రసవత్తరంలో మ్యాంగో నగర్ | Mango Nagar big war in tamil nadu elections 2016 | Sakshi
Sakshi News home page

రసవత్తరంలో మ్యాంగో నగర్

Published Mon, May 2 2016 2:23 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

Mango Nagar big war in tamil nadu elections 2016

 సాక్షి, చెన్నై:  దక్షిణ భారత దేశంలో  సేలం అతి పెద్ద  మ్యాంగో నగరం. అత్యధిక నియోజకవర్గాలను కల్గిన ఈ జిల్లాలో ఈ సారి రసవత్తర సమరం సాగుతున్నది.  కొత్త ముఖాలు అత్యధికంగా రేసులో ఉండగా, ముగ్గురు సీనియర్లు, నలుగురు మాజీలు మళ్లీ పోటీకి సిద్ధం కావడంతో గెలుపు గుర్రాలు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకేల మధ్య సమరం హోరాహోరీగా సాగుతున్నది.
 
 అతి పెద్ద మ్యాంగో మార్కెట్
 పేదల ఊటీగా పిలవబడే ఏర్కాడులు సేలం జిల్లాలోనే ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే సీనియర్లు వాళ్లప్పాడి రామమూర్తి, వీర పాండి ఆర్ముగం చక్రం తిప్పిన  జిల్లా. గతంలో సాగిన పునర్విభజన ప్రభావంతో ఈ జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపాలే మారాయి. తారా మంగళం, పనమరత్తు పట్టి వంటి నియోజకవర్గాలు ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతు అయ్యాయి. సేలం నగరాన్ని మూడుగా చీల్చేశారు. తలవాసల్‌గా ఉన్న స్థానాన్ని గంగవళ్లిగా పేరు  మార్చారు. పక్కనే ఉన్న  నామక్కల్ జిల్లాకు చెందిన శంఖగిరిని సేలం జిల్లా పరిధిలోకి తీసుకొచ్చేశారు. అందుకే ఇక్కడి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో గందర గోళ పరిస్థితి ఉంటుంది. ఈ జిల్లాలో ప్రస్తుతం గంగవళ్లి (రి), ఆత్తూర్ (రి), ఏర్కాడు (రి), ఓ మలూరు, మెట్టూర్, ఎడప్పాడి, శంఖగిరి, సేలం పశ్చిమం, సేలం ఉత్తరం, సేలం దక్షిణం, వీర పాండి అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తొలుత కాంగ్రెస్‌కు తదుపరి డీఎంకే కంచుకోటగా ఉన్న ఈ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రస్తుతం అన్నాడీఎంకే పాగా వేసింది.  వెనుక బడిన వర్గాలు, మైనారిటీలు, వన్నియర్ సామాజిక వర్గంతో పాటుగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య కూడా ఇక్కడి నియోజకవర్గాల్లో ఎక్కువే.  వీరి ఆశీస్సుల కోసం అభ్యర్థులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు.  ఈ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 లక్షల 96 వేల 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14 లక్షల ఆరు వేల 392 మంది పురుషులు,  13 లక్షల 90 వేల 321 మంది స్త్రీలు, 271 మంది ఉన్నారు.
 
 సేలం(పశ్చిమం): గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన నియోజకవర్గం ఇది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడిఎంకేకు చెందిన జి వెంకటాచలం ఉన్నారు. మళ్లీ ఆయనకే సీటు దక్కింది. గతంలో తాను చేసిన ప్రగతి పనులు, అమ్మ ఆశీస్సులతో మళ్లీ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థిగా పన్నీరు సెల్వం రేసులో ఉన్నారు. ఓటర్లకు సుపరిచితుడైన ఈ మాజీ డిప్యూటీ మేయర్ ఈ సారి పాగా వేసి తీరుతానన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాల్ని అస్త్రంగాచేసుకుని ఓట్ల వేటలో పడ్డారు. ఇక, ఓట్లను చీల్చి సత్తాను చాటుకునేందుకు పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యద ర్శి  ఇర అరుల్ బరి దిగారు. అలాగే, ప్రజా సంక్షేమ కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా సేలం ఉత్తరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రాజులు రేసులో దిగడంతో నలుగురు సమ ఉజ్జీల మధ్య సమరం వేడెక్కింది.
 
 సేలం(ఉత్తరం): ఇది కూడా గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన స్థానం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డీఎండీకేకు చెందిన మోహన్ రాజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనడంతో గట్టెక్కారు. ఈ  సారి ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ మోహన్ రాజ్ బరిలో  ఉంటారని అందరూ భావించారు. అయితే, తన మకాంను సేలం పశ్చిమానికి మార్చేశారు. ఇందుకు కారణం అదృష్టం కలిసి వచ్చేనా అన్న బెంగే అంటా..!, ఇక ప్రజా సంక్షేమ కూటమిలో ఈ సీటును తమిళ మానిల కాంగ్రెస్‌కు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా దేవదాసు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కేఆర్‌ఎస్ శరవణన్ డీఎంకే అభ్యర్థిగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ రేసులో ఉన్నారు. కేఆర్‌ఎస్ శరవణన్ కొత్త ముఖం కావడంతో ఓటర్ల ప్రసన్నం కోసం సీనియర్లతో కలిసి తీవ్ర కుస్తీలు పడుతున్నారు. డిఎంకే అభ్యర్థి రాజేంద్రన్ మాజీ ఎమ్మెల్యేగా ఓటర్లకు సుపరిచితులే. ఇక, పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కదిర్ రాజరత్నం పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీగోపినాథ్ పోటీ చేస్తున్నారు.  అయితే, ఇక్కడి ఓటరు నాడి ఎటో అన్నది మాత్రం అంతుచిక్కని పరిస్థితి.
 
 సేలం(దక్షిణం): గత ఎన్నికల్లో  ఇది కూడా కొత్తగా పుట్టుకొచ్చిన సీటు. ఇక్కడి అన్నాడీఎంకేకు చెందిన ఎంకే సెల్వరాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టారు. కొత్త ముఖంగా ఎబి శక్తి వేల్ బరిలో దిగారు. ఇక, డిఎంకే తరపున కూడా కొత్త ముఖంగా గుణశేఖర్ రేసులో ఉన్నారు. ఇద్దరు  కొత్త ముఖాలు గెలుపు లక్ష్యంగా ప్రజా మద్దతుకు సిద్ధం కావడంతో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారో..!. ఇక తాను సైతం అంటూ బీజేపీ అభ్యర్థిగా అన్నాదురై రేసులో ఉన్నారు.
 
 వీర పాండి: ఇది డీఎంకే సీనియర్ వీర పాండి ఆర్ముగం సొంత గడ్డ. అయితే. ఒక్క సారి కూడా ఆయన ఇక్కడ పోటీ చేయలేదు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆరు, డీఎంకే నాలుగు సార్లు గెలిచాయి. అయితే, 1991 నుంచి ఇక్కడ  ఓ సారి డీఎంకే, మరో సారి అన్నాడీఎంకేలు విజయకేతనం ఎగుర వేశాయి. ఇక, తనకు బదులుగా గతంలో వారసుడు ఎ రాజేంద్రన్ అలియాస్ రాజను ఇక్కడి నుంచి వీరపాండి ఆర్ముగం పోటీకి దించారు.  ఓ సారి గెలిచినా, మరో సారి ఆయనకు  ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్‌కే సెల్వం విజయ కేతనం ఎగుర వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈ సారి సీటు దక్కలేదు.  మహిళా అభ్యర్థిగా ఎస్ మనోన్మణి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో  చేజారిన విజయాన్ని మళ్లీ దక్కించుకునేందుకు వీర పాండి వారసుడు రాజేంద్రన్ పోటీకి సిద్ధం అయ్యారు. ఓటర్లను ఆకర్షించే ప్రసంగంతో ముందుకు సాగుతున్నా, గతంలో సాగించిన భూదందాల్ని ఇంకా ఓటర్లు మరవ లేదని చెప్పవచ్చు. సీపీఐ అభ్యర్థిగా మోహన్, పీఎంకే అభ్యర్థిగా పి సామ్రాజ్ రేసులో ఉండటంతో ఓట్ల చీలిక ఆధారంగా డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఎవరో ఒకరు తక్కువ మెజారిటీతో గట్టెక్కాల్సిందే.
 
 ఓ మలూరు: అన్నాడీఎంకేకు బలం ఉన్న స్థానం ఇది. ఇక్కడి నుంచి ఆరు సార్లు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, డీఎంకే, తమిళమానిల కాంగ్రెస్, పీఎంకేలు తలా ఓ సారి గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన  సి కృష్ణన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త ముఖంగా ఎస్ వెట్రివేల్‌ను పోటీకి దించారు. అమ్మ చరిష్మా, పార్టీ బలం గెలిపిస్తుందన్న నమ్మకంతో ప్రజా మద్దతు కోసం పరుగులు తీస్తున్నారు. ఇక, డీఎంకే కూడా కొత్త ముఖంగా అమ్మాస్సీని అభ్యర్థిగా ప్రకటించింది. 1971 తర్వాత తమకు చాన్స్ ఇవ్వని దృష్ట్యా, ఈ సారి అవకాశం ఇస్తే, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ అమ్మాస్సీ ఓట్ల వేటలో ఉన్నారు. ఇక, ఈ ఇద్దరికి సరైన ప్రత్యర్థిగా ప్రజా సంక్షేమ కూటమి రేసులో దించింది. డీఎండీకే కోశాధికారి ఇలంగోవన్ ఇక్కడ పోటీకి దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి ఓ మారు అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఎ తమిళరసు పీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు, ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ పార్టీ సీనియర్ నేత తలబడుతుండడంతో సమరం ఆసక్తికరంగా మారింది.
 
 ఎడప్పాడి: ఇది పీఎంకే, అన్నాడీఎంకేల కోట. అలాగే, వీఐపీ స్థానం. 1971 తర్వాత ఇక్కడ డీఎంకే గెలిచింది లేదు. ఈ సారి ఒక్క చాన్స్ అంటూ డీఎంకే అభ్యర్థిగా ఎడపాడి పీసీ మురుగేషన్ పోటీకి సిద్ధమయ్యారు. అయితే, ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎడ పాడి కె పళని స్వామి ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా అవతరించిన  కె పళని స్వామి హవాను ఎదుర్కొనేందుకు మురుగేషన్ తీవ్ర ప్రచారంలో ఉన్నారు. అదే సమయంలో ఎడపాడికి చెక్ పెట్టేందుకు పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థిగా తంగ వేల్ రేసులో దిగారు. కార్మిక, అన్నదాతల ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు సీపీఎం, వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కైవసానికి పీఎంకేలు సిద్ధం కావడం, ఒక్క చాన్స్ అంటూ  మురుగేషన్ తీవ్ర ఓట్ల వేటలో ఉండటం వెరసి మంత్రికి మళ్లీ చాన్స్ దక్కేనా..!
 మెట్టూరు: ఇది మరో  వీఐపీ నియోజకవర్గం.
 
 పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, అన్నాడీఎంకే కార్యదర్శి సెమ్మలై పోటీలో ఉన్న స్థా నం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పైచే యి. డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, సీపీఎంలు తలా ఓ సారి గెలి చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి డీఎండీకే అభ్యర్థిగా పార్తీబన్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అన్నాడీఎంకే కూటమితో కలిసి గత ఎన్నికల్లో  పనిచేసిన పార్తీబన్ ఈ సారి డీఎండీకే నుంచి బయటకు వచ్చారు. డీఎంకే తరఫున ఎండీఎండీకే అభ్యర్థిగా  పోటీకి సిద్ధం అయ్యారు. డీఎంకే అభ్యర్థిగా ఆయన ప్రచారంలో దూసుకెళ్తోంటే, అన్నాడీఎంకే అభ్యర్థిగా సెమ్మలైకు సీటు దక్కడంతో సమరం వేడెక్కింది. ఇక, గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కిన పీఎంకే అధ్యక్షుడు జికే మణి, బిజేపి అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం రేసులో ఉండడంతో సమరం హోరాహోరీగా మారింది.
 
 శంఖగిరి: నామక్కల్ జిల్లా నుంచి సేలంలోకి గతంలో వచ్చిన స్థా నం ఇది.  ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది. 1989 నుంచి డీఎంకే ఓ సారి, అన్నాడీఎంకే మరో సారి విజయ కేతనం ఎగుర వేస్తున్నాయి. ఇక్కడ సి ట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన పీ విజయలక్ష్మి ఉన్నా రు. ఈ సారి ఆమెను పక్కన పెట్టి కొత్తముఖంగా ఎస్ రాజా రేసు లో దిగారు. డిఎంకే కూటమి ఈ సీటును కాంగ్రెస్‌కు అప్పగించిం ది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్త ముఖం కె రాజేశ్వరన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇక, కాంగ్రెస్ ఓట్లను చీల్చే దిశగా ప్రజా సంక్షేమ కూటమి తరపున తమిళ మానిల కాంగ్రెస్ అభ్యర్థి సెల్వకుమార్, బీజేపీ అభ్యర్థిగా ఏసీ మురేగేషన్ బరిలో  ఉన్నారు. ఈ నలుగురు  కొత్త వాళ్లే కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..!
 
 ఏర్కాడు (రి):  పేదల ఊటి ఇది. గిరిజన , అటవీ గ్రామాల్లోని  ప్రజల ఓటు బ్యాంక్ న్యాయ నిర్ణేతలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఏడు సార్లు, డీఎంకే మూడు సార్లు, కాంగ్రెస్ ఓ సారి ఇక్కడ గెలిచాయి. అన్నాడీఎంకేకు చెందిన పి సరోజ సిట్టింగ్ ఎమ్మెల్యే. సరోజను పక్కన పెట్టి కొత్త ముఖంగా కె చిత్రను తెర మీదకు తెచ్చారు. ఓటర్లను ఆకర్షించడంలో చిత్ర ముందంజలో ఉన్నారు. డిఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ రేసులో దిగడం కలిసి వచ్చే అంశం. ఇక, ఓట్లను చీల్చేందుకు ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా కుమార్, బీజేపీ అభ్యర్థిగా పొన్‌రాస్ పోటీకి సిద్ధమయ్యారు.
 
 గంగవళ్లి(రి): డీఎండీకేకు చెందిన ఆర్ సుభా సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పనిచేసిన ఆర్ సుభా, ఈ సారి ప్రజా సంక్షేమకూటమి డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్నారు. అయితే, అదృష్టం ఏ మేరకు కలి వస్తుందో అన్నది అనుమానమే. అన్నాడీఎంకే అభ్యర్థిగా న్యాయవాది మరుద ముత్తు, డీఎంకే అభ్యర్థిగా సేలం మాజీ మేయర్ ప్రియదర్శిని పోటీకి సిద్ధం అయ్యారు. ఈ ఇద్దరు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు కావడంతో పోటీ ఆసక్తికరం. ఇక, బీజేపీ అభ్యర్థిగా శివగామి పరమశివం ఓట్ల వేటలో ఉరకలు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా, డీఎంకే అభ్యర్థి ప్రియదర్శిని మహిళా అభ్యర్థులుగా ఢీ కొడుతున్నారు.
 
 ఆత్తూర్(రి): ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కోట. అన్నాడీఎంకే పాగా వేసింది. తదుపరి డిఎంకే కూడా అప్పుడప్పుడు బలాన్ని చాటుతున్నది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, అన్నాడీఎంకే, డీఎంకేలు తలా మూడు సార్లు గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన ఎస్ మాదేశ్వరన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త వ్యక్తి ఆర్‌ఎం చిన్న తంబి పోటీకి సిద్ధమయ్యారు. తమ చేతి నుంచి జారిన ఈ సీటును మళ్లీ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఎస్‌కే అర్ధనారి పోటీకి దిగారు. పీఎంకేకు కూడా ఇక్కడ బలం ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా హంసవేణి రేసులో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement