
కరెంట్ షాక్‌తో చెట్టుపైనే చివరి శ్వాస
మామిడికాయలు కోసేందుకు కూలీకి వెళ్లిన బాలిక మృతి
హుస్నాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు శనివారం కూలీకి వెళ్లిన బాలిక కరెంట్ షాక్‌తో చెట్టుపైనే మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం కన్నారానికి చెందిన మందడల రాజు, శారదల పెద్ద కూతురు సంధ్య(16) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. సెలవులు కావడంతో గ్రామస్తులతో కలసి అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు కూలీకి వచ్చింది.
చెట్టు ఎక్కి కాయలు తెంపుతుండగా.. అక్కడున్న విద్యుత్ తీగల్ని గమనించక పోవడంతో షాక్ కొట్టి చెట్టుపైనే మృతి చెందింది. అదే చెట్టుపై ఉన్న సాంబరాజు, నితిన్‌లు సంధ్యను చూసి భయంతో చెట్టుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతకపేటకు చెందిన రాంరెడ్డి మామిడితోటను మరొకరు గుత్తకు తీసుకుని కాయలను తెంపిస్తున్నాడు. కాయలు తెంపేందుకు బాలకార్మికులను వినియోగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడితోట యజమాని, గుత్తేదారు, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.