
లత మృతదేహం
నెల్లూరు రూరల్: విద్యుత్ లైన్ తీగ తెగి పడటంతో ఓ కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడిన విషాద ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం మేరకు... ఎంఐబీ– 207 ఇంటిలో గోవిందు వేణుగోపాల్ (54) కుటుంబం నివసిస్తోంది. ఆయన సైదాపురం మండలం కలిచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొరియర్ రావడంతో కవర్‌ను అందుకుని డబ్బులు ఇచ్చే సమయంలో పైనున్న విద్యుత్ లైను తీగ తెగి కొరియర్ బాయ్ టోపీపై పడింది.
అతను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా ఆ తీగ వేణుగోపాల్‌పై పడింది. ఆయన అరుపులకు ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్య లత (45) భర్తను కాపాడే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. వేణుగోపాల్ తల్లి బుజ్జమ్మ (71) కూడా బయటకు రాగా ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురికావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేణుగోపాల్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడుకి ఇటీవలే బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. కుమార్తె డిప్లొమా పరీక్షలు రాయడానికి అనంతపురం వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment