మీడియాపై కెప్టెన్ చిందులు
పిడికిలి బిగించి ఆక్రోశం
సర్వత్రా విస్మయం
అభ్యర్థులతో సేలంలో సమావేశం
డీఎండీకే అధినేత విజయకాంత్ మళ్లీ తన చేతికి పని పెట్టే పనిలో పడ్డారు. మీడియాపై చిందులు తొక్కడమే కాకుండా, నాలుక మడిచి, పిడికిలి బిగించి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తన పక్కనే ఉన్న ప్రయివేటు భద్రతా సిబ్బందికి మోచేతి గుద్దుల రుచి చూపించారు. సీఎం అభ్యర్థి ఇలా బాదుడికి దిగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. సేలంలో హఠాత్తుగా అభ్యర్థులతో కెప్టెన్ సమాలోచించడం గమనార్హం.
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్న విషయం తెలిసిందే. ఆయన ప్రసంగాలు శైలి గందరగోళమే. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చేతి దెబ్బ ఎవరో ఒకరు రుచి చూడక తప్పదు. అది అభ్యర్థి కావొచ్చు, పార్టీ నాయకులు కావచ్చు. కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. ఇన్నాళ్లు ఓ పార్టీ నేతగా ఆయన ప్రచారాల్లో వ్యవహరించిన తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయకాంత్ హోదా పెరిగింది. ఐదు పార్టీలు కలిసి ఆయన్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నాయి.
దీంతో తదుపరి సీఎం తానే అన్న ధీమాతో విజయకాంత్ ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లు మీడియాపై పదే పదే చిందులు తొక్కుతూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కాస్త తగ్గారు. హుందాతనాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేసినా, చివరకు తానింతే అని దూకుడుగా ప్రదర్శించి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. బుధవారం హఠాత్తుగా సేలం లో పార్టీ జిల్లాల కార్యదర్శులు, 104 మంది అభ్యర్థులతో సమావేశానికి విజయకాంత్ పిలుపు నివ్వడంతో అక్కడికి వచ్చిన మీడియాకు చీవాట్లు తప్పలేదు. పిడికిలి బిగించి చివరకు ఆక్రోశాన్ని పక్కనే ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించిన విజయకాంత్‌పై సెటైర్లు బయలు దేరాయి.
కెప్టెన్ బాధుడు : సేలం ఐదు రోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో పార్టీ కార్యదర్శులు, అభ్యర్థుల సమావేశానికి చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదు. వీడియో కెమెరాలు, ఫోటో గ్రాఫర్లు ఆ దరిదాపుల్లోకి రాకూడదన్న ఆంక్షలు సైతం విధించారు. పది గంటల సమయంలో ఎన్నికల అధికారి శేఖర్ ఓ వీడియో గ్రాఫర్ తో కలిసి అక్కడికి వచ్చారు. అయితే, ఆయన్ను లోనికి అనుమతించ లేదు. తీవ్ర ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేసిన తదుపరి అనుమతించారు. సరిగ్గా పదకొండున్నర గంటల సమయంలో విజయకాంత్ అక్కడికి వచ్చారు.
ఆయన తన వాహనం నుంచి దిగడంతో సమావేశం ప్రాధాన్యతను గురించి తెలుసుకునేందుకు మీడియా ఉరకలు తీసింది. మీడియా చుట్టుముట్టడంతో విజయకాంత్ సహనం కోల్పోయారు. తానో సీఎం అభ్యర్థి అన్న విషయాన్ని మరిచి నాలుక మడిచి , పిడికిలి బిగిస్తూ మీడియా వర్గాలపై దాడికి యత్నించే విధంగా ప్రయత్నం చేశారు. అంతలో తనను తాను శాంతించుకుని వద్దన్నట్టుగా చేతులు ఊపుతూ ముందుకు వెళ్లే యత్నం చేశారు. ఓ మీడియా ప్రతినిధి మైక్ విజయకాంత్ ముందుగా ప్రత్యక్షం కావడంతో ఆక్రోశాన్ని ఆపుకోలేక, ఆ మైక్‌ను దూరంగా విసిరి కొట్టారు. అంతటితో ఆగకుండా, ముందుకు సాగుతూ తన వెనుక రక్షణగా వస్తున్న ప్రైవేటు భద్రతా సిబ్బంది ఆక్రోశాన్ని ప్రదర్శించారు.
మో చేతితో అతడి ముఖం మీద గుద్దుతూ విజయకాంత్ వ్యవహరించిన తీరు అనేక తమిళ ఛానళ్లకు హాట్ టాపిక్‌గా మారాయి. పదే పదే ఆయన వ్యవహరించిన తీరును ప్రసారం చేస్తూ, సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. ఇక, విజయకాంత్ ఆక్రోశంతో వీర బాదుడు పర్వాన్ని మళ్లీ కొనసాగించే పనిలో పడటంతో ఇక, అభ్యర్థులు, ఆ పార్టీ నాయకులు ఆయనకు కాస్త దూరంగా ఉండాల్సిందే. అలాగే, ఐదు పార్టీల నాయకులు ఏదేని వేదిక పై ప్రత్యేక్షమైన పక్షంలో విజయకాంత్‌కు కాస్త దూరంగా కూర్చుంటే సరి, లేదంటే ఆయన బాదుడు రుచి చూడాల్సిందే అన్న చమత్కారాలు సోషల్ మీడియాల్లో బయలు దేరాయి.