యువత ఓటెవరికి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడులోని నేతల తలరాత ఏమిటో తెలిసిపోతుంది. ఈనెల 16వ తేదీన ప్రజలు తీర్పు చెప్పేరోజుకాగా, 19వ తేదీన ఆ తీర్పును ప్రకటిస్తారు. ఎప్పటి మాటెలా ఉన్నా, ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాలను యువత శాసిస్తుందని ఆశిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద యువత శాతం అధికంగా ఉండేది భారత దేశంలోనేనని కొందరు ప్రముఖులు విశ్లేషించారు. దేశంలోని అన్నిశాఖలు, విభాగాల్లో యువతేజం వెల్లివిరుస్తోంది.
భారతీయ యువత ప్రతిభను చేసి అమెరికా, చైనా దేశాలు విస్తుపోతున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో 18-23 వయస్సుగల దేశంలో యువత ఓటు 23 కోట్లుగా ఉండింది. తుపానులా ఎగిసిపడిన ఈ యువతలో 40శాతం నరేంద్రమోదీపై మోజుపడ్డారు. ఈ కారణంగానే కేంద్రంలో మోదీ ప్రధానిగా భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను యువత ఎలా శాసిస్తుందో అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
మార్పు కోరుతున్న తమిళనాడు యువత:
ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై యువత ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తమిళనాడులో 5.82 కోట్ల ఓటర్లు ఉండగా వీరిలో ఒకశాతం యువత ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 21లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటర్లైన యువతను ఆకట్టుకోగలమనే నమ్మకంతో అన్నాడీఎంకే, డీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేలకు 30 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికారంలో రావడం ఖాయమని అందరికీ తెలుసు.
అయితే ఏపార్టీకి చెందని యువ ఓటర్లు 20 శాతం వరకు ఉన్నారు. వీరిలో 10 శాతం యువత ఓటు వేయకున్నా మిగిలిన 10 శాతం ఓటర్లే ఎమ్మెల్యేల గెలుపును నిర్దేశిస్తారు. యువత వేసే ఓట్లే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రతిబంబిస్తాయని ఎన్నికల కమిషన్ విశ్వసిస్తోంది. అందుకే నూరుశాతం ఓట్లు పోలయ్యేందుకు అన్ని విధాల కృషి చేస్తోంది. 1.5 కోట్ల యువ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు ‘వై రాజా మై’, ‘మిస్డ్‌కాల్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాలను వినియోగిస్తోంది. ఎన్నికల కమిషన్ యువతను ఆకర్షించే ప్రయత్నాలను గమనించిన పార్టీల వారు సైతం యువ ఓటర్లకు గాలం వేయడం ప్రారంభించారు.
ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది శాతం ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకోవడంపై అన్నిపార్టీలు దృష్టిపెట్టాయి. డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులంతా సామాజిక మాధ్యమాల ద్వారా యువతతో టచ్‌లో ఉన్నారు. ఈ మార్పును గమనించిన సంఘసేవకులు, న్యాయమూర్తులు సైతం మంచి నేతలను ఎన్నుకోండని ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ మెరుగు, ఏ నేత ఎలాంటి వాడు అని యువ ఓటర్లు గమనిస్తున్నట్లుగా యువత మధ్య ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.
ఎన్నికల మేనిఫెస్టోకు యువత అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఆచరణలోకి రావని యువత నిర్దారించుకోవడమే ఇందుకు కారణం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలను యువత తీవ్రస్థాయిలో చీదరించికుంటున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వాల్లోని అవినీతిని రాజకీయ నేతలే పారద్రోలాలని యువత ఆశిస్తోంది.
ఇందు కోసం గ్రామీణ యువతను సైతం కలుపుకుపోతోంది. అయితే రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నా, ఒక సునామీలా ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టేలా ఎవ్వరూ కనపడటం లేదని యువత విరక్తిని ప్రదర్శిస్తోంది. రాజకీయాల్లోకి రావడంపై కూడా యువత అయిష్టతను వ్యక్తం చేస్తోంది. నేటి రాజకీయ నేతల నుండి ఏమి ఆశించవచ్చు, ఏది ఆశించకూడదనే అంశంపై యువత స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లు తేలింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాలపై యువత అసక్తి చూపడంలేదు.
సాగుభూమికి ఉచిత విద్యుత్, పేదలకు తక్కువ ధరకు ఆహారం, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా 20 కిలోల బియ్యం వంటివి మాత్రమే ప్రయోజనకరమనని భావిస్తున్నారు. పరిధికి మించి ఉచితాలను పంపిణీ చేయడం రాష్ట్ర ఆర్థికపరిస్థితిని దెబ్బతీయగలదని యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వంపై ప్రస్తుతం రూ.4లక్షల కోట్లు అప్పు ఉందని, ఈ అప్పుపై ప్రతినెల కొన్నివేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారని యువత తెలుసుకుంది. ఇలాంటి పరిస్థితిలో ఉచితంగా వస్తువుల పంపిణీ ఎలా సాధ్యం, వాటికి నిధులు ఎక్కడి నుండి సమకూర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ప్రజలకు ఉచితాలు పంచేకంటే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి యువత నిరుద్యోగులుగా ఉండగా, వీరంతా ప్రతి నేత వద్ద ఉద్యోగాలు ఇవ్వండి బాబూ అంటూ మాత్రమే వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని పరిస్థితిపై అన్ని కోణాల్లో అవగాహన పెంచుకున్న యువత ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది బహిర్గతం కావడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజమని నమ్మవచ్చు. పాతను యువత వ్యతిరేకిస్తోంది, అలాగని కొత్తగా ఎవరిని అందలం ఎక్కించాని సందిగ్ధం నెలకొని ఉంది. అయితే యువత లోలోన ఏదోఒక నిర్ధారణకు వచ్చినట్లు కనపడుతోంది. ఈ నిర్ణయం ద్రవిడ పార్టీలకు అనుకూలమా, ప్రతికూలమా అని తెలుసుకోవాలంటే ఈనెల 19 వరకు ఆగాల్సిందే.
రాష్ట్రంలో వయస్సుల వారీగా ఓట్లు
18-19 వయస్సు ఓటర్లు - 21,05,344
20-29 వయస్సు ఓటర్లు - 1,17,76,288
30-39 వయస్సు ఓటర్లు - 1,39,83,613
40-49 వయస్సు ఓటర్లు - 1,24,89,260
50-59 వయస్సు ఓటర్లు - 87,32,151
60-69 వయస్సు ఓటర్లు - 56,15,630
70-79 వయస్సు ఓటర్లు - 26,58,699
80 ఏళ్లు నుంచి
ఆపై వయస్సున్న ఓటర్లు - 8,40,635
మొత్తం ఓట్లు: 5,82,01,620
పురుషులు: 2,88,62,973 స్త్రీల్లు: 2,93,33,927