దూసుకొచ్చిన మృత్యువు  | Lorry collided with Tata Ace at Rimmanaguda | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు 

Published Sat, Sep 15 2018 1:39 AM | Last Updated on Sat, Sep 15 2018 1:46 AM

Lorry collided with Tata Ace at Rimmanaguda - Sakshi

రోడ్డు కిందకు దూసుకెళ్ళిన టాటా ఏస్, ప్రమాదానికి కారణమైన లారీ, పోచయ్య(ఫైల్‌) కిష్టయ్య(ఫైల్‌), సాయమ్మ(ఫైల్‌)

సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్‌: ఆగివున్న టాటా ఏస్‌ వాహనాన్ని మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్కూక్‌ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య కుటుంబ సభ్యులు, బంధువులు కలసి చేర్యాల మండలం నాగపురి గ్రామంలో మృతి చెందిన తమ సమీప బంధువైన మల్లేశం అంత్యక్రియలకు టాటా ఏస్‌ వాహనంలో వెళ్తున్నారు. రిమ్మనగూడ స్టేజీ వద్దకు రాగానే మరో బంధువు దాచారం నుంచి వస్తున్నానని కబురు పెట్టడంతో పక్కనే వాహనాన్ని ఆపి వేచి చూడసాగారు. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న లారీ (ఏపీ 15టీవీ 9129) వీరి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ సంఘటనలో టాటా ఏస్‌లో ఉన్న అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం 21 మంది పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరో ముగ్గురికి గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు భూంరెడ్డి, భూపతిరెడ్డి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయెల్‌ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా, రిమ్మనగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌ రావు మృతుల కుటుంబాలతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. నిమ్స్‌ కు తరలించిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఒక్కరు మినహా.. అందరి పరిస్థితి విషమం! 
నిమ్స్‌కు తీసుకు వచ్చిన 21 మంది క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో రాములు (55), చంద్రమ్మ (40), భిక్షపతి (40), చంద్రయ్య (50), అమృతయ్య (55), చంద్రమ్మ (45), స్వామి (40), ఐలమ్మ (40), బాల నర్సయ్య (75), నర్సింహులు (65), భాగ్య (35), కమలమ్మ, పోశయ్య, మ రో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వై ద్యుల ద్వారా తెలిసింది. 

నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన హరీశ్‌  
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం క్షతగాత్రుల సహాయకులకు రూ.10 వేల చొప్పున అందజేశారు.  అంత్యక్రియలకు తక్షణమే పదివేల రూపాయల చొప్పున స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement