స్తంభంపైనే ప్రాణాలు విడిచిన భూమయ్య
హైదరాబాద్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఉసురుతీసింది. కనెక్షన్ ఇవ్వడానికి స్తంభం ఎక్కిన చిరుద్యోగి దానిపైనే ప్రాణాలు విడిచాడు. ఇందులో కుట్ర దాగి ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ కింగ్‌కోఠి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన పోగుల భూమయ్య (42) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి. మంగళవారం కింగ్‌కోఠిలోని పర్దాగేట్ సమీపంలో ఓ దుకాణంలో కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు వెళ్ళాడు. 11 గంటల ప్రాంతంలో వి ద్యుత్ సరఫరా నిలిపేసి, స్తంభంపైకి ఎక్కి కనెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
అయితే ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు కిందికి దింపి స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే భూమయ్య మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నారాయణగూడ ఎస్సై దయాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భూమయ్య మరణించిన విషయం తెలుసుకున్న బంధువులు పెద్దసంఖ్యలో గాంధీ మార్చురీకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
అధికారుల ప్రమేయం ఉంది
భూమయ్య మృతి పట్ల తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. చైర్మన్ ఈశ్వరరావు, కన్వీనర్ నాగరాజ్‌లు మాట్లాడుతూ..ఒకే ఇంటికి రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటంతో కరెంట్ రిటర్న్ సరఫరా జరిగి భూమయ్య చనిపోయాడన్నారు. దీని వెనుక అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తక్షణమే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment