Tamil Nadu Elections 2016
-
ఓటుకై తారలు తళుక్కుమన్న వేళ..
-
విజయకాంత్ రూటే సెపరేటు
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి అంతం, పేదరిక నిర్మూలన నినాదంతో పార్టీ ఆవిర్భావకాలం నుంచి ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే, ఈ సారి ఆయన సీఎం పగ్గాలు చేపట్టేందుకు రేసులో పరుగులు తీస్తున్నారు. తానే సీఎం, తానే సర్వం అన్నట్టుగా ఓటర్ల ప్రసన్నంలో ఉన్న విజయకాంత్ ఈ సారి కీలక నిర్ణయం తీసుకుని అందర్నీ విస్మయంలో పడేశారు. ఓటుకు నోటు వద్దే..వద్దు అని ఎన్నికల యంత్రాంగం అందుకుని ఉన్న నినాదానికి మద్దతు పలుకుతూ, తానూ సైతం అని ఏకంగా ఓ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ప్రతిజ్ఞ చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉలందూరు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెప్టెన్ రేసులో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఓట్ల వేటలో ఉన్న ఆయన అక్కడి లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్నారు. పూజాది కా ర్యక్రమాల అనంతరం దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ప్రతిన బూనారు. తాను ఓటుకు నోటు ఇవ్వబోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును కొనుగోలు చేయనని ఇదే తన ప్రతిజ్ఞ అంటూ, ఇదే తన శపథంగా వ్యాఖ్యానించారు. అలాగే, వెలుపలకు వచ్చిన విజయకాంత్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పంచె పెకైత్తి కట్టి మరీ కదన రంగంలో దూకేందుకు తాను సిద్ధం అని, తనను ఎవ్వడూ కదిలించ లేడని వీరావేశంతో ప్రసంగించారు. ఇంత వరకు బాగానే, ఉ న్నా, సోషల్ మీడియాల్లో కెప్టెన్ ప్రతి జ్ఞ, ఎవ్వరూ కదిలించలేడు అన్న అంశాలు చమత్కారాలకు దారి తీశాయి. కెప్టెన్ ఒక్కడే నోటుకు ఓటు ఇవ్వనని ప్రతిజ్ఞ చేస్తే ఎలా, మిగిలిన డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థుల చేత కూడా చేయించాలి మరీ..! అని వ్యంగ్యాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. అలాగే, ఎవ్వరూ విజయకాంత్‌ను కదిలించాల్సిన అవసరం లేదని, ఆయనే తుళ్లి పడతారులే అని చమత్కారాలు అందుకుని ఉండడం గమనార్హం. -
యువత ఓటెవరికి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడులోని నేతల తలరాత ఏమిటో తెలిసిపోతుంది. ఈనెల 16వ తేదీన ప్రజలు తీర్పు చెప్పేరోజుకాగా, 19వ తేదీన ఆ తీర్పును ప్రకటిస్తారు. ఎప్పటి మాటెలా ఉన్నా, ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాలను యువత శాసిస్తుందని ఆశిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద యువత శాతం అధికంగా ఉండేది భారత దేశంలోనేనని కొందరు ప్రముఖులు విశ్లేషించారు. దేశంలోని అన్నిశాఖలు, విభాగాల్లో యువతేజం వెల్లివిరుస్తోంది. భారతీయ యువత ప్రతిభను చేసి అమెరికా, చైనా దేశాలు విస్తుపోతున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో 18-23 వయస్సుగల దేశంలో యువత ఓటు 23 కోట్లుగా ఉండింది. తుపానులా ఎగిసిపడిన ఈ యువతలో 40శాతం నరేంద్రమోదీపై మోజుపడ్డారు. ఈ కారణంగానే కేంద్రంలో మోదీ ప్రధానిగా భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను యువత ఎలా శాసిస్తుందో అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మార్పు కోరుతున్న తమిళనాడు యువత: ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై యువత ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తమిళనాడులో 5.82 కోట్ల ఓటర్లు ఉండగా వీరిలో ఒకశాతం యువత ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 21లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటర్లైన యువతను ఆకట్టుకోగలమనే నమ్మకంతో అన్నాడీఎంకే, డీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేలకు 30 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికారంలో రావడం ఖాయమని అందరికీ తెలుసు. అయితే ఏపార్టీకి చెందని యువ ఓటర్లు 20 శాతం వరకు ఉన్నారు. వీరిలో 10 శాతం యువత ఓటు వేయకున్నా మిగిలిన 10 శాతం ఓటర్లే ఎమ్మెల్యేల గెలుపును నిర్దేశిస్తారు. యువత వేసే ఓట్లే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రతిబంబిస్తాయని ఎన్నికల కమిషన్ విశ్వసిస్తోంది. అందుకే నూరుశాతం ఓట్లు పోలయ్యేందుకు అన్ని విధాల కృషి చేస్తోంది. 1.5 కోట్ల యువ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు ‘వై రాజా మై’, ‘మిస్డ్‌కాల్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాలను వినియోగిస్తోంది. ఎన్నికల కమిషన్ యువతను ఆకర్షించే ప్రయత్నాలను గమనించిన పార్టీల వారు సైతం యువ ఓటర్లకు గాలం వేయడం ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది శాతం ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకోవడంపై అన్నిపార్టీలు దృష్టిపెట్టాయి. డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులంతా సామాజిక మాధ్యమాల ద్వారా యువతతో టచ్‌లో ఉన్నారు. ఈ మార్పును గమనించిన సంఘసేవకులు, న్యాయమూర్తులు సైతం మంచి నేతలను ఎన్నుకోండని ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ మెరుగు, ఏ నేత ఎలాంటి వాడు అని యువ ఓటర్లు గమనిస్తున్నట్లుగా యువత మధ్య ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఎన్నికల మేనిఫెస్టోకు యువత అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఆచరణలోకి రావని యువత నిర్దారించుకోవడమే ఇందుకు కారణం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలను యువత తీవ్రస్థాయిలో చీదరించికుంటున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వాల్లోని అవినీతిని రాజకీయ నేతలే పారద్రోలాలని యువత ఆశిస్తోంది. ఇందు కోసం గ్రామీణ యువతను సైతం కలుపుకుపోతోంది. అయితే రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నా, ఒక సునామీలా ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టేలా ఎవ్వరూ కనపడటం లేదని యువత విరక్తిని ప్రదర్శిస్తోంది. రాజకీయాల్లోకి రావడంపై కూడా యువత అయిష్టతను వ్యక్తం చేస్తోంది. నేటి రాజకీయ నేతల నుండి ఏమి ఆశించవచ్చు, ఏది ఆశించకూడదనే అంశంపై యువత స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లు తేలింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాలపై యువత అసక్తి చూపడంలేదు. సాగుభూమికి ఉచిత విద్యుత్, పేదలకు తక్కువ ధరకు ఆహారం, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా 20 కిలోల బియ్యం వంటివి మాత్రమే ప్రయోజనకరమనని భావిస్తున్నారు. పరిధికి మించి ఉచితాలను పంపిణీ చేయడం రాష్ట్ర ఆర్థికపరిస్థితిని దెబ్బతీయగలదని యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వంపై ప్రస్తుతం రూ.4లక్షల కోట్లు అప్పు ఉందని, ఈ అప్పుపై ప్రతినెల కొన్నివేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారని యువత తెలుసుకుంది. ఇలాంటి పరిస్థితిలో ఉచితంగా వస్తువుల పంపిణీ ఎలా సాధ్యం, వాటికి నిధులు ఎక్కడి నుండి సమకూర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఉచితాలు పంచేకంటే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి యువత నిరుద్యోగులుగా ఉండగా, వీరంతా ప్రతి నేత వద్ద ఉద్యోగాలు ఇవ్వండి బాబూ అంటూ మాత్రమే వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని పరిస్థితిపై అన్ని కోణాల్లో అవగాహన పెంచుకున్న యువత ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది బహిర్గతం కావడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజమని నమ్మవచ్చు. పాతను యువత వ్యతిరేకిస్తోంది, అలాగని కొత్తగా ఎవరిని అందలం ఎక్కించాని సందిగ్ధం నెలకొని ఉంది. అయితే యువత లోలోన ఏదోఒక నిర్ధారణకు వచ్చినట్లు కనపడుతోంది. ఈ నిర్ణయం ద్రవిడ పార్టీలకు అనుకూలమా, ప్రతికూలమా అని తెలుసుకోవాలంటే ఈనెల 19 వరకు ఆగాల్సిందే. రాష్ట్రంలో వయస్సుల వారీగా ఓట్లు 18-19 వయస్సు ఓటర్లు - 21,05,344 20-29 వయస్సు ఓటర్లు - 1,17,76,288 30-39 వయస్సు ఓటర్లు - 1,39,83,613 40-49 వయస్సు ఓటర్లు - 1,24,89,260 50-59 వయస్సు ఓటర్లు - 87,32,151 60-69 వయస్సు ఓటర్లు - 56,15,630 70-79 వయస్సు ఓటర్లు - 26,58,699 80 ఏళ్లు నుంచి ఆపై వయస్సున్న ఓటర్లు - 8,40,635 మొత్తం ఓట్లు: 5,82,01,620 పురుషులు: 2,88,62,973 స్త్రీల్లు: 2,93,33,927 -
మేము రెడీ.. మరి వాళ్లో!
సాక్షి, చెన్నై: అధికారంలోకి రాగానే, తమ వాళ్లకు చెందిన మద్యం తయారీ పరిశ్రమలన్నీ మూత వేయడానికి సిద్ధమయ్యామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి అంటున్నారు. ఇది, తానొక్కదాన్నే చెప్పడం లేదని, ఆయా సంస్థలకు చెందిన వాళ్లూ రెడీ అయ్యారని వ్యాఖ్యానిస్తూ, మరి మిడాస్కు తాళం ఎప్పుడు పడుతుందో అని ప్రశ్నించారు. రాష్ర్టంలో సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే కూడా ఉంది. అన్నాడీఎంకే మాత్రం దశల వారీ అన్న నినాదాన్ని ప్రకటించి ఉన్నది. డీఎంకే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించి, ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, డిఎంకేకు చెందిన నాయకులు అన్నాడీఎంకే వర్గాలపై, అన్నాడీఎంకే నాయకులు డీఎంకే వర్గాలకు సవాళ్లు విసురుతూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం, అధికారంలోకి రాగానే తమ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అని డీఎంకే నినాదం అందుకోగా, మరీ తమరెప్పుడు అంటూ అన్నాడీఎంకే మద్యం ఫ్యాక్టరీ యజామానుల్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తమ వాళ్లందరూ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మాట అన్నది తాను మాత్రమే కాదు అని, సంబంధిత వ్యక్తులు కూడా స్పష్టం చేసి ఉన్నారన్నారు. అయితే, తాము రెడీ అయ్యామని, అలాంటప్పుడు వాళ్లకు చెందిన ‘మిడాస్’ ఎప్పుడు మూసి వేయబోతున్నారో ప్రశ్నించడంటూ మీడియాకు సూచించారు. అన్నాడీఎంకే వర్గాలకు చెందిన మిడాస్లో అనేక బ్రాండ్ల మద్యం తయారు అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు మద్యం సరఫరా అవుతున్నది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న మిడాస్ను ఎప్పుడు మూస్తారో అంటూ కనిమొళి ప్రశ్నించడం విశేషం. అయితే, డీఎంకే అధికారంలో వస్తే, సర్వాధికారాలు వారి చేతికి వచ్చినట్టే. అలాంటప్పుడు ‘మిడాస్’ను మూయించ లేరా..?, మరీ, వాళ్లే ఎందుకు తాళం వేసుకోవాలో..? అని పెదవి విప్పే వాళ్లే అధికం. -
మౌనం వీడండి!
ప్రధానికి కరుణ సూచన కొనసాగుతున్న దాడులు తనిఖీలు ముమ్మరం సాక్షి, చెన్నై: తమిళనాట ఎన్నికల్లో అధికార పక్షం అవినీతి సొమ్ము బయట ప డుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. ఇప్పటి కైనా మౌనం వీడి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నగదు బట్వాడా లక్ష్యం గా ఈసీ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల మేరకు నగదు పట్టుబడుతున్నా, ఇంత వరకు కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పవచ్చు. ఇవన్నీ అన్నాడీఎంకే వర్గాలకు చెందిన సొమ్ముగా మీడియాల్లో కథనా లు వెలువడుతూ వస్తున్నాయి. ఆదివా రం కూడా పెద్ద ఎత్తున నగదు, తాయిలాలు పట్టుబడ్డాయి. మదురైలో రెండాకుల చిహ్నంతో కూడిన 60 ఫ్రిడ్జ్‌లు, నాట్రాంపల్లిలో రెండాకుల చిహ్నంతో కూడి రూ. కోటి 11 లక్షలు విలువగల వస్త్రాలు, కడలూరులో మంత్రి సంపత్ ఇంటికి సమీపంలో మినీలారీలో ఉన్న వస్తువులు, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ఇలాక బోడి నాయకనూరులో రెండు లారీల్లో తీసుకొచ్చిన చీరలు, టో పీలను, పందలూరులో ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, రాశిపురంలో అన్నాడీఎంకేకు చెందిన నాయకుడి పరిశ్రమ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అ యితే, ఇంతవరకు పట్టుబడ్డ నగదు, వస్తువులు, వస్త్రాలు ఎవరివో అన్న వివరాలు మాత్రం బయటకు రావడం లే దు. కేసులు కూడా నమోదు కాలేదని చె ప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇదే అంశాల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినే త ఎం కరుణానిధి ఎన్నికల యంత్రాం గానికి ప్రశ్నల్ని సంధించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రజ ల తరఫున నిలదీస్తూ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే సర్కారు ఐదేళ్లల్లో సాగించిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. పట్టుబడుతున్న నగదు, తాయిలాలు అన్నీ ఆ పార్టీ వారికి చెందినవిగా సంకేతాలు వ స్తున్నాయని, అయితే, ఇంత వరకు వివరాలు ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. తమిళనాట సాగిన అవినీతి అక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచి స్తూ, తాజాగా సాగుతున్న వ్యవహారాల పై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌ నంగా ఉన్నారో అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కల్పించుకోవద్దని హితవు పలికారు. -
రసవత్తరంలో మ్యాంగో నగర్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత దేశంలో సేలం అతి పెద్ద మ్యాంగో నగరం. అత్యధిక నియోజకవర్గాలను కల్గిన ఈ జిల్లాలో ఈ సారి రసవత్తర సమరం సాగుతున్నది. కొత్త ముఖాలు అత్యధికంగా రేసులో ఉండగా, ముగ్గురు సీనియర్లు, నలుగురు మాజీలు మళ్లీ పోటీకి సిద్ధం కావడంతో గెలుపు గుర్రాలు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకేల మధ్య సమరం హోరాహోరీగా సాగుతున్నది. అతి పెద్ద మ్యాంగో మార్కెట్ పేదల ఊటీగా పిలవబడే ఏర్కాడులు సేలం జిల్లాలోనే ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే సీనియర్లు వాళ్లప్పాడి రామమూర్తి, వీర పాండి ఆర్ముగం చక్రం తిప్పిన జిల్లా. గతంలో సాగిన పునర్విభజన ప్రభావంతో ఈ జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపాలే మారాయి. తారా మంగళం, పనమరత్తు పట్టి వంటి నియోజకవర్గాలు ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతు అయ్యాయి. సేలం నగరాన్ని మూడుగా చీల్చేశారు. తలవాసల్గా ఉన్న స్థానాన్ని గంగవళ్లిగా పేరు మార్చారు. పక్కనే ఉన్న నామక్కల్ జిల్లాకు చెందిన శంఖగిరిని సేలం జిల్లా పరిధిలోకి తీసుకొచ్చేశారు. అందుకే ఇక్కడి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో గందర గోళ పరిస్థితి ఉంటుంది. ఈ జిల్లాలో ప్రస్తుతం గంగవళ్లి (రి), ఆత్తూర్ (రి), ఏర్కాడు (రి), ఓ మలూరు, మెట్టూర్, ఎడప్పాడి, శంఖగిరి, సేలం పశ్చిమం, సేలం ఉత్తరం, సేలం దక్షిణం, వీర పాండి అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తొలుత కాంగ్రెస్‌కు తదుపరి డీఎంకే కంచుకోటగా ఉన్న ఈ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రస్తుతం అన్నాడీఎంకే పాగా వేసింది. వెనుక బడిన వర్గాలు, మైనారిటీలు, వన్నియర్ సామాజిక వర్గంతో పాటుగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య కూడా ఇక్కడి నియోజకవర్గాల్లో ఎక్కువే. వీరి ఆశీస్సుల కోసం అభ్యర్థులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. ఈ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 లక్షల 96 వేల 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14 లక్షల ఆరు వేల 392 మంది పురుషులు, 13 లక్షల 90 వేల 321 మంది స్త్రీలు, 271 మంది ఉన్నారు. సేలం(పశ్చిమం): గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన నియోజకవర్గం ఇది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడిఎంకేకు చెందిన జి వెంకటాచలం ఉన్నారు. మళ్లీ ఆయనకే సీటు దక్కింది. గతంలో తాను చేసిన ప్రగతి పనులు, అమ్మ ఆశీస్సులతో మళ్లీ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థిగా పన్నీరు సెల్వం రేసులో ఉన్నారు. ఓటర్లకు సుపరిచితుడైన ఈ మాజీ డిప్యూటీ మేయర్ ఈ సారి పాగా వేసి తీరుతానన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాల్ని అస్త్రంగాచేసుకుని ఓట్ల వేటలో పడ్డారు. ఇక, ఓట్లను చీల్చి సత్తాను చాటుకునేందుకు పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యద ర్శి ఇర అరుల్ బరి దిగారు. అలాగే, ప్రజా సంక్షేమ కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా సేలం ఉత్తరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రాజులు రేసులో దిగడంతో నలుగురు సమ ఉజ్జీల మధ్య సమరం వేడెక్కింది. సేలం(ఉత్తరం): ఇది కూడా గత ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన స్థానం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డీఎండీకేకు చెందిన మోహన్ రాజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనడంతో గట్టెక్కారు. ఈ సారి ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ మోహన్ రాజ్ బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే, తన మకాంను సేలం పశ్చిమానికి మార్చేశారు. ఇందుకు కారణం అదృష్టం కలిసి వచ్చేనా అన్న బెంగే అంటా..!, ఇక ప్రజా సంక్షేమ కూటమిలో ఈ సీటును తమిళ మానిల కాంగ్రెస్‌కు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా దేవదాసు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కేఆర్ఎస్ శరవణన్ డీఎంకే అభ్యర్థిగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ రేసులో ఉన్నారు. కేఆర్ఎస్ శరవణన్ కొత్త ముఖం కావడంతో ఓటర్ల ప్రసన్నం కోసం సీనియర్లతో కలిసి తీవ్ర కుస్తీలు పడుతున్నారు. డిఎంకే అభ్యర్థి రాజేంద్రన్ మాజీ ఎమ్మెల్యేగా ఓటర్లకు సుపరిచితులే. ఇక, పీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కదిర్ రాజరత్నం పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీగోపినాథ్ పోటీ చేస్తున్నారు. అయితే, ఇక్కడి ఓటరు నాడి ఎటో అన్నది మాత్రం అంతుచిక్కని పరిస్థితి. సేలం(దక్షిణం): గత ఎన్నికల్లో ఇది కూడా కొత్తగా పుట్టుకొచ్చిన సీటు. ఇక్కడి అన్నాడీఎంకేకు చెందిన ఎంకే సెల్వరాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టారు. కొత్త ముఖంగా ఎబి శక్తి వేల్ బరిలో దిగారు. ఇక, డిఎంకే తరపున కూడా కొత్త ముఖంగా గుణశేఖర్ రేసులో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు గెలుపు లక్ష్యంగా ప్రజా మద్దతుకు సిద్ధం కావడంతో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారో..!. ఇక తాను సైతం అంటూ బీజేపీ అభ్యర్థిగా అన్నాదురై రేసులో ఉన్నారు. వీర పాండి: ఇది డీఎంకే సీనియర్ వీర పాండి ఆర్ముగం సొంత గడ్డ. అయితే. ఒక్క సారి కూడా ఆయన ఇక్కడ పోటీ చేయలేదు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆరు, డీఎంకే నాలుగు సార్లు గెలిచాయి. అయితే, 1991 నుంచి ఇక్కడ ఓ సారి డీఎంకే, మరో సారి అన్నాడీఎంకేలు విజయకేతనం ఎగుర వేశాయి. ఇక, తనకు బదులుగా గతంలో వారసుడు ఎ రాజేంద్రన్ అలియాస్ రాజను ఇక్కడి నుంచి వీరపాండి ఆర్ముగం పోటీకి దించారు. ఓ సారి గెలిచినా, మరో సారి ఆయనకు ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్కే సెల్వం విజయ కేతనం ఎగుర వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈ సారి సీటు దక్కలేదు. మహిళా అభ్యర్థిగా ఎస్ మనోన్మణి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో చేజారిన విజయాన్ని మళ్లీ దక్కించుకునేందుకు వీర పాండి వారసుడు రాజేంద్రన్ పోటీకి సిద్ధం అయ్యారు. ఓటర్లను ఆకర్షించే ప్రసంగంతో ముందుకు సాగుతున్నా, గతంలో సాగించిన భూదందాల్ని ఇంకా ఓటర్లు మరవ లేదని చెప్పవచ్చు. సీపీఐ అభ్యర్థిగా మోహన్, పీఎంకే అభ్యర్థిగా పి సామ్రాజ్ రేసులో ఉండటంతో ఓట్ల చీలిక ఆధారంగా డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఎవరో ఒకరు తక్కువ మెజారిటీతో గట్టెక్కాల్సిందే. ఓ మలూరు: అన్నాడీఎంకేకు బలం ఉన్న స్థానం ఇది. ఇక్కడి నుంచి ఆరు సార్లు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, డీఎంకే, తమిళమానిల కాంగ్రెస్, పీఎంకేలు తలా ఓ సారి గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన సి కృష్ణన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త ముఖంగా ఎస్ వెట్రివేల్‌ను పోటీకి దించారు. అమ్మ చరిష్మా, పార్టీ బలం గెలిపిస్తుందన్న నమ్మకంతో ప్రజా మద్దతు కోసం పరుగులు తీస్తున్నారు. ఇక, డీఎంకే కూడా కొత్త ముఖంగా అమ్మాస్సీని అభ్యర్థిగా ప్రకటించింది. 1971 తర్వాత తమకు చాన్స్ ఇవ్వని దృష్ట్యా, ఈ సారి అవకాశం ఇస్తే, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ అమ్మాస్సీ ఓట్ల వేటలో ఉన్నారు. ఇక, ఈ ఇద్దరికి సరైన ప్రత్యర్థిగా ప్రజా సంక్షేమ కూటమి రేసులో దించింది. డీఎండీకే కోశాధికారి ఇలంగోవన్ ఇక్కడ పోటీకి దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి ఓ మారు అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఎ తమిళరసు పీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇద్దరు కొత్త ముఖాలు, ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ పార్టీ సీనియర్ నేత తలబడుతుండడంతో సమరం ఆసక్తికరంగా మారింది. ఎడప్పాడి: ఇది పీఎంకే, అన్నాడీఎంకేల కోట. అలాగే, వీఐపీ స్థానం. 1971 తర్వాత ఇక్కడ డీఎంకే గెలిచింది లేదు. ఈ సారి ఒక్క చాన్స్ అంటూ డీఎంకే అభ్యర్థిగా ఎడపాడి పీసీ మురుగేషన్ పోటీకి సిద్ధమయ్యారు. అయితే, ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎడ పాడి కె పళని స్వామి ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా అవతరించిన కె పళని స్వామి హవాను ఎదుర్కొనేందుకు మురుగేషన్ తీవ్ర ప్రచారంలో ఉన్నారు. అదే సమయంలో ఎడపాడికి చెక్ పెట్టేందుకు పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థిగా తంగ వేల్ రేసులో దిగారు. కార్మిక, అన్నదాతల ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు సీపీఎం, వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కైవసానికి పీఎంకేలు సిద్ధం కావడం, ఒక్క చాన్స్ అంటూ మురుగేషన్ తీవ్ర ఓట్ల వేటలో ఉండటం వెరసి మంత్రికి మళ్లీ చాన్స్ దక్కేనా..! మెట్టూరు: ఇది మరో వీఐపీ నియోజకవర్గం. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, అన్నాడీఎంకే కార్యదర్శి సెమ్మలై పోటీలో ఉన్న స్థా నం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పైచే యి. డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, సీపీఎంలు తలా ఓ సారి గెలి చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి డీఎండీకే అభ్యర్థిగా పార్తీబన్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అన్నాడీఎంకే కూటమితో కలిసి గత ఎన్నికల్లో పనిచేసిన పార్తీబన్ ఈ సారి డీఎండీకే నుంచి బయటకు వచ్చారు. డీఎంకే తరఫున ఎండీఎండీకే అభ్యర్థిగా పోటీకి సిద్ధం అయ్యారు. డీఎంకే అభ్యర్థిగా ఆయన ప్రచారంలో దూసుకెళ్తోంటే, అన్నాడీఎంకే అభ్యర్థిగా సెమ్మలైకు సీటు దక్కడంతో సమరం వేడెక్కింది. ఇక, గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కిన పీఎంకే అధ్యక్షుడు జికే మణి, బిజేపి అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం రేసులో ఉండడంతో సమరం హోరాహోరీగా మారింది. శంఖగిరి: నామక్కల్ జిల్లా నుంచి సేలంలోకి గతంలో వచ్చిన స్థా నం ఇది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది. 1989 నుంచి డీఎంకే ఓ సారి, అన్నాడీఎంకే మరో సారి విజయ కేతనం ఎగుర వేస్తున్నాయి. ఇక్కడ సి ట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన పీ విజయలక్ష్మి ఉన్నా రు. ఈ సారి ఆమెను పక్కన పెట్టి కొత్తముఖంగా ఎస్ రాజా రేసు లో దిగారు. డిఎంకే కూటమి ఈ సీటును కాంగ్రెస్‌కు అప్పగించిం ది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్త ముఖం కె రాజేశ్వరన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇక, కాంగ్రెస్ ఓట్లను చీల్చే దిశగా ప్రజా సంక్షేమ కూటమి తరపున తమిళ మానిల కాంగ్రెస్ అభ్యర్థి సెల్వకుమార్, బీజేపీ అభ్యర్థిగా ఏసీ మురేగేషన్ బరిలో ఉన్నారు. ఈ నలుగురు కొత్త వాళ్లే కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..! ఏర్కాడు (రి): పేదల ఊటి ఇది. గిరిజన , అటవీ గ్రామాల్లోని ప్రజల ఓటు బ్యాంక్ న్యాయ నిర్ణేతలు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఏడు సార్లు, డీఎంకే మూడు సార్లు, కాంగ్రెస్ ఓ సారి ఇక్కడ గెలిచాయి. అన్నాడీఎంకేకు చెందిన పి సరోజ సిట్టింగ్ ఎమ్మెల్యే. సరోజను పక్కన పెట్టి కొత్త ముఖంగా కె చిత్రను తెర మీదకు తెచ్చారు. ఓటర్లను ఆకర్షించడంలో చిత్ర ముందంజలో ఉన్నారు. డిఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ రేసులో దిగడం కలిసి వచ్చే అంశం. ఇక, ఓట్లను చీల్చేందుకు ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా కుమార్, బీజేపీ అభ్యర్థిగా పొన్రాస్ పోటీకి సిద్ధమయ్యారు. గంగవళ్లి(రి): డీఎండీకేకు చెందిన ఆర్ సుభా సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పనిచేసిన ఆర్ సుభా, ఈ సారి ప్రజా సంక్షేమకూటమి డీఎండీకే అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్నారు. అయితే, అదృష్టం ఏ మేరకు కలి వస్తుందో అన్నది అనుమానమే. అన్నాడీఎంకే అభ్యర్థిగా న్యాయవాది మరుద ముత్తు, డీఎంకే అభ్యర్థిగా సేలం మాజీ మేయర్ ప్రియదర్శిని పోటీకి సిద్ధం అయ్యారు. ఈ ఇద్దరు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు కావడంతో పోటీ ఆసక్తికరం. ఇక, బీజేపీ అభ్యర్థిగా శివగామి పరమశివం ఓట్ల వేటలో ఉరకలు తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా, డీఎంకే అభ్యర్థి ప్రియదర్శిని మహిళా అభ్యర్థులుగా ఢీ కొడుతున్నారు. ఆత్తూర్(రి): ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కోట. అన్నాడీఎంకే పాగా వేసింది. తదుపరి డిఎంకే కూడా అప్పుడప్పుడు బలాన్ని చాటుతున్నది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, అన్నాడీఎంకే, డీఎంకేలు తలా మూడు సార్లు గెలిచాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాడీఎంకేకు చెందిన ఎస్ మాదేశ్వరన్ ఉన్నారు. ఈ సారి ఆయన్ను పక్కన పెట్టి కొత్త వ్యక్తి ఆర్ఎం చిన్న తంబి పోటీకి సిద్ధమయ్యారు. తమ చేతి నుంచి జారిన ఈ సీటును మళ్లీ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఎస్కే అర్ధనారి పోటీకి దిగారు. పీఎంకేకు కూడా ఇక్కడ బలం ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా హంసవేణి రేసులో ఉన్నారు. -
సీఎంల జిల్లా తేని
సాక్షి, చెన్నై: పశ్చిమ పర్వత శ్రేణుల్ని తనలో ఇముడ్చుకుని ఆహ్లాదకరంగా కనిపించే జిల్లా తేని. దివంగత ఎంజీయార్, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, సీనియర్ నేత ఓ పన్నీరు సెల్వంలను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోపెట్టిన ఘనతను ఈ జిల్లా దక్కించుకుంది. ఈ జిల్లాను తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు పరుగులు తీస్తున్నాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో వ్యవసాయం కీలక ఆధారంగా జీవనం సాగిస్తున్న ప్రజానీకం తేని జిల్లాలో ఉన్నారు. పచ్చటి పొలాలు, ద్రాక్ష తోటలు, పెరియార్, వైగై నదులు, మంజలార్, సోత్తుపారై వంటి జలాశయాలు, మేఘమలై వంటి జలపాతాలు ఇక్కడ ఆహ్లాదకరంగా కన్పిస్తుంటాయి. ఇక ముగ్గురు సీఎంలను ఇక్కడి నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కించడంతో పాటు దక్షిణ భారత సినీ వినీలాకాశంలో ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు భారతీరాజ, సంగీత దర్శకుడు ఇళయరాజ, రచయిత వైరముత్తు ఈ జిల్లా నుంచే తెర మీదకు వచ్చిన వాళ్లే. ఒకప్పుడు ఐదు నియోజకవర్గాల్ని కల్గిన ఈ జిల్లాలో ప్రస్తుతం నాలుగే మిగిలాయి. జిల్లా కేంద్రం పేరుతో ఉన్న తేని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతైంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఆండిపట్టి, పెరియకుళం(రి), బోడి నాయకనూరు, కంబం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కావడంతో అన్నదాతల ఓటు బ్యాంకే అధికం. అలాగే, అటవీ గ్రామాల్లోని గిరిజన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా న్యాయ నిర్ణేతలే. ఈ జిల్లాలో మొత్తంగా పది లక్షల 30 వేల 137 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఐదు లక్షల 11 వేల 217 మంది పురుషులు, ఐదు లక్షల 18 వేల 792 మంది స్త్రీలు, 128 మంది ఇతరులు ఉన్నారు. ఆండి పట్టి: ఇది 2011కు పూర్వం వీవీఐపీ నియోజకవర్గం జాబితాలో ఉండేది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీయార్ ఇక్కడి నుంచే ఒకప్పుడు సీఎం పగ్గాలు చేపట్టారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా అన్నాడీఎంకేను నడిపిస్తున్న అధినేత్రి జయలలిత కూడా ఇదే నియోజకవర్గం నుంచి సీఎం సింహాసనం అధిరోహించారు. గత ఎన్నికల వరకు ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జయలలిత వ్యవహరించే వారు. గత ఎన్నికల్లో ఆమె తన మకాంను శ్రీరంగంకు మార్చేసినా, ఆండి పట్టి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఎన్నికల్లో తన ప్రతినిధిగా తంగ తమిళ్ సెల్వన్‌ను బరిలోకి దించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ తాజా ఎన్నికల్లో తంగ తమిళ్ సెల్వన్ రేసులో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఎనిమిది సార్లు విజయ కేతనం ఎగుర వేసిందంటే, ఇది ఆ పార్టీ కంచుకోటే. ఇక్కడ రెండు లక్షల 52 వేల 747 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 26 వేల 270 మంది పురుషులు, లక్షా 26 వేల 462 మంది స్త్రీలు, పదిహేను మంది ఇతరులు ఉన్నారు. వీరి మద్దతుతో మళ్లీ విజయ కేతనం ఎగుర వేయడానికి తంగ త మిళ్ సెల్వన్ పరుగులు తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థి ఎల్ మూక్కయ్య మళ్లీ రేసులో దిగారు. గతంలో చేజార్చుకున్న చాన్స్‌ను ఈ సారి దక్కించుకునేందుకు మూక్కయ్య తీవ్రంగా కుస్తీలు పడుతున్నారు. నియోజకవర్గంలో మూక్కయ్య బలమైన వ్యక్తి కావడంతో ఈ సారి సమరం హోరాహోరీ. ఇక ఓట్లను చీల్చేందుకు డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తి రేసులో ఉన్నారు. పెరియకుళం(రి): ఒకప్పుడు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో రిజర్వుడ్‌గా మారింది. ఇది వరకు ఇక్కడి నుంచి రెండు సార్లు అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీరు సెల్వం అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తొలిసారిగా తమ అమ్మ జయలలిత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టడంతో, ఈ నియోజకవర్గం హోదా పెరిగింది. ఈ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేయడంతో పాటు ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రావడంతో వ్యక్తిగత పలుకుబడిని పెంచుకున్నారు. అయితే, నియోజకవర్గం రిజర్వుడ్‌గా మారడంతో తన మకాంను పక్కనే ఉన్న బోడినాయకనూరుకు మార్చుకోవాల్సిన పరిస్థితి పన్నీరుకు తప్పలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి ఎ. లాసర్ విజయకేతనం ఎగుర వేశారు. ప్రస్తుతం సీపీఎం గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే పరుగులు తీస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాసర్ ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థిగా మళ్లీ రేసులో దిగారు. ఆయన్ను ఢీకొట్టేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా కదిర్ రాము పోటీకి దిగారు. పన్నీరు అభివృద్ధి, వ్యక్తిగత హవా తనకు కలిసి వస్తాయన్న ఆశాభావంతో కదిర్ కాము ఉన్నారు. ఇక, డీఎంకే అభ్యర్థిగా వి అన్భళగన్, బీజేపీ అభ్యర్థిగా శ్రీ చెల్లం పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో లాసర్ చేతిలో ఓటమి చవి చూసిన తామకుళంకు చెందిన డీఎంకే అభ్యర్థి వి అన్భళగన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ సారి ఓటర్లు తప్పకుండా తనను ఆదరిస్తారన్న ధీమాతో ఉన్నారు. ఇక, ఈ నియోజవకర్గంలో రెండు లక్షల 58 వేల 145 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో లక్షా 27 వేల 937 మంది పురుషులు, లక్షా 30 వేల 131 మంది స్త్రీలు, 77 మంది ఇతరులు ఉన్నారు. వీరి నాడి ఎటో అన్నది ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే. బోడినాయకనూరు: ఇక్కడ ఓ సారి డీఎంకే, మరో సారి అన్నాడీఎంకే అన్నట్టుగా ఓటర్లు తమ తీర్పును ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తన మకాంను ఇక్కడికి మార్చుకున్న పన్నీరు సెల్వం, అప్పటి సిటింగ్ డీఎంకే ఎమ్మెల్యే లక్ష్మణ్‌ను ఓడించి ఆర్థికమంత్రిగా అవతరించారు. మరోసారి తమ అమ్మ జయలలిత సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనడంతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టిన ఘనత పన్నీరుకు దక్కింది. పీఎం పగ్గాలు చేపట్టినా, ఈ సారి నియోజకవర్గం మీద మాత్రం ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో పన్నీరు అండదండాలతో ఆప్తులు వీరంగాలు సృష్టించడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం ప్రతికూల వాతావరణాన్ని సృష్టించి ఉన్నాయి. మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి పన్నీరు సెల్వం పోటీ చేస్తుండడంతో, ఆయన్ను ఢీకొట్టేందుకు మరో మారు లక్ష్మణన్‌ను సిద్ధమయ్యారు. వ్యక్తిగత పలుకుబడి కల్గిన వ్యక్తిగా డీఎంకేకు చెందిన లక్ష్మణన్‌కు ఇక్కడ పేరు ఉంది. పన్నీరు, ఆప్తులు అవినీతి, వీరంగాల్ని అస్త్రంగా చేసుకుని ప్రచారంలో లక్ష్మణన్ దూసుకెళుతున్నారు. అదే సమయంలో మళ్లీ గెలుపు కోసం పన్నీరు, ఆప్తులు తీవ్రంగా ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఇక, తానూ రేసులో ఉన్నట్టుగా బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వరన్ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక్కడ రెండు లక్షల 57 వేల 98 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో లక్షా 27 వేల 706 మంది పురుషులు, లక్షా 29 వేల 381 మంది స్త్రీలు, 11 మంది ఇతరులు ఉన్నారు. కంబం: ఈ నియోజకవర్గం ఓటర్ల రూటే సపరేటు. కొంత కాలం అన్నాడీఎంకే గుప్పెట్లో, తదుపరి డీఎంకే, కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, ఎండీఎంకే గుప్పెట్లో ఈ నియోజకవర్గం ఉండేది. ఎండీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని 2006లో తన గుప్పెట్లోకి మళ్లీ డీఎంకే తీసుకుంది. ఇందుకు కారణం తన పేరులోనే కంబం చిరునామాగా కల్గిన ఎన్ రామకృష్ణన్ డీఎంకే అభ్యర్థి కావడమే. ఎండీఎంకే నుంచి బయటకు వచ్చిన రామకృష్ణన్ వరస విజయాలతో ముందుకు సాగుతున్నారు. నాలుగోసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు పరుగులు తీస్తున్నారు. అయితే, ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు కారణం అన్నాడీఎంకే అభ్యర్థిగా జక్కయ్యన్, ప్రజా సంక్షేమ కూటమి తరఫున తమిళ మాని రామచంద్రన్ రేసులో ఉన్నారు. గతంలో రామచంద్రన్ ఓ సారి కాంగ్రెస్ తరఫున, రెండు సార్లు తమిళ మానిల కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ మెట్లు ఎక్కి ఉండడం గమనార్హం. ఇక, బీజేపీ అభ్యర్థిగా శ్రీ ప్రభాకరన్ బరిలో ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ అభ్యర్థులు బలమైన వ్యక్తులు కావడంతో సమరం హరోహోరీగా సాగే అవకాశాలు ఎక్కువే. ఇక్కడ రెండు లక్షల 62వేల 147 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 29వేల 304 మంది పురుషులు, లక్షా 32వేల 818 మంది స్త్రీలు, 25 మంది ఇతరులు ఉన్నారు. -
మీడియాపై కెప్టెన్ చిందులు
పిడికిలి బిగించి ఆక్రోశం సర్వత్రా విస్మయం అభ్యర్థులతో సేలంలో సమావేశం డీఎండీకే అధినేత విజయకాంత్ మళ్లీ తన చేతికి పని పెట్టే పనిలో పడ్డారు. మీడియాపై చిందులు తొక్కడమే కాకుండా, నాలుక మడిచి, పిడికిలి బిగించి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తన పక్కనే ఉన్న ప్రయివేటు భద్రతా సిబ్బందికి మోచేతి గుద్దుల రుచి చూపించారు. సీఎం అభ్యర్థి ఇలా బాదుడికి దిగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. సేలంలో హఠాత్తుగా అభ్యర్థులతో కెప్టెన్ సమాలోచించడం గమనార్హం. సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్న విషయం తెలిసిందే. ఆయన ప్రసంగాలు శైలి గందరగోళమే. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చేతి దెబ్బ ఎవరో ఒకరు రుచి చూడక తప్పదు. అది అభ్యర్థి కావొచ్చు, పార్టీ నాయకులు కావచ్చు. కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. ఇన్నాళ్లు ఓ పార్టీ నేతగా ఆయన ప్రచారాల్లో వ్యవహరించిన తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయకాంత్ హోదా పెరిగింది. ఐదు పార్టీలు కలిసి ఆయన్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. దీంతో తదుపరి సీఎం తానే అన్న ధీమాతో విజయకాంత్ ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లు మీడియాపై పదే పదే చిందులు తొక్కుతూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కాస్త తగ్గారు. హుందాతనాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేసినా, చివరకు తానింతే అని దూకుడుగా ప్రదర్శించి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. బుధవారం హఠాత్తుగా సేలం లో పార్టీ జిల్లాల కార్యదర్శులు, 104 మంది అభ్యర్థులతో సమావేశానికి విజయకాంత్ పిలుపు నివ్వడంతో అక్కడికి వచ్చిన మీడియాకు చీవాట్లు తప్పలేదు. పిడికిలి బిగించి చివరకు ఆక్రోశాన్ని పక్కనే ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించిన విజయకాంత్‌పై సెటైర్లు బయలు దేరాయి. కెప్టెన్ బాధుడు : సేలం ఐదు రోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో పార్టీ కార్యదర్శులు, అభ్యర్థుల సమావేశానికి చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదు. వీడియో కెమెరాలు, ఫోటో గ్రాఫర్లు ఆ దరిదాపుల్లోకి రాకూడదన్న ఆంక్షలు సైతం విధించారు. పది గంటల సమయంలో ఎన్నికల అధికారి శేఖర్ ఓ వీడియో గ్రాఫర్ తో కలిసి అక్కడికి వచ్చారు. అయితే, ఆయన్ను లోనికి అనుమతించ లేదు. తీవ్ర ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేసిన తదుపరి అనుమతించారు. సరిగ్గా పదకొండున్నర గంటల సమయంలో విజయకాంత్ అక్కడికి వచ్చారు. ఆయన తన వాహనం నుంచి దిగడంతో సమావేశం ప్రాధాన్యతను గురించి తెలుసుకునేందుకు మీడియా ఉరకలు తీసింది. మీడియా చుట్టుముట్టడంతో విజయకాంత్ సహనం కోల్పోయారు. తానో సీఎం అభ్యర్థి అన్న విషయాన్ని మరిచి నాలుక మడిచి , పిడికిలి బిగిస్తూ మీడియా వర్గాలపై దాడికి యత్నించే విధంగా ప్రయత్నం చేశారు. అంతలో తనను తాను శాంతించుకుని వద్దన్నట్టుగా చేతులు ఊపుతూ ముందుకు వెళ్లే యత్నం చేశారు. ఓ మీడియా ప్రతినిధి మైక్ విజయకాంత్ ముందుగా ప్రత్యక్షం కావడంతో ఆక్రోశాన్ని ఆపుకోలేక, ఆ మైక్‌ను దూరంగా విసిరి కొట్టారు. అంతటితో ఆగకుండా, ముందుకు సాగుతూ తన వెనుక రక్షణగా వస్తున్న ప్రైవేటు భద్రతా సిబ్బంది ఆక్రోశాన్ని ప్రదర్శించారు. మో చేతితో అతడి ముఖం మీద గుద్దుతూ విజయకాంత్ వ్యవహరించిన తీరు అనేక తమిళ ఛానళ్లకు హాట్ టాపిక్‌గా మారాయి. పదే పదే ఆయన వ్యవహరించిన తీరును ప్రసారం చేస్తూ, సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. ఇక, విజయకాంత్ ఆక్రోశంతో వీర బాదుడు పర్వాన్ని మళ్లీ కొనసాగించే పనిలో పడటంతో ఇక, అభ్యర్థులు, ఆ పార్టీ నాయకులు ఆయనకు కాస్త దూరంగా ఉండాల్సిందే. అలాగే, ఐదు పార్టీల నాయకులు ఏదేని వేదిక పై ప్రత్యేక్షమైన పక్షంలో విజయకాంత్‌కు కాస్త దూరంగా కూర్చుంటే సరి, లేదంటే ఆయన బాదుడు రుచి చూడాల్సిందే అన్న చమత్కారాలు సోషల్ మీడియాల్లో బయలు దేరాయి. -
ఓట్ల వేట
వేడిక్కిన ప్రచారం రోడ్ షోలతో నేతల పలకరింపు అభ్యర్థుల పరిచయాలు నెలాఖరులో రాహుల్ మేలో మోదీ, సోనియా రాక అభ్యర్థుల జాబితాల ప్రకటనతో ఓట్ల వేటలో రాజ కీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. ప్రజల్ని ఆకర్షించి మద్దతు సేకరణలో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో పరుగులు తీస్తున్నారు. రాజకీయ మేధావి డీఎంకే అధినేత కరుణానిధి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. సోనియా, రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టనున్నారు. మే మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సాక్షి, చెన్నై : మే 16 అసెంబ్లీ ఎన్నికల తేదీ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు శుక్రవారం నుంచి స్వీకరించనున్నారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగం, మరో వైపు రాజకీయ పక్షాలు దూసుకెళుతుండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రాజుకున్నట్టు అయింది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. పంచముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పగ్గాలు లక్ష్యంగా అందరూ నినాదాన్ని అందుకుని ఉన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ రెండాకులు రెప రెపలాడలన్న తపనతో అన్నీ తానై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఒక రోజు ప్రచారం ఒక రోజు విరామం అన్నట్టుగా ప్రచార బహిరంగ సభలు సాగుతూ వస్తున్నాయి. బుధవారం సేలంలో జరిగిన బహిరంగ సభలో డీఎంకేను టార్గెట్ చేసి అమ్మ తీవ్రంగానే విరుచుకు పడ్డారు. ఇక, ఆ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నటి వింధ్య, నటుడు రామరాజన్ల ప్రచారం మాత్రమే సాగుతున్నది. వీరు ప్రచార రథాలపై నుంచి ఓటర్లను ఆకర్షించే ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నా, సీటు ఉంటుందో,ఊడుతుందో అన్న అయోమయం తప్పడం లేదు. ఇక డీఎంకే కూటమికి మద్దతుగా ఆ పార్టీ దళపతి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. ఓ వైపు రోడ్ షో మరో వైపు పాద యాత్ర అన్నట్టుగా ఆయన పర్యటన సాగుతున్నది. బుధవారం కడలూరులో భారీ జన సందోహం నడుమ ఓట్ల వేట సాగించిన స్టాలిన్ గురువారంతో తొలి విడత పర్యటన ముగించనున్నారు. ఒక్క రోజు విరామంతో శనివారం నుంచి తిరువారూర్ వేదికగా మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపి కనిమొళి చిన్న చిన్న బహిరంగ సభల రూపంలో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఓట్ల వేట సాగిస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వయోభారంతో బాధ పడుతున్నా, తాను సైతం అంటూ చిన్న చిన్న బహిరంగ సభలతో డీఎంకేకు అండగా నిలవాలని ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేస్తున్నారు. అలాగే, డీఎంకే అధినేత ఎం కరుణానిధి శనివారం నుంచి ఆయన ప్రచారం సాగబోతోంది. సైదా పేట బహిరంగ సభతో ఆయన పర్యటన ప్రారంభం అవుతుంది. డీఎంకే కూటమికి మరింత వన్నె తెచ్చేందుకు తగ్గ ప్రచార దూతలు రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీల పర్యటన సిద్ధం అవుతున్నది. డిఎంకే , కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ రోడ్ షో రూపంలో నాలుగు రోజుల పాటుగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈనెలాఖరులో ఆయన పర్యటన సాగనున్నది. సోనియా గాంధీ చెన్నై లేదా తిరువారూర్లలో జరిగే బహిరంగ సభలో కరుణానిధితో పాటుగా పాల్గొనేందుకు నిర్ణయించి ఉన్నారు. అలాగే, ఈ కూటమిలో కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధిగా ఉన్న కుష్బు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు.ప్రజా సంక్షేమ కూటమి : డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోని నేతలు ప్రత్యేక ఆకర్షణతో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ బహిరంగ సభలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ రోడ్ షోలతో డీఎంకే, అన్నాడిఎంకేల అవినీతిని గురి పెట్టి దూకుడుగా ప్రసంగాల్ని సాగిస్తున్నారు. ఇక, ఆ కూటమికి మద్దతుగా ఎండీఎంకే నేత వైగో సుడిగాలి పర్యటనలో ఉన్నారు. తమిల మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తంజావూరు జిల్లా పాపనాశంలో ఎన్నికల ప్రచారానికి ఉదయం శ్రీకారం చుట్టారు. ఇక, సీపీఎం నేత జిరామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ఆ పార్టీల సీనియర్లు నల్లకన్ను, టి పాండియన్ వంటి వాళ్లు తమ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్ని ఎంపిక చేసుకుని ప్రచార బాటలో ఉన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ గురువారం నుంచి తన ప్రచార పయనాన్ని నిర్విరామంగా సాగించబోతున్నారు. పీఎంకేలో అన్భుమణి ఒక్కడే : ఇన్నాళ్లు సాగిన ఎన్నికల్లో కూటముల్ని మార్చి మార్చి చివరకు తమ నేతృత్వం అంటూ రంగంలోకి దిగిన పీఎంకేకు అన్భుమణి ఒక్కరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో సుడిగాలి పర్యటనలతో ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు అన్భుమణి రాందాసు తమకు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్ని గురి పెట్టి బహిరంగ సభలతో ప్రచార పయనం సాగించే పనిలో పడ్డారు. మేలో మోది : డీఎంకే, అన్నాడీఎంకేలకు తామే ప్రత్యామ్నాయం అని జబ్బలు చరిచి చివరకు , ఈ సారి ఎలాగైనా తమ ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలన్న కాంక్షతో కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తమకు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్ని ఎంపిక చేసుకుని ,అక్కడే తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇక, కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రచార క్యూ కట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఓ బహిరంగ సభలో ప్రత్యక్షమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరికొన్ని సభల్లో తన ప్రసంగాన్ని అందించేందుకు సిద్ధం అయ్యారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల ఆకర్షణకు రాష్ట్రంలో పర్యటించేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మే మొదటి వారంలో కోయంబత్తూరు, చెన్నైలలో ఆయన బహిరంగ సభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓట్ల వేటకు ప్రచారం వేడెక్కడంతో భానుడి దెబ్బకు నేతల వెంట పరుగులు తీసే వాళ్లు విల విలలాడక తప్పడం లేదు. తాజాగా సేలంలో జరిగిన సీఎం జయలలిత ప్రచార బహిరంగ సభలో వడ దెబ్బకు ఓ వ్యక్తి మరణించాడు. ఇదే విధంగా రెండు రోజుల క్రితం అరుప్పుకోట్టైలో భానుడి ప్రతాపానికి ఇద్దరు మహిళలు విగత జీవులు కావాల్సి వచ్చింది. -
రెండు రోజుల్లో నగారా
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్జైదీ మంగళవారం తుదివిడత చర్చలు జరుపుతున్న తరుణంలో నోటిఫికేషన్ జారీ చేస్తారని ఢిల్లీ వర్గాల భోగట్టా. తమిళనాడు ప్రభుత్వానికి మే 22వ తేదీతో గడువు ముగుస్తుంది. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఇందుకోసం ఎన్నికల కమిషనర్ ఏర్పాట్లపై తలమునకలై ఉన్నారు. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకున్నాయి. నకిలీ ఓటర్ల తొల గింపు కార్యక్రమం గత నెల 15 నుంచి 29వ తేదీ వరకు సాగింది. బందోబస్తుకు సీఆర్పీఎఫ్ దళాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 65వేల పోలింగ్ కేంద్రాల్లో 38 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వెబ్కెమెరాలను అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలా అన్ని రకాల పనులను నూరుశాతం పూర్తి చేసిన దశలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందరిలానే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది. రాష్ట్రంలోని ఎన్నికల అధికారులందరికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్‌లఖానీ మంగళవారం అత్యవసర ఉత్తరాలు పంపారు. నోటిఫికేషన్ వెలువడగానే కొత్తగా ప్రభుత్వ పథకాలను ప్రకటించరాదు, అమలు చేయరాదని ఆ ఉత్తరం ద్వారా ఆదేశించారు. అలాగే సీఎం జయలలిత సైతం సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని పథకాల ప్రచార చిత్రాలను వీడియో కాన్ఫరెన్స్ద్వారా హడావిడిగా విడుదల చేశారు. సోమవారం ప్రారంభించిన అనేక పథకాలు, నిర్మాణాలు అసంపూర్తిగా ఉండగానే ప్రారంభించడం సీఎం హడావిడితనానికి అద్దం పట్టింది. ఇందువల్ల ఎన్నికల తేదీ ముఖ్యమంత్రికి ముందే చెప్పి ఉంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటువంటి సంకేతాల కారణంగా బుధ, గురువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని తెలుస్తోంది. ‘ఎన్నికల తేదీపై నిర్ణయం జరిగిపోయింది, ఈ నెల 4వ తేదీ సాయంత్రం లేదా 5 వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది’ అని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు రహస్య సమాచారం ఇచ్చారు. ఈసీకి డీఎంకే విజ్ఞప్తి ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ సాగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్లఖానికి డీఎంకే విజ్ఞప్తి చేసింది. పార్టీ లీగల్‌సెల్ సహాయ కార్యదర్శి పరంధామన్ మంగళవారం సచివాలయంలో ఈసీని కలిశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార అన్నాడీఎంకే, పోలీసులు తమకు అనుకూలంగా మలచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి తప్పిదాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులను పరిశీలకులుగా నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.