పూత రాలి.. కాయ కుళ్లి  | Sakshi
Sakshi News home page

పూత రాలి.. కాయ కుళ్లి

Published Sat, Apr 13 2024 4:59 AM

Tena manchu purugu: Even if medicine is sprayed loss in Mango Hopper - Sakshi

ముందుగా మురిపించిన మామిడి 

ఆపై పూత, కాయలను దెబ్బ తీసిన 

‘తేనె మంచు పురుగు’.. మందులు పిచికారీ చేసినా చిక్కిన కాయ అంతంతే 

తగ్గిన దిగుబడి... గిట్టుబాటు కాని ధర 

కొల్లాపూర్‌ /జగిత్యాల అగ్రికల్చర్‌
ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్‌లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.  

వాతావరణ మార్పులు, తెగుళ్లు 
డిసెంబర్‌లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో  తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల  పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి.  

మితిమీరి పురుగు మందుల పిచికారీ 
తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు.  

ధరలు సైతం నేలచూపులే 
ఏటా సీజన్‌ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్‌తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్‌లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్‌ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.  వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు.    

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది.  మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు  ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు.  

నిజామాబాద్‌ జిల్లా: బోధన్‌రూరల్‌(బోధన్‌): నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.   

 ఆదుకోవాలి.. 
 నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా.  – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్‌ 

రెండు సార్లు మందులు కొట్టాను 
పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి 

పూత నిలబడలేదు 
వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు.   – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్‌

Advertisement
Advertisement