సాక్షి, చెన్నై: పశ్చిమ పర్వత శ్రేణుల్ని తనలో ఇముడ్చుకుని ఆహ్లాదకరంగా కనిపించే జిల్లా తేని. దివంగత ఎంజీయార్, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, సీనియర్ నేత ఓ పన్నీరు సెల్వంలను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోపెట్టిన ఘనతను ఈ జిల్లా దక్కించుకుంది. ఈ జిల్లాను తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు పరుగులు తీస్తున్నాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో వ్యవసాయం కీలక ఆధారంగా జీవనం సాగిస్తున్న ప్రజానీకం తేని జిల్లాలో ఉన్నారు. పచ్చటి పొలాలు, ద్రాక్ష తోటలు, పెరియార్, వైగై నదులు, మంజలార్, సోత్తుపారై వంటి జలాశయాలు, మేఘమలై వంటి జలపాతాలు ఇక్కడ ఆహ్లాదకరంగా కన్పిస్తుంటాయి. ఇక ముగ్గురు సీఎంలను ఇక్కడి నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కించడంతో పాటు దక్షిణ భారత సినీ వినీలాకాశంలో ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు భారతీరాజ, సంగీత దర్శకుడు ఇళయరాజ, రచయిత వైరముత్తు ఈ జిల్లా నుంచే తెర మీదకు వచ్చిన వాళ్లే.
ఒకప్పుడు ఐదు నియోజకవర్గాల్ని కల్గిన ఈ జిల్లాలో ప్రస్తుతం నాలుగే మిగిలాయి. జిల్లా కేంద్రం పేరుతో ఉన్న తేని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతైంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఆండిపట్టి, పెరియకుళం(రి), బోడి నాయకనూరు, కంబం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కావడంతో అన్నదాతల ఓటు బ్యాంకే అధికం. అలాగే, అటవీ గ్రామాల్లోని గిరిజన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా న్యాయ నిర్ణేతలే. ఈ జిల్లాలో మొత్తంగా పది లక్షల 30 వేల 137 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఐదు లక్షల 11 వేల 217 మంది పురుషులు, ఐదు లక్షల 18 వేల 792 మంది స్త్రీలు, 128 మంది ఇతరులు ఉన్నారు.
ఆండి పట్టి: ఇది 2011కు పూర్వం వీవీఐపీ నియోజకవర్గం జాబితాలో ఉండేది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీయార్ ఇక్కడి నుంచే ఒకప్పుడు సీఎం పగ్గాలు చేపట్టారు.
ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా అన్నాడీఎంకేను నడిపిస్తున్న అధినేత్రి జయలలిత కూడా ఇదే నియోజకవర్గం నుంచి సీఎం సింహాసనం అధిరోహించారు. గత ఎన్నికల వరకు ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జయలలిత వ్యవహరించే వారు. గత ఎన్నికల్లో ఆమె తన మకాంను శ్రీరంగంకు మార్చేసినా, ఆండి పట్టి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఎన్నికల్లో తన ప్రతినిధిగా తంగ తమిళ్ సెల్వన్‌ను బరిలోకి దించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ తాజా ఎన్నికల్లో తంగ తమిళ్ సెల్వన్ రేసులో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఎనిమిది సార్లు విజయ కేతనం ఎగుర వేసిందంటే, ఇది ఆ పార్టీ కంచుకోటే. ఇక్కడ రెండు లక్షల 52 వేల 747 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 26 వేల 270 మంది పురుషులు, లక్షా 26 వేల 462 మంది స్త్రీలు, పదిహేను మంది ఇతరులు ఉన్నారు.
వీరి మద్దతుతో మళ్లీ విజయ కేతనం ఎగుర వేయడానికి తంగ త మిళ్ సెల్వన్ పరుగులు తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థి ఎల్ మూక్కయ్య మళ్లీ రేసులో దిగారు. గతంలో చేజార్చుకున్న చాన్స్‌ను ఈ సారి దక్కించుకునేందుకు మూక్కయ్య తీవ్రంగా కుస్తీలు పడుతున్నారు. నియోజకవర్గంలో మూక్కయ్య బలమైన వ్యక్తి కావడంతో ఈ సారి సమరం హోరాహోరీ. ఇక ఓట్లను చీల్చేందుకు డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తి రేసులో ఉన్నారు. పెరియకుళం(రి): ఒకప్పుడు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో రిజర్వుడ్‌గా మారింది. ఇది వరకు ఇక్కడి నుంచి రెండు సార్లు అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీరు సెల్వం అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తొలిసారిగా తమ అమ్మ జయలలిత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టడంతో, ఈ నియోజకవర్గం హోదా పెరిగింది.
ఈ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేయడంతో పాటు ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రావడంతో వ్యక్తిగత పలుకుబడిని పెంచుకున్నారు. అయితే, నియోజకవర్గం రిజర్వుడ్‌గా మారడంతో తన మకాంను పక్కనే ఉన్న బోడినాయకనూరుకు మార్చుకోవాల్సిన పరిస్థితి పన్నీరుకు తప్పలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి ఎ. లాసర్ విజయకేతనం ఎగుర వేశారు. ప్రస్తుతం సీపీఎం గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే పరుగులు తీస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాసర్ ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థిగా మళ్లీ రేసులో దిగారు.
ఆయన్ను ఢీకొట్టేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా కదిర్ రాము పోటీకి దిగారు. పన్నీరు అభివృద్ధి, వ్యక్తిగత హవా తనకు కలిసి వస్తాయన్న ఆశాభావంతో కదిర్ కాము ఉన్నారు. ఇక, డీఎంకే అభ్యర్థిగా వి అన్భళగన్, బీజేపీ అభ్యర్థిగా శ్రీ చెల్లం పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో లాసర్ చేతిలో ఓటమి చవి చూసిన తామకుళంకు చెందిన డీఎంకే అభ్యర్థి వి అన్భళగన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ సారి ఓటర్లు తప్పకుండా తనను ఆదరిస్తారన్న ధీమాతో ఉన్నారు. ఇక, ఈ నియోజవకర్గంలో రెండు లక్షల 58 వేల 145 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో లక్షా 27 వేల 937 మంది పురుషులు, లక్షా 30 వేల 131 మంది స్త్రీలు, 77 మంది ఇతరులు ఉన్నారు. వీరి నాడి ఎటో అన్నది ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే.
బోడినాయకనూరు: ఇక్కడ ఓ సారి డీఎంకే, మరో సారి అన్నాడీఎంకే అన్నట్టుగా ఓటర్లు తమ తీర్పును ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తన మకాంను ఇక్కడికి మార్చుకున్న పన్నీరు సెల్వం, అప్పటి సిటింగ్ డీఎంకే ఎమ్మెల్యే లక్ష్మణ్‌ను ఓడించి ఆర్థికమంత్రిగా అవతరించారు. మరోసారి తమ అమ్మ జయలలిత సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనడంతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టిన ఘనత పన్నీరుకు దక్కింది. పీఎం పగ్గాలు చేపట్టినా, ఈ సారి నియోజకవర్గం మీద మాత్రం ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో పన్నీరు అండదండాలతో ఆప్తులు వీరంగాలు సృష్టించడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం ప్రతికూల వాతావరణాన్ని సృష్టించి ఉన్నాయి. మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి పన్నీరు సెల్వం పోటీ చేస్తుండడంతో, ఆయన్ను ఢీకొట్టేందుకు మరో మారు లక్ష్మణన్‌ను సిద్ధమయ్యారు.
వ్యక్తిగత పలుకుబడి కల్గిన వ్యక్తిగా డీఎంకేకు చెందిన లక్ష్మణన్‌కు ఇక్కడ పేరు ఉంది. పన్నీరు, ఆప్తులు అవినీతి, వీరంగాల్ని అస్త్రంగా చేసుకుని ప్రచారంలో లక్ష్మణన్ దూసుకెళుతున్నారు. అదే సమయంలో మళ్లీ గెలుపు కోసం పన్నీరు, ఆప్తులు తీవ్రంగా ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఇక, తానూ రేసులో ఉన్నట్టుగా బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వరన్ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక్కడ రెండు లక్షల 57 వేల 98 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో లక్షా 27 వేల 706 మంది పురుషులు, లక్షా 29 వేల 381 మంది స్త్రీలు, 11 మంది ఇతరులు ఉన్నారు. కంబం: ఈ నియోజకవర్గం ఓటర్ల రూటే సపరేటు. కొంత కాలం అన్నాడీఎంకే గుప్పెట్లో, తదుపరి డీఎంకే, కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, ఎండీఎంకే గుప్పెట్లో ఈ నియోజకవర్గం ఉండేది.
ఎండీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని 2006లో తన గుప్పెట్లోకి మళ్లీ డీఎంకే తీసుకుంది. ఇందుకు కారణం తన పేరులోనే కంబం చిరునామాగా కల్గిన ఎన్ రామకృష్ణన్ డీఎంకే అభ్యర్థి కావడమే. ఎండీఎంకే నుంచి బయటకు వచ్చిన రామకృష్ణన్ వరస విజయాలతో ముందుకు సాగుతున్నారు. నాలుగోసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు పరుగులు తీస్తున్నారు. అయితే, ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు కారణం అన్నాడీఎంకే అభ్యర్థిగా జక్కయ్యన్, ప్రజా సంక్షేమ కూటమి తరఫున తమిళ మాని రామచంద్రన్ రేసులో ఉన్నారు. గతంలో రామచంద్రన్ ఓ సారి కాంగ్రెస్ తరఫున, రెండు సార్లు తమిళ మానిల కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ మెట్లు ఎక్కి ఉండడం గమనార్హం.
ఇక, బీజేపీ అభ్యర్థిగా శ్రీ ప్రభాకరన్ బరిలో ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ అభ్యర్థులు బలమైన వ్యక్తులు కావడంతో సమరం హరోహోరీగా సాగే అవకాశాలు ఎక్కువే. ఇక్కడ రెండు లక్షల 62వేల 147 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 29వేల 304 మంది పురుషులు, లక్షా 32వేల 818 మంది స్త్రీలు, 25 మంది ఇతరులు ఉన్నారు.
సీఎంల జిల్లా తేని
Published Thu, Apr 28 2016 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Advertisement