పిడుగుపాటుకు నలుగురి మృతి
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నాలుగు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. మామిడి కాయలు నేలరాలి రైతన్నలకు నష్టం మిగిల్చింది. మరోవైపు పిడుగుపాటుకు విశాఖ జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హిందూపురంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
గురువారం ఎస్.కోట, వేపాడ, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డారుు. విశాఖ ఏజె న్సీతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాత్రికి కూడా అనేక చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ఏజెన్సీ రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఏపీలోని నాలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం
Published Fri, May 13 2016 4:34 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement