సంజీవ కుమార్, గోపాల్ దాస్ (ఫైల్ ఫొటోలు), బాల శేఖర్ (ఫైల్)
పులివెందుల: సరదాగా ఈతకు వెళ్లి.. నీటి కుంటలో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలోని నామాలగుండు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. ప్రొద్దుటూరు టౌన్‌లోని మోడంపల్లెకు చెందిన సంజీవరాయుడు కుమారుడు సంజీవ కుమార్(29) టైల్స్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం నిమిత్తం సత్యసాయి జిల్లా కదిరికి వెళ్లేందుకు మంగళవారం ఉదయం తన తమ్ముడు బాలశేఖర్(19)తో కలిసి కారును అద్దెకు తీసుకున్నాడు. పొట్లదుర్తికి చెందిన డ్రైవర్ గోపాల్‌దాస్(22)తో కలిసి కదిరి వెళ్లి టైల్స్ కొనుగోలు చేశారు. తిరిగి వస్తూ కదిరి–పులివెందుల రోడ్డులోని నామాలగుండు వద్ద కారు ఆపారు.
ఆ పరిసరాల్లో ఫొటోలు తీసుకొని.. ఈత కోసం నీటి కుంటలో దిగారు. కొద్దిసేపటికి సుడిగుండంలో చిక్కుకొని ముగ్గురూ మృతి చెందారు. రాత్రి అయినా వాళ్లు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో.. కుటుంబసభ్యులు వెంటనే కారు యజమానిని కలిసి జీపీఎస్ సాయంతో నామాలగుండుకు చేరుకున్నారు. కారు అక్కడే ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. నీటి కుంట వద్ద చెప్పులు, దుస్తులు కనిపించడంతో వెంటనే పులివెందుల అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌ఐ చిరంజీవి ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలించగా బుధవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment