నష్టాల మామిడి | Mango losses | Sakshi
Sakshi News home page

నష్టాల మామిడి

Published Sun, Jun 8 2014 1:24 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

నష్టాల మామిడి - Sakshi

నష్టాల మామిడి

  •      కొంపముంచిన అకాల వర్షం
  •      కోత దశలో నేలరాలిన మామిడి పంట
  •      పతనమైన ధర
  •      నష్టాల్లో కూరుకుపోయిన రైతులు, వ్యాపారులు
  • ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు, వ్యాపారులు పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారు. మామిడి పూత, కాపు, పిందె దశ వరకు వాతావరణం అనుకూలించడంతో మంచి కాపుతో లాభాలు వస్తాయని ఆశించారు. అయితే కోత దశలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అంతకు ముందు వారం రోజులు పెను గాలులు వీచాయి. వేలాది ఎకరాల్లో పంట నేలరాలిపోయింది. ఉద్యానవన శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది.  
     
    చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: భిన్నమైన మామిడి రకాల సాగుకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. మామిడి సాగులో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, దేశంలో మూడో స్థానంలో నిలిచింది. అయితే పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. ప్రతి ఏటా మామిడి రైతులు ఏదో ఒక రకంగా నష్టపోతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అయితే ఏటా లక్షా 50 వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగవుతోంది. జిల్లాలో ప్రధానంగా తోతాపురి రకాన్ని 50 శాతంపైగా సాగు చేస్తున్నారు. 20 శాతం బేనీషా రకం, 20 శాతం ఖాదర్ రకం, మిగిలిన శాతం మల్లిక, నీలం రకాలు సాగు చేస్తున్నారు.
     
    తగ్గిన బరువు, రాలిన కాయలు


    ఈ ఏడాది మామిడి దిగుబడిపై రైతులు ఆశలు పెంచుకున్నారు. పూత, కాపు, పిందె దశ వరకు వాతావరణం అనుకూలించింది. కాయదశ వచ్చే సరికి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసాయి. అంతకు ముందు వారం రోజుల పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించిం ది. దీంతో కాయదశకు చేరకున్న మామిడి ఒక్కసారిగా బరువు తగ్గిపోవడంతో పాటు బలమైన ఈదురు గాలులకు కాయలు రాలిపోయాయి.

    ఉద్యాన శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగు కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కాయబరువు తగ్గడం, సైజు లేకపోవడం కారణాలతో పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఎకరాకు 4 టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 3 టన్నులు మాత్రమే రైతుల చేతికి అందనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పిందె దశలో నీలం రకం మామిడి ఆగస్టు మాసంలో కోతకు రావచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు.
     
    సింకేట్‌తో పడిపోయిన ధరలు
     
    ఈ ఏడాది మామిడికి మార్కెట్ బాగా ఉంటుందని రైతులు ఆశపడ్డారు. అయితే గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేట్ కావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. జిల్లాలో మామిడి పండ్ల గుజ్జు (ఫల్ఫ్) పరిశ్రమలు 70కి పైగా ఉన్నాయి. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేటై ధరలు నిర్ణయించాయి. దీని ప్రభావం ఎక్స్‌పోర్టు క్వాలిటీ కాయలపైనా పడింది. తోతాపురి రకం మామిడి గిట్టుబాటు ధర టన్ను రూ.15 వేలు కాగా, రూ.9 వేలకు పడిపోయింది.
     
    బేనీషా రకం మామడి గిట్టుబాటు ధర టన్ను రూ.25 వేలు కాగా, రూ.13 వేలకు కుదేలైంది. ఖాదర్ రకం మామడి ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. టన్ను ధర రూ.24 వేలు పలుకుతోంది. అయితే ఈ రకం మామిడి సాగు జిల్లాలో కేవలం 20 శాతమే ఉంది.  
     
    గిట్టుబాటు ధర నిర్ణయించాలి
     
    మామిడికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. మామిడికి గిట్టుబాటు ధర నిర్ణయించడంపై ఏటా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశం జరుగుతుంది. కమిటీలో నిర్ణయించిన ధర ప్రకారం రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది.
       
    ఈ ఏడాది సైతం అన్యాయం జరగకుండా తగిన గిట్టుబాటు ధర కల్పించి, ఖచ్చితంగా అమలు చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
     
    చిన్నచూపు తగదు

    వాణిజ్య పంటగా మామిడి మంచి లాభాలను అందిస్తుంటే ప్రభుత్వాలు సాగుపై శ్రద్ధ చూపడం లేదు. సూచనలు అందించే ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండరు. యాజమాన్య పద్ధతులపై అవాగాహన లేక నాసిరమైన మందుల వినియోగంతో నష్టపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో చెట్లను నాటిస్తున్నారే తప్ప మార్కెటింగ్‌పై శ్రద్ధ చూపడం లేదు. మార్కెట్ కమిటీలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

    వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారే తప్ప రైతులకు ఒరిగేది లేదు. దిగుబడి ఒక్క సారిగా మార్కెట్‌కు రావడంతో ధరను వ్యాపారులు తగ్గిస్తున్నారు. రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ చూపి జ్యూస్ ఫ్యాక్టరీలచే మామిడి రైతులకు అగ్రిమెంట్ చేయిస్తే నేరుగా కొనుగోళ్లతో లాభపడే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం గాలి వానలకు  రాలిన కాయలతో సుమారు 2 లక్షల రూపాయలకు పైగా  నష్టం వాటిల్లింది    
     - పి. సుదర్శన్ రెడ్డి,  మామిడి రైతు, నారాయణవనం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement