమేగాక, కాయలు రాలిపోయాయి.
మండలంలోని సాల్వాపూర్, మన్‌సాన్‌పల్లి, లింగంపల్లి, కొన్నె, పడమటికేశ్వాపూర్, ఇటికాపల్లి, బచ్చన్నపేట, తమ్మడపల్లి, కట్కూరు, చినరామన్‌చర్ల, బసిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు మండలవ్యాప్తంగా గోలి సైజులో గంటన్నరపాటు కురిసిన వడగళ్లు వెయ్యి ఎకరాల్లో వరి పంటను నాశనం చేశాయి. సుమారు 250 ఎకరాలకుపైగా మక్క పంట, మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు.
బాధిత రైతులను ఆదుకోవాల ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు చొక్కం వరల క్ష్మి, బండకింది చంద్రకళ, భైరగోని బాలమణి, బేజాటి సిద్దులు, కాంగ్రెస్ నాయకులు గూడ చెన్న కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి.
మద్దూరులో గాలి దుమారం
మద్దూరు : మండలంలో ఆదివారం సాయంత్రం భారీ గాలిదుమారం రావడంతో చేతికందిన వరి పంట నాశనమైంది. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయి నిలవ నీడలేకుండా చేశాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికందే సమయంలో గాలి దుమారం రావడంతో రైతు లు కన్నీరుమున్నీరయ్యారు. చేసిన అప్పులు ఎలా తీరేదని వాపోతున్నారు. మామిడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.