అన్నాడీఎంకే
► చీలిక దిశగా అడుగులు
►40 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి
►అవసరమైతే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సిద్ధం
► అవిశ్వాస తీర్మానం దిశగా డీఎంకే
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని చీలిక దిశగా పయనింపజేస్తున్నట్లు సమాచారం. జయ జీవించి ఉన్నంత వరకు ఏమీ కాని శశికళ నేడు అంతా తానైనట్లుగా మారిపోవడంపై సహించలేని 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ చీలికకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ అవకాశాన్ని డీఎంకే సద్వినియోగం చేసుకోబోతున్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ అంతటి కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్న జయలలిత మరణం ఆ పార్టీని అల్లకల్లోలం చేసింది. ఎంజీఆర్ తరువాత జయలలితలా ఎవ్వరూ పార్టీని ఆకట్టుకోలేక పోయారు. ద్వితీయశ్రేణి నాయకత్వం, పార్టీ కేడర్‌ను కాదని శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం అసంతృప్తికి ప్రధాన కారణమైంది. అన్నాడీఎంకే పార్టీ చట్టం విధి విధానాలను తోసిరాజని ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికపై బహిరంగంగా నిరసన తెలపలేని నేతలు లోలోన రగిలి పోతున్నారు. పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలో ఉండాలనే సంప్రదాయాన్ని అడ్డుపెట్టుకుని సీఎం పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించారు.
సదరు సంప్రదాయాన్ని పాటించాలనే ఉద్దేశమే ఉంటే పన్నీర్‌సెల్వంకే పార్టీ ప్రధాన కార్యదర్శిని చేసి ఉండవచ్చుకదా అని శశికళ వ్యతిరేకులు విమర్శిస్తున్నా రు. అలాకాదని జయలలితకు అత్యంత విధేయుడైన పన్నీర్‌సెల్వంను పదవీచ్యుతుడిని చేసి సీఎం గా మారేందుకు శశికళ సిద్ధపడడం అసంతృప్తిజ్వాలల్లో ఆజ్యం పోసినట్లయింది. జయ జీవించి ఉన్నంతకాలం కనీసస్థాయి పదవిని సైతం శశికళకు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. శశికళ కుటుంబీకులను కళ్ల ఎదురుగుండా కనపడేందుకు కూడా జయ ఇష్టపడలేదు. అయితే జయ మరణం తరువాత పార్టీలో, ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ అమ్మ అభీష్టానికి విరుద్దమైనవేనని పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పైగా జయలలిత రాజకీయ విజయాలకు తమ కుటుంబమే కారణమంటూ శశికళ భర్త నటరాజన్ వేదికలెక్కి ప్రసంగాలు చేయడంపై మరింతగా మండిపడుతున్నారు.
జయ మరణం తరువాత సజావుగా పాలన చేసుకుని పోతున్న పన్నీర్‌సెల్వంపై శశికళ వేటువేయడం, తాను సీఎంగా మారడం అసంతృప్తి జ్వాలలను మరింత పెంచింది. దీంతో సుమారు 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక వర్గంగా మారిపోయి అవసరమైతే పార్టీని చీల్చేందుకు వెనుకాడబోరని తెలుస్తోంది. ఈ పరిస్థితిని డీఎంకే తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే నేతలను ఆకట్టుకునేందుకు డీఎంకే జిల్లాల వారీగా నేతలను నియమించినట్లు సమాచారం. శశికళ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన పక్షంలో అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందని డీఎంకే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన పక్షంలో అన్నాడీఎంకేలోని 40 మంది అసంతృప్త ఎమ్మెల్యేల్లో కనీసం 38 మంది బయట నుండే డీఎంకేకు అనుకూలంగా ఓటువేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అన్నాడీఎంకే ఆదర ణ లభిస్తే చాలదు కేంద్ర ప్రభుత్వ నుండి పూర్తి సహకారం కూడా అవసరమని డీఎంకేకు బాగా తెలుసు. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ ఇప్పించాల్సిందిగా ముంబయికి చెందిన ఒక బీజేపీ నేతతో డీఎంకేకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో డీఎంకే అధికారంలోకి వచ్చే అవకావం ఏర్పడుతుంది. డీఎంకే స్వతంత్రంగా అధికారంలోకి వచ్చేందుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే డీఎంకే వద్ద ప్రస్తుతం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మిత్రపక్షాలైన కాంగ్రెస్‌లో 8 మంది ఎమ్మెల్యేలు, ఇండియన్ ముస్లీం లీగ్‌లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీరిని కలుపుకుంటే అధికారం చేపట్టేందుకు డీఎంకేకు మరో 20 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఈ 20 మందిని సులభంగా సంపదించవచ్చనే ధీమాతో అవిశ్వాస తీర్మానానికి డీఎంకే సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.