
మామిడి ముక్క గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి
ధన్వాడ (మహబూబ్ నగర్) : గొంతులో మామిడి ముక్క ఇరుక్కొని ఏడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం అప్పంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లలితమ్మ, కుమ్మరి కాశీమన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం తల్లి ఇంట్లో పనులు చేస్తుండగా ఆరుబయట కుమార్తెలు మామిడిపండు ముక్కలను తింటున్నారు.
అదే సమయంలో చిన్న కుమారుడు అభినేష్ (ఏడు నెలలు) నోట్లో పెట్టుకున్న ఒక ముక్క గొంతులో ఇరుక్కుంది. గమనించిన తల్లి, తాత వెంటనే బాలుడిని మరికల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక బాలుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది.