మామిడి పోతోంది!
కరువు రక్కసికి కుదేలైన మామిడి రైతు
జిల్లాలో పదివేల ఎకరాల్లో ఎండిన తోటలు
రూ.50 కోట్ల మేర నష్టం
కన్నీరుమున్నీరవుతున్న రైతాంగం
కరువు రక్కసి మామిడి రైతును కోలుకోనీయకుండా చేసింది. కంటికిరెప్పలా పెంచిన తోటలకు నీళ్లులేకుండా చేసింది. పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ముచేసింది. పచ్చని చెట్లను నిలువునా ఎండబెట్టి ఫలితం రాకుండా చేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు.
తిరుపతి:వరుస కరువులతో అన్నదాత తల్లడిల్లి పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చంటి బిడ్డల్లా పెంచి, పోషించుకున్న మామిడి చెట్లు కళ్లేదుటే ఎండిపోతున్నాయి. కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావటం లేదు. దీంతో ఏమి చేయలేని నిస్సాహాయక స్థితిలో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తక్కువ వ్యయప్రయాసలతో రైతు కుటుంబానికి ఆర్థికంగా అసరాగా నిలిచే మామిడి తోటలు నేడు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఎండిపోయాయి. ఇంకా కొన్ని తోటల్లో 30 నుంచి 40 శాతం చెట్లు మాడిపోయాయి. 1972 సంపత్సరంలో వచ్చిన గంజి కరువులో సైతం తోటలు ఎండలేదు. ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ కొంత మంది అన్నదాతలు గతాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎండిన మామిడి తోటలను రైతులు నరికి వేశారు.
చేయూత‘ కరువు’...
కష్టాల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్న మామిడి రైతుకు చేయూత కరువు అయ్యింది. మూడేళ్ల నుంచి నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్ని తోటల మధ్యలో రాళ్ల నేలలు ఉండడంతో నీటి ఎద్దడికి తట్టుకోలేక చెట్లు ఎండిపోతున్నాయి. ఒకే తోటలోనే కొన్ని పచ్చగా ఉండగా, మరికొన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. ఉద్యాన పంటలను కాపాడేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకుంటామన్నా అమలుకు నోచుకోలేదు. ఎండిన తోటలకు పరిహారం ఇవ్వటం లేదు. రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. కొత్తగా మామిడి తోటల పెంపకానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. దీంతో మామిడి తోటల సాగు తగ్గుతోంది.
తోటలు కాపాడే యత్నం
మామిడి చెట్లు ఎండిపోకుండా కాపాడేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నాం. పాదుల్లో ఆకులు పరచడం, పచ్చిరొట్ట ఎరువులు వేయడం, జిలుగ, జనుము చల్లిస్తున్నాం. ఎండి పోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు సరఫరా చేస్తాం. బోరుబావుల్లో నీరు అడుగంటడం, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల మామిడి తోటలు ఎండిపోయాయి.
- ధర్మజా, ఉప సంచాలకులు,
ఉద్యానశాఖ