పక్కాగా ప్లాన్ వేసుకున్న తర్వాతే విజయవాడ సమీపంలోని పెద అవుటపల్లి వద్ద దుండగులు హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వివరాలన్నీ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. మూడు రోజుల నుంచి గన్నవరంలోని రాయల హంపి అనే హోటల్లో మకాం వేసిన దుండగులు.. కాల్పుల తర్వాత కూడా మళ్లీ అదే హోటల్కు వచ్చినట్లు తాజాగా తేలింది. అక్కడే తాము ఉపయోగించిన కారును వదిలేసి, మరో రెండు కార్లలో అక్కడినుంచి రాజమండ్రి వెళ్లారని చెబుతున్నారు. ముందుగా విశాఖపట్నం వరకు మాట్లాడుకుని కూడా రాజమండ్రిలో దిగిపోయి అక్కడినుంచి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాళ్లు ప్రయాణించిన వాహనాల ట్రావెల్స్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. హోటల్ ప్రాంగణంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం, సూపర్ బజార్లలో గల సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. సూపర్ బజార్ కెమెరాలో అస్పష్టంగా నిందితుల చిత్రాలు కనిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా చినకడిమిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి చెందిన ముగ్గురిని ఒకేసారి హతమార్చడంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Published Wed, Sep 24 2014 9:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement