రైతుల నెత్తిన ట్రాన్స్‌ఫార్మర్ల పిడుగు | Thunderbolt transformers necessary for farmers | Sakshi
Sakshi News home page

రైతుల నెత్తిన ట్రాన్స్‌ఫార్మర్ల పిడుగు

Published Mon, Feb 3 2014 1:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతుల నెత్తిన  ట్రాన్స్‌ఫార్మర్ల పిడుగు - Sakshi

రైతుల నెత్తిన ట్రాన్స్‌ఫార్మర్ల పిడుగు

  • చిన్నవి ఏర్పాటుచేసేందుకు కసరత్తు
  •  ఇప్పటికే నూజివీడు మండలంలో అమలు
  •  విద్యుత్ శాఖ బాధ్యత నుంచి తప్పుకొనేందుకు అంటున్న రైతులు
  •  ఒకవైపు విద్యుత్ కోతలతో విలవిల్లాడుతున్న రైతుల నెత్తిన ట్రాన్స్‌ఫార్మర్ల పేరిట కొత్త భారాలు మోపేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) సిద్ధమవుతోంది. గ్రామాల్లో పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లకు స్వస్తి పలికి చిన్నవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పద్ధతిని ఇప్పటికే నూజివీడు మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా చక్కటి ఫలితాలు వచ్చాయని.. దీనిని జిల్లా అంతటా అమలు చేస్తామని ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
     
    సాక్షి, విజయవాడ : వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ఇప్పటివరకు రైతుల అవసరాలను బట్టి 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేవారు. ఒక 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌పై 5 హెచ్‌పీ మోటార్లు 20 నుంచి 25 వరకు, 20 హెచ్‌పీ మోటార్లు ఐదారు ఉపయోగించుకోవచ్చు. రైతులు అవసరాలను బట్టి మోటార్ హార్స్‌పవర్ (హెచ్‌పీ)ని ఏర్పాటు చేసుకుంటారు. ఒకేచోట 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల 5 హెచ్‌పీ మోటార్లు 25 ఉపయోగించుకోవాల్సి ఉండగా, రైతులు అక్రమంగా 30 నుంచి 35 వరకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలు అధికారుల్లో ఉంది.

    విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా దొంగతనంగా మోటార్ వైర్లు విద్యుత్ తీగలకు తగిలించి రైతులు వినియోగించుకుంటున్నారని, దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడుపడి పాడైపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఏస్పీడీసీఎల్‌కు తీవ్రంగా నష్టం వస్తోందని పేర్కొంటున్నారు. దీంతో మినీ ట్రాన్స్‌ఫార్మర్లపై అధికారులు దృష్టిపెట్టారు. వ్యవసాయానికి 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మోటార్     కెపాసిటీని బట్టి ఈ ట్రాన్స్‌ఫార్మర్లు నిర్మిస్తారు. ఐదారు 5 హెచ్‌పీ మోటార్లకు కలిపి ఒక 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. రెండు మూడు 5 హెచ్‌పీ మోటార్లకు ఒక 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయొచ్చు.
     
    హెచ్‌పీకి రూ.1000 వసూలు
     
    కొత్తగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు కావాల్సినవారు మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హెచ్‌పీకి రూ.1000 చొప్పున చెల్లిస్తే, వారికి కావాల్సిన కెపాసిటీని బట్టి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఇప్పటికే ఉన్న లైను నుంచి కొత్తగా లైను వేయాలంటే దానికి అయ్యేభారాన్ని రైతులే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.  
     
    రైతుల నుంచి నిరసన
     
    మినీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. విద్యుత్‌శాఖ తమ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకే ఈ విధంగా మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు తీసివేసి చిన్నవి రైతులకు అంటగడతారని, ఇప్పటికే ఉచిత విద్యుత్ నుంచి ప్రభుత్వం చల్లగా జారుకుంటోందని, ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, వాటి నిర్వహణ భారం కూడా రైతుల పైనే భారం మోపేందుకు సిద్ధమౌతుందని అంటున్నారు. రైతులు విద్యుత్ చౌర్యం చేసున్నారనే అధికారులు నెపం వేస్తున్నారే తప్ప రోజులో నాలుగైదు గంటలు కూడా విద్యుత్ లేకపోవడంతో అనేక మంది రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.
     
    పాత కనెక్షన్లకు పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లే ఉండాలి
    ఇప్పటికే జిల్లాలో వేలాది మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు తీసివేసి చిన్నవి పెట్టి ఆ ఆర్థిక భారం రైతుల నెత్తిన వేయడం సరికాదు. చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజులు పోతే ఎవరు వేస్తారు? రైతులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లకూడదనే నిబంధన ఉంది. విద్యుత్ ఉద్యోగి వచ్చి ఫ్యూజు వేసేవరకు వారు ఎదురుచూడాల్సి వస్తుంది. గ్రామాల్లో ఎక్కువ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటం వల్ల ఇబ్బందులు కూడా పెరుగుతాయి. అధికారులు రైతులకు మేలు కలిగే నిర్ణయాలే తీసుకుంటే మంచిది.     
    - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement