ట్రాన్స్‘ఫార్మర్’పైనే బలి
విద్యుత్ సిబ్బందిని నిలదీసిన రైతులు
నిజామాబాద్ రూరల్: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు వైరులో సమస్యతో త్రీఫేస్ కరెంట్ రావడం లేదని విద్యుత్ అధికారులకు విన్నవించినా.. పట్టించుకోలేదు. వర్షాభావంతో పంట ఎండుతుండడంతో చివరకు ఓ రైతు సరి చేద్దామని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి ధర్మారం గిరిజన తండాలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు బానోత్ రమేష్ (23) విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పెకైక్కి చెడిపోయిన వైర్లను మరమ్మతులు చేస్తుండగా..
ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ట్రాన్‌ఫార్మర్ పైనే ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా తండాలోని ఫీజు వైరు సమస్యతో టు ఫేస్ కరెంట్ మాత్రమే వస్తోంది. ఈ మేరకు స్థానిక రైతులు ఏఈ, లైన్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో రమేష్ ఉదయం ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు ప్రాణాలు కోల్పోయాడని స్థానిక రైతులు విద్యుత్ అధికారులను నిలదీశారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు.