విజయకాంత్ రూటే సెపరేటు
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి అంతం, పేదరిక నిర్మూలన నినాదంతో పార్టీ ఆవిర్భావకాలం నుంచి ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే, ఈ సారి ఆయన సీఎం పగ్గాలు చేపట్టేందుకు రేసులో పరుగులు తీస్తున్నారు. తానే సీఎం, తానే సర్వం అన్నట్టుగా ఓటర్ల ప్రసన్నంలో ఉన్న విజయకాంత్ ఈ సారి కీలక నిర్ణయం తీసుకుని అందర్నీ విస్మయంలో పడేశారు.
ఓటుకు నోటు వద్దే..వద్దు అని ఎన్నికల యంత్రాంగం అందుకుని ఉన్న నినాదానికి మద్దతు పలుకుతూ, తానూ సైతం అని ఏకంగా ఓ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ప్రతిజ్ఞ చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉలందూరు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెప్టెన్ రేసులో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఓట్ల వేటలో ఉన్న ఆయన అక్కడి లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్నారు. పూజాది కా ర్యక్రమాల అనంతరం దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ప్రతిన బూనారు.
తాను ఓటుకు నోటు ఇవ్వబోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును కొనుగోలు చేయనని ఇదే తన ప్రతిజ్ఞ అంటూ, ఇదే తన శపథంగా వ్యాఖ్యానించారు. అలాగే, వెలుపలకు వచ్చిన విజయకాంత్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పంచె పెకైత్తి కట్టి మరీ కదన రంగంలో దూకేందుకు తాను సిద్ధం అని, తనను ఎవ్వడూ కదిలించ లేడని వీరావేశంతో ప్రసంగించారు.
ఇంత వరకు బాగానే, ఉ న్నా, సోషల్ మీడియాల్లో కెప్టెన్ ప్రతి జ్ఞ, ఎవ్వరూ కదిలించలేడు అన్న అంశాలు చమత్కారాలకు దారి తీశాయి. కెప్టెన్ ఒక్కడే నోటుకు ఓటు ఇవ్వనని ప్రతిజ్ఞ చేస్తే ఎలా, మిగిలిన డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థుల చేత కూడా చేయించాలి మరీ..! అని వ్యంగ్యాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. అలాగే, ఎవ్వరూ విజయకాంత్‌ను కదిలించాల్సిన అవసరం లేదని, ఆయనే తుళ్లి పడతారులే అని చమత్కారాలు అందుకుని ఉండడం గమనార్హం.