మహబూబ్‌నగర్ క్రైం: పొలానికి నీళ్లు పెట్టడానికి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని జమిస్తాపూర్ చెందిన శరత్‌కుమార్(19) ఆదివారం ఉదయం తండ్రి గోపాల్‌తో కలిసి గ్రామ శివారులో ఉన్న వరి పంట పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటార్ స్విచ్ఛాన్ చేసే క్రమంలో షాక్ తగలడంతో తీవ్ర గాయా లు అయ్యాయి.
చికిత్స కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
చారకొండ: గులికల మందు మింగి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని జేపల్లి పంచాయతీ పరిధిలో నెమలిగుట్టతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమలిగుట్టతండాకు చెందిన రాత్‌లవత్ బుజ్జి (39) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 20వ తేదీన గులికల మందు తిని అపస్మారకస్థితిలో పడిపోయింది.
స్థానికులు గమనించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టెబుల్ నాగయ్య తెలిపారు.
రైలు కిందపడి యువకుడి బలవన్మరణం
జడ్చర్ల: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం మేరకు.. మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గొడుగు మహేశ్(23) జల్సాగా తిరు గుతుండేవాడు.
ఈ క్రమంలో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ వివరించారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
మృతదేహంతో ఆందోళన..
మిడ్జిల్: పోస్టుమార్టం అనంతరం మహేష్ మృతదేహంతో బైరంపల్లి సమీపంలోని క్రషర్ మిషన్ ఎదుట బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా క్రషర్ మిషన్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, శనివారం సాయంత్రం డ్యూటీ ముగిశాక ఇంటికి రాలేదని.. ఆదివారం ఉదయం గొల్లపల్లి సమీపంలో రైలు పట్టాలపై మృతిచెంది కనిపించినట్లు గ్రామస్తులు వివరించారు.
యజమానులు అందుబాటులోకి రాకపోవడంతో సాయంత్రం వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు.
నిప్పంటించుకుని వృద్ధుడు..
ఉండవెల్లి: నిప్పంటించుకుని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రాజు వివరాల మేరకు.. తక్కశీలకు చెందిన తెలుగు వెంకట్రాముడు (65), లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల కిందట వెంకట్రాముడికి పక్షపాతం రావడంతో ఎడమ కాలు, చెయ్యి పడిపోయింది.
నెలరోజుల కిందట ఇంట్లో కాలుజారి పడటంతో వెన్నెముకకు గాయమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కేసు నమోదు
ఉండవెల్లి: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. పోతులపాడుకు చెందిన భానుప్రకాష్, మరో ఇద్దరు టోల్‌ప్లాజా సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కారు నిలుపుకొని మద్యం తాగుతున్నారు.
పోలీసులు రమేష్, హుస్సేన్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని.. వెళ్లిపోవాలని కోరగా ఆగ్రహించిన మందుబాబులు దురుసుగా మాట్లాడి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment