ప్రాణం తీసిన ట్రాన్స్ ఫార్మర్ | three former died in private transfarmer fitting proces | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ట్రాన్స్ ఫార్మర్

Published Sat, Nov 5 2016 6:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ప్రాణం తీసిన ట్రాన్స్ ఫార్మర్ - Sakshi

ప్రాణం తీసిన ట్రాన్స్ ఫార్మర్

జోగుళాంబ గద్వాల జిల్లా ఆలూరులో ముగ్గురు రైతులు బలి
సర్కారు ట్రాన్‌‌సఫార్మర్ రాక ప్రైవేటుగా కొన్న రైతులు

పొలంలోని దిమ్మెపై అమర్చుతుండగా ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
పరిహారం కోసం బంధువులు, గ్రామస్తుల డిమాండ్
మృతదేహాలతో గ్రామంలో బైఠాయింపు
దరఖాస్తు చేసి ఆరు నెలలైనా అందని ట్రాన్స్‌ఫార్మర్లు
అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల కక్కుర్తి
పంటలు ఎండిపోతాయనే ఆవేదనలో రైతులు
కాపాడుకునేందుకు సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
బిగించే నైపుణ్యం లేక విద్యుత్ ప్రమాదాలు
తమ నిర్లక్ష్యమేమీ లేదంటున్న విద్యుత్ అధికారులు

ఖరీఫ్ దెబ్బకొట్టింది.. రబీలోనైనా ఉన్న కాస్త భూమిని సాగుచేసుకుందామనుకున్నారు.. నీళ్లున్నా కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ లేదు.. విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసినా ఎప్పుడు వస్తుందో తెలియదు.. సవాలక్ష కొర్రీలు.. అది లేదు, ఇది లేదంటూ రోజూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడాలు.. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల చేతులు తడిపినా పనవుతుందన్న నమ్మకం లేదు.. చేసేదిలేక ఆ రైతులే ఓ పాత ట్రాన్‌‌సఫార్మర్ కొనుక్కువచ్చారు.. బిగించేందుకూ సన్నద్ధమయ్యారు. కానీ బిగింపులో మెళకువలు తెలియకపోవడం వారి పాలిట శాపమైంది. విద్యుత్ షాక్‌కు గురై... గుడిసె కుర్వ ఉరుకుందు (45), మూలింటి కుర్వ పెద్ద బుడ్డన్న (45), కారం ఈదన్న (40) ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు రైతులు తీవ్రగాయాల పాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.    - గట్టు

ఇటీవల మంచి వర్షాలు పడడంతో గట్టు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ర్యాలంపాడు గ్రామానికి చెందిన రైతులు మూలింటి బుడ్డన్న, గుండన్న, గుడిసె పెద్ద నర్సింహులు కలిసి.. రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న వారి పొలాలకు పైపులైన్ ఏర్పాటు చేసుకున్నారు. దాని మోటార్లకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్ కావా లి. విద్యుత్ శాఖకు దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా ట్రాన్స్‌ఫార్మర్ వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో.. తామే ప్రైవేటుగా ట్రాన్స్‌ఫార్మర్ కొనుగో లు చేయాలని నిర్ణయించుకున్నారు. బ్యాక్‌వాటర్ సమీపంలో ఉన్న గుడిసె తిమ్మప్ప పొలంలో కొందరు రైతులు ఇప్పటికే రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు.

వాటి పక్కనే తాము మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటకలో పాత ట్రాన్‌‌సఫార్మర్ కొనుగోలు చేసి మరమ్మతు చేయించుకున్నారు. శుక్రవారం మూలింటి బుడ్డన్న ట్రాక్టర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుని గుడిసె తిమ్మప్ప పొలానికి బయలుదేరాడు. దానిని అమర్చేందుకు సహాయం కోసం కారం ఈదన్న, చిన్న జమ్మన్నలతోపాటు పక్క పొలానికి చెందిన కుర్వ ఉరుకుందు, బసన్న, గోవింద్, నర్సప్పలను పిలిచాడు. తిమ్మప్ప పొలం లో అప్పటికే ఉన్న 2 ట్రాన్‌‌స ఫార్మర్ల పక్కనే ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు దిమ్మె నిర్మించారు.

దానికి, ట్రాక్టర్ ట్రాలీకి అనుసంధానంగా ఇనుప పైపు పెట్టారు. దానిపై ట్రాన్‌‌స ఫార్మర్ ఉంచి దిమ్మెపైకి నెడుతుండగా.. అది ఒరిగి పక్కనున్న ట్రాన్‌‌సఫార్మర్‌కు తగిలింది. దీంతో ఏడుగురు రైతులూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను గట్టిగా పట్టుకున్న గుడిసె ఉరుకుందు(45), కారం ఈదన్న (45) మూలింటి బుడ్డన్న(40) అక్కడికక్కడే మృతిచెందారు. నర్సప్పకు తీవ్రగాయాలుకాగా గోవిందు, బసన్న, చిన్న జమ్మన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో నర్సప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో గద్వాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రోడ్డున పడిన మూడు కుటుంబాలు
సాయం చేసేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఘటనలో మ రణించిన బుడ్డన్నది పేద కుటుంబం. ఆయనకు భార్య సరోజమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారికి నాలుగు ఎకరాల పొలం ఉండేది. ర్యాలంపాడు రిజ ర్వాయర్‌లో ముంపునకు గురైంది. దాంతో బుడ్డన్న కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడాయన మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. గుడిసె ఉరుకుందుకు భార్య గోవిందమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కారం ఈదన్నకు భార్య సుజాత, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దలు మరణించడంతో వారంతా కన్నీట మునిగిపోయారు.

పరిహారం కోసం ఆందోళన...
మృతి చెందిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఆలూరు గ్రామస్తులు, మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా మృతదేహాలను తరలించేది లేదంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు, బంధువులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి వరకు కూడా మృతదేహాలను గ్రామంలోనే ఉంచారు.

సాయం చేసేందుకు వెళ్లి..
కారం ఈదన్న, చిన్న జమ్మన్న కలసి పునరావాస కేంద్రంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకకు అనుమతి కోసం గట్టు తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. కానీ ట్రాన్స్‌ఫార్మర్‌ను దిమ్మెపై అమర్చడానికి సాయం చేయాల్సిందిగా మిగతా రైతులు కోరడంతో తోడుగా వెళ్లారు. వారిలో ఈదన్న మరణించగా.. జమ్మన్న తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే..
సాక్షి, గద్వాల: విద్యుత్ శాఖ నుంచి సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు అందకపోవడం, మామూళ్ల కోసం అధికారుల కక్కుర్తి, ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతుల అవసరాన్ని గుర్తించకపోవడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం వంటివి రైతుల ఉసురు తీస్తున్నాయి. పంటలు కళ్లముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతుండడంతో.. రైతులు పంటను రక్షించుకోవాలన్న తపనతో తామే ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

 సాధారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు గతంలో డీడీ తీసిన వెంటనే సరఫరా చేసేవారు.  రెండేళ్లుగా పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అధికారులు తగిన స్థాయిలో సరఫరా చేయడంపై దృష్టి సారించడం లేదు. నలుగురు రైతులు కలిసి ఒక్కొక్కరూ రూ.6 వేల చొప్పున మొత్తం రూ.24 వేలు డీడీ తీసి ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దానికితోడు అధికారులు మరో రూ.24 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇలా డబ్బులు చెల్లించినా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకావడానికి సుమారు 6 నెలల నుంచి ఏడాది కాలం పడుతోంది.

దీంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి ప్రైవేటు ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చుకుని, ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్‌కు అధికారులే దగ్గరుండి కనెక్షన్ ఇస్తారు. కానీ రైతులు ప్రైవేటుగా తెచ్చుకుంటున్న ట్రాన్స్‌ఫార్మర్లకు వారే కనెక్షన్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క గట్టు మండలంలోనే సుమారు 300 ట్రాన్‌‌సఫార్మర్లను అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నట్లు అంచనా.

మాకు సమాచారం లేదు
ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాన్‌‌సఫార్మర్లకు మేమే కనెక్షన్లు ఇస్తాం. మాకు తెలియకుండా రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేశారు. ఇలాంటి ప్రైవేటు ట్రాన్‌‌సఫార్మర్లను మేం ప్రోత్సహించం. ఆ ట్రాన్‌‌సఫార్మర్ బిగించుకుంటున్నట్లు సమాచారం కూడా లేదు. మాకు తెలియకుండా రైతులే కనెక్షన్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. కనీసం లైన్ క్లియర్ కూడా అడగలేదు.. - గట్టు ట్రాన్‌‌సకో ఏఈ ఆర్థర్ కాటన్

అధికారుల నిర్లక్ష్యమేమీ లేదు
విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రైవేటుగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మాకు దరఖాస్తు చేసుకుంటే లైన్‌మన్‌ను పంపించి ఏర్పాటు చేస్తాం. కానీ ఇతర ప్రాంతాల నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనుగోలు చేసుకువచ్చి.. ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలూరులో చనిపోయిన రైతులకు విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణం కాదు..     - శ్రీనివాస్, విద్యుత్‌శాఖ డీఈ

ఎల్‌సీ తీసుకోలేదు
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి రైతులు లైన్ క్లియర్ కోసం ఉదయం 11.50కు ఫోన్ చేశారు.  ఎల్‌సీ ఇవ్వాలంటే లైన్‌మన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించా. ఆ తర్వాత రైతుల నుంచి సమాచారమేదీ లేదు. ఆలూరు ఫీడర్‌కు ఉదయం 10 గంటల నుంచి సింగిల్ ఫేస్ లైన్ ఆన్‌లో ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు త్రీఫేజ్ లైన్ ఆన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది. - చెన్నకేశవులు, ఆలూరు సబ్‌స్టేషన్ ఆపరేటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement