
క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలోని ఆడిటోరియంలో సోమవారం జరిగిన వికాసం సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 2017 జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మొత్తం ఆరు రీజియన్ల పరిధిలోని కళాకారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు సోలో సాంగ్స్, గ్రూప్ సాంగ్స్, సోలో డ్యాన్స్, డప్పు వాయిద్య పోటీలను నిర్వహించారు. ఆదోని, శ్రీశైలం రీజియన్లకు చెందిన కళాకారులతో కలిపి మొత్తం 218 మంది కళాకారులు పాల్గొన్నారు. వీటిలో విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాలు గల వారు ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి వారికి పోటీలను నిర్వహించారు. మంగళవారం కూడా జరిగే పోటీల అనంతరం విజేతలను ప్రకటిస్తామని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, ఆర్డీటీ డైరెక్టర్లు జేవీఆర్, దశరథరాముడు, నాగేశ్వరరెడ్డి, నిర్మల్‌కుమార్, కమ్యూనికేషన్ ఏడీ నాగప్ప, శాంసన్ తదితరులు పాల్గొన్నారు.