విద్యుదాఘాతానికి వ్యక్తి బలి
► మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
► జిన్‌కుంట సబ్‌స్టేషన్‌లో ఘటన
బల్మూర్ : సబ్‌స్టేషన్‌లో పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గంటపాటు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. బల్మూర్ మండలంలోని జిన్‌కుంటకు చెందిన నెల్లి సలేశ్వరం (40), లక్ష్మయ్య, యాదయ్య సుమారు పదేళ్లుగా విద్యుత్ కాంట్రాక్టర్ చుక్కారెడ్డి వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం స్థానిక సబ్‌స్టేషన్‌లో ఈ ముగ్గురూ తొమ్మిది గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం 33/11 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ లైన్ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలోనే మధ్యాహ్నం స్తంభాలపై ఉన్న వారు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. ఇది గమనించిన తోటి సిబ్బంది వెంటనే నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సలేశ్వ రం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. అనంతరం మిగతా ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, సలేశ్వరానికి భార్య భీమమ్మతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
అధికారుల నిర్లక్ష్యమేనని రాస్తారోకో
సబ్‌స్టేషన్‌లో పనులు చేస్తున్నపుడు ఏబీ స్విచ్‌ను బంద్ చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని మృతుడి కుటుంబ స భ్యులు, బంధువులు, జిన్‌కుంట గ్రామస్తులు ఆరోపించారు. ఈ పని ఏడీ, ఏఈ పర్యవేక్షణలో ఎల్‌సీ (లైన్ కట్) తీసుకు ని చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహించారన్నారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిం చే ఆపరేటర్లు నిత్యం మద్యం మత్తులో జోగుతుంటారన్నారు. ఈ మేరకు వారు అచ్చంపేట-నాగర్‌కర్నూల్ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఈ రూట్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీధర్ అక్కడికి చేరుకుని బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై మృతుడి భార్య భీమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అంతిరెడ్డిపల్లిలో రైతు..
వెల్దండ : మరో సంఘటనలో వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంతిరెడ్డిపల్లికి చెందిన కొండల్‌రెడ్డి (42) వృత్తిరీత్యా రైతు. ఈయనకు భార్య సుగుణమ్మతోపాటు ఇద్దరుకు మార్తెలు ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సమీపంలోని తమ పొలం వద్ద అతను బోరుమోటార్ వైర్లు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ జానకిరాంరెడ్డి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబ సభ్యులు బోరుమన్నారు.