మా ఇంటి కత్తిపీట...
నేల మీద నీరు మీద బ్రతకగల ఏకైక ప్రాణి కప్ప. అందుకే దానిని ఉభయ చరము అంటాం. అదే విధంగా మాంసాహారుల్ని, శాకాహారుల్ని సంతృప్తి పరచగల ఏకైక తెలుగువారి వంటకం!! మామిడికాయ పచ్చడి. దీనికున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ముద్దపప్పు, మామిడికాయ, నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్‌కి మరో ప్రత్యామ్నాయం లేదంటే నమ్మండి. మందు కొట్టిన వాడికి మంచింగ్‌లో కొరకటానికి, అన్నం తినేటప్పుడు పెరుగన్నంలో నంజుకీ ఉపయోగపడే బహుళార్ధకసాధకం మామిడికాయ పచ్చడి.నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి ఊరు నుండి మామిడి కాయలు వచ్చేవి. వాటిని కడిగి, శుభ్రంగా గుడ్డతో తుడిచి కత్తిపీట కిందపెట్టి, పైన కత్తిని వుంచి, పిడి మీద ఒక గుద్దు గుద్దితే, ఆకాయ రెండు ముక్కలైపోయేది, మరల ఆ రెండు ముక్కల్ని నాలుగు ముక్కులు, ఆ తర్వాత 8 ముక్కలు... ఇలా చేస్తే ఒకకాయకి 16 ముక్కలు వచ్చేవి, ఈలోపు పిల్లలు అటుగావచ్చి ఒక ముక్క, ఇటుగా వచ్చి ఒక ముక్క తీసుకునే వాళ్ళం.
కొరికితే పుల్లగా వుండేవి.... అయినా ఇష్టంగా తినేవాళ్ళం... తర్వాత ఆవపిండి కలిపి, నునెలో వేసి జాడీలలోకి పట్టి, వాటిని మచ్చు (అటక) మీద పెట్టి రెండు నెలల తర్వాత తీస్తే, ముక్కలు బాగా నూనె పీల్చుకుని, పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లల్లా తయారయ్యేవి. ఇక పోతే ఆ కత్తి కింద మామిడి ముక్కల్ని కొడితే అది సిక్సర్ కోసం పరిగెత్తే బంతిలా వెళ్లి అటుగా వస్తున్న మా మావయ్య కణతకి తగిలిందొకసారి.... లక్ష్మణస్వామి మూర్చిల్లినట్టుగా అయింది మావయ్య పని. ఆయనకి ఫస్ట్‌ఎయిడ్ చేసి, మరల ఆయన్ని మామూలు మనిషిని చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చింది.
ఈ కత్తి పీట చాలా ప్రత్యేకమైనది, చాలా పడుచుగా ఉంటుంది. పొరపాటున వ్రేలు దానికింద పడితే వేలు కట్ అయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. ఎవరు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలన్నా కత్తిపీట మాదే... ఇంట్లో అందరూ తలా ఒకరికి మాట ఇస్తే, తేడాలు వస్తున్నాయని, ఆ బాధ్యత మా నాయనమ్మకి అప్పగించారు. ఆమె ఎవరికి ఏ రోజు ఇస్తానని మాట ఇచ్చిందో, దానిని క్యాలెండర్ మీద రాసుకునేది... అంటే ఇప్పుడు హీరోయిన్ కాల్‌షీట్లు చూసే మేనేజర్‌లాగా అన్నమాట...
ఒక రోజు మా స్కూల్లో వేసే నాటకానికి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సివచ్చింది. ఉత్సాహంగా పేర్లు ఇచ్చాం చాలామంది. అందర్నీ స్క్రూటినీ చేసి ఇద్దరి ఫైనల్స్‌కి వచ్చాం. నేనూ... ఇంకో ఫ్రెండ్...నా దురదృష్టం, ఆ రోజు వాడింట్లో మామిడికాయ పచ్చడి పట్టారు. వాడు వాళ్ల అమ్మని, నాన్నని తీసుకుని రాత్రికి రాత్రే మాస్టారి ఇంటికి వెళ్ళి మామిడికాయ జాడీ మాస్టారికి ఇచ్చారు. అంతే రెండో రోజు స్కూల్లో ఆ వేషానికి వాడిని తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. తర్వాత తెలిసింది నాకు ఇదంతా మామిడికాయ పచ్చడి మహత్యం అని... అదీ నాకు తెలిసిన మామిడికాయ పచ్చడి గురించిన జ్ఞాపకాలు...
- శివ నాగేశ్వరరావు