వలపన్నారు... పట్టుకున్నారు | Trap to capture ... | Sakshi
Sakshi News home page

వలపన్నారు... పట్టుకున్నారు

Published Fri, Aug 29 2014 4:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

వలపన్నారు... పట్టుకున్నారు - Sakshi

వలపన్నారు... పట్టుకున్నారు

  •       ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
  •      ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు డబ్బుల డిమాండ్
  •      ఏసీబీని ఆశ్రయించిన ల్యాబర్తి రైతులు
  •      రూ.10వేలు తీసుకుంటూ పట్టుబడిన రమేష్
  • హన్మకొండ సిటీ : ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. రైతులు సమాచారం అందజేయడంతో ఏసీబీ డీఎస్పీ సాయిబాబా ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు గురువారం వలపన్ని లంచగొండి ఏఈ భూక్య రమేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఎస్‌ఎస్ 12 ట్రాన్స్‌ఫార్మర్ 100 కేవీపై  లోడ్ అధికంగా పడుతుండడంతో తరచుగా కరెంట్ ట్రిప్పవుతోంది.

    దీంతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయూలని రైతులు వర్ధన్నపేట మండల ఇన్‌చార్జ్ ఏఈగా కొనసాగుతున్న సబ్ ఇంజనీర్ రమేష్‌ను ఆశ్రయించారు. డబ్బులు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఇప్పిస్తానని ఆయన రైతులకు కరాఖండిగా చెప్పాడు.  ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని... డబ్బులు ఇచ్చుకోలేమని రైతులు ఆయన ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందని ఏఈ తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్‌ఫార్మర్ మంజూరైంది. రైతులు మళ్లీ ఏఈని సంప్రదించారు. డబ్బులు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తామని ఆయన మరోమారు తేల్చిచెప్పడంతో రైతులు ఏసీబీని ఆశ్రయించారు.

    ఈ మేరకు మాటువేసిన ఏసీబీ అధికారులు హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ జిల్లా స్టోర్స్ వద్ద ఏఈ భూక్య రమేష్ గురువారం రైతుల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని,  రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు పంపామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సాం బయ్య, రాఘవేందర్‌రావు సిబ్బంది పాల్గొన్నారు.
     
    ముందుగా రూ.30 వేలు ఇచ్చాం : అదనపు ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఏఈని కలిస్తే రూ. 60 వేలు ఖర్చు అవుతాయని, ఆ డబ్బులు ఇస్తే వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. అంత డబ్బు ఇచ్చుకోలేమని... ముందుగా రూ. 30 వేలు ఇచ్చాం. మరో రూ.పది వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పాడు. దీంతో వాటిని ఇవ్వడానికి ఒప్పుకుని, ఏసీబీ అధికారులను కలిశామని రైతులు రమేష్, వెంకటేశ్వర్లు తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement