
స్తంభంపై గోపాల్ మృతదేహం
మర్పల్లి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వీధిలైట్లు అమర్చే క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ శాఖ దినసరి కూలీ గోపాల్ విద్యుదాఘాతంతో స్తంభం మీదే మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోటమర్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. కోటమర్పల్లి గ్రామానికి చెందిన తుడుము గోపాల్(19) విద్యుత్ శాఖలో క్యాజువల్ లేబర్ ప్రభాకర్‌రెడ్డి వద్ద దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు గ్రామంలో వీధిలైట్లు బిగించి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభాకర్‌రెడ్డికి చెప్పాడు. దీంతో ఆయన సబ్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు.
అంతలోనే గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీగలు తాకడంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రిప్ అయింది. ఈ క్రమంలో ఎల్‌సీ కావాలని గోపాల్ కోరగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో స్తంభంపై ఉన్న గోపాల్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబీకులు, గ్రామస్తులు మర్పల్లి చౌరస్తా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకొని మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment