వేడిక్కిన ప్రచారం
రోడ్ షోలతో నేతల పలకరింపు
అభ్యర్థుల పరిచయాలు
నెలాఖరులో రాహుల్
మేలో మోదీ, సోనియా రాక
అభ్యర్థుల జాబితాల ప్రకటనతో ఓట్ల వేటలో రాజ కీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. ప్రజల్ని ఆకర్షించి మద్దతు సేకరణలో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో పరుగులు తీస్తున్నారు. రాజకీయ మేధావి డీఎంకే అధినేత కరుణానిధి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. సోనియా, రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టనున్నారు. మే మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
సాక్షి, చెన్నై : మే 16 అసెంబ్లీ ఎన్నికల తేదీ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు శుక్రవారం నుంచి స్వీకరించనున్నారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగం, మరో వైపు రాజకీయ పక్షాలు దూసుకెళుతుండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రాజుకున్నట్టు అయింది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. పంచముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పగ్గాలు లక్ష్యంగా అందరూ నినాదాన్ని అందుకుని ఉన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ రెండాకులు రెప రెపలాడలన్న తపనతో అన్నీ తానై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఒక రోజు ప్రచారం ఒక రోజు విరామం అన్నట్టుగా ప్రచార బహిరంగ సభలు సాగుతూ వస్తున్నాయి. బుధవారం సేలంలో జరిగిన బహిరంగ సభలో డీఎంకేను టార్గెట్ చేసి అమ్మ తీవ్రంగానే విరుచుకు పడ్డారు. ఇక, ఆ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నటి వింధ్య, నటుడు రామరాజన్‌ల ప్రచారం మాత్రమే సాగుతున్నది. వీరు ప్రచార రథాలపై నుంచి ఓటర్లను ఆకర్షించే ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నా, సీటు ఉంటుందో,ఊడుతుందో అన్న అయోమయం తప్పడం లేదు. ఇక డీఎంకే కూటమికి మద్దతుగా ఆ పార్టీ దళపతి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. ఓ వైపు రోడ్ షో మరో వైపు పాద యాత్ర అన్నట్టుగా ఆయన పర్యటన సాగుతున్నది. బుధవారం కడలూరులో భారీ జన సందోహం నడుమ ఓట్ల వేట సాగించిన స్టాలిన్ గురువారంతో తొలి విడత పర్యటన ముగించనున్నారు. ఒక్క రోజు విరామంతో శనివారం నుంచి తిరువారూర్ వేదికగా మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఇక డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపి కనిమొళి చిన్న చిన్న బహిరంగ సభల రూపంలో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఓట్ల వేట సాగిస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వయోభారంతో బాధ పడుతున్నా, తాను సైతం అంటూ చిన్న చిన్న బహిరంగ సభలతో డీఎంకేకు అండగా నిలవాలని ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేస్తున్నారు. అలాగే, డీఎంకే అధినేత ఎం కరుణానిధి శనివారం నుంచి ఆయన ప్రచారం సాగబోతోంది. సైదా పేట బహిరంగ సభతో ఆయన పర్యటన ప్రారంభం అవుతుంది. డీఎంకే కూటమికి మరింత వన్నె తెచ్చేందుకు తగ్గ ప్రచార దూతలు రంగంలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీల పర్యటన సిద్ధం అవుతున్నది. డిఎంకే , కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ రోడ్ షో రూపంలో నాలుగు రోజుల పాటుగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈనెలాఖరులో ఆయన పర్యటన సాగనున్నది. సోనియా గాంధీ చెన్నై లేదా తిరువారూర్‌లలో జరిగే బహిరంగ సభలో కరుణానిధితో పాటుగా పాల్గొనేందుకు నిర్ణయించి ఉన్నారు. అలాగే, ఈ కూటమిలో కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధిగా ఉన్న కుష్బు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు.ప్రజా సంక్షేమ కూటమి : డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోని నేతలు ప్రత్యేక ఆకర్షణతో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఉరకలు తీస్తున్నారు.
డీఎండీకే అధినేత విజయకాంత్ బహిరంగ సభలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ రోడ్ షోలతో డీఎంకే, అన్నాడిఎంకేల అవినీతిని గురి పెట్టి దూకుడుగా ప్రసంగాల్ని సాగిస్తున్నారు. ఇక, ఆ కూటమికి మద్దతుగా ఎండీఎంకే నేత వైగో సుడిగాలి పర్యటనలో ఉన్నారు. తమిల మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తంజావూరు జిల్లా పాపనాశంలో ఎన్నికల ప్రచారానికి ఉదయం శ్రీకారం చుట్టారు. ఇక, సీపీఎం నేత జిరామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ఆ పార్టీల సీనియర్లు నల్లకన్ను, టి పాండియన్ వంటి వాళ్లు తమ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్ని ఎంపిక చేసుకుని ప్రచార బాటలో ఉన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ గురువారం నుంచి తన ప్రచార పయనాన్ని నిర్విరామంగా సాగించబోతున్నారు.
పీఎంకేలో అన్భుమణి ఒక్కడే : ఇన్నాళ్లు సాగిన ఎన్నికల్లో కూటముల్ని మార్చి మార్చి చివరకు తమ నేతృత్వం అంటూ రంగంలోకి దిగిన పీఎంకేకు అన్భుమణి ఒక్కరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో సుడిగాలి పర్యటనలతో ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు అన్భుమణి రాందాసు తమకు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్ని గురి పెట్టి బహిరంగ సభలతో ప్రచార పయనం సాగించే పనిలో పడ్డారు.
మేలో మోది : డీఎంకే, అన్నాడీఎంకేలకు తామే ప్రత్యామ్నాయం అని జబ్బలు చరిచి చివరకు , ఈ సారి ఎలాగైనా తమ ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలన్న కాంక్షతో కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తమకు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్ని ఎంపిక చేసుకుని ,అక్కడే తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇక, కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రచార క్యూ కట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఓ బహిరంగ సభలో ప్రత్యక్షమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరికొన్ని సభల్లో తన ప్రసంగాన్ని అందించేందుకు సిద్ధం అయ్యారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల ఆకర్షణకు రాష్ట్రంలో పర్యటించేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మే మొదటి వారంలో కోయంబత్తూరు, చెన్నైలలో ఆయన బహిరంగ సభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓట్ల వేటకు ప్రచారం వేడెక్కడంతో భానుడి దెబ్బకు నేతల వెంట పరుగులు తీసే వాళ్లు విల విలలాడక తప్పడం లేదు. తాజాగా సేలంలో జరిగిన సీఎం జయలలిత ప్రచార బహిరంగ సభలో వడ దెబ్బకు ఓ వ్యక్తి మరణించాడు. ఇదే విధంగా రెండు రోజుల క్రితం అరుప్పుకోట్టైలో భానుడి ప్రతాపానికి ఇద్దరు మహిళలు విగత జీవులు కావాల్సి వచ్చింది.
ఓట్ల వేట
Published Thu, Apr 21 2016 2:58 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement