pedda avutapalli
-
ట్రిపుల్ మర్డర్‌కు రెండేళ్లు
నేటికీ దొరకని సూత్రధారి భూతం గోవిందు గన్నవరంః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెదఆవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులోని నిందితులు శుక్రవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. కాల్పుల కేసుకు శనివారంతో రెండేళ్ళు పూర్తికానుంది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారులు పగిడిమారయ్య, పెదమారయ్యలు 2014 సెప్టెంబర్ 24న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఏలూరుకు వెళ్తుండగా పెదఆవుటపల్లి వద్ద దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ హత్యాకాండలో మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటివరకు 45 మందిని నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 35 మంది వరకు బెయిల్‌పై విడుదలకాగా హత్యలు చేసిన ఢిల్లీకి చెందిన పది మంది కిరాయి షూటర్లు జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముగ్గురు మినహా 42 మంది నిందితులు కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. విచారణను తిరిగి వచ్చెనెల 7వ తేదికి న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భూతం గోవింద్‌తో పాటు మరో ముగ్గురు షూటర్లు ఇప్పటికీ దొరక్కపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. సూత్రధారి గోవిందు దొరికితే తమకు న్యాయం జరగదని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
విజయవాడ: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ - విశాఖ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. -
హైవే కాల్పులు: పోలీసుల అదుపులో సీఐ
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్స్ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరో ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు పెదవి విప్పటం లేదు. మరోవైపు నిందితులను రక్షించేందుకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ నెల 24న కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మారం శ్రీనివాస్, గణేష్ సహా స్థానికులు ఆరుగురు నిందితులుగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా వీరిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వీలైనంత త్వరలో పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోతారని, అప్పటివరకు వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టొద్దని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు కమిషనరేట్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను అధికారులు సున్నితంగా తిరస్కరించారని సమాచారం. -
ముంబైలో నా మనవడిపైనా హత్యాయత్నం
విజయవాడ : భూతం దుర్గారావు హత్యకేసులో కేవలం అనుమానించి తమ కుటుంబంపై కేసులు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారని మృతుడు గంధం నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ ఆరోపించింది. దుర్గారావు హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయినా తన భర్తను, పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె భోరున విలపించింది. ముంబయిలో తన మనవడిపై కూడా హత్యాయత్నం జరిగిందని యాదగిరమ్మ ఆరోపించింది. పది కోట్లు ఖర్చు పెట్టి ఈ హత్యలు చేశారని ఆమె తెలిపింది. కాగా కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద బుధవారం దారుణ హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు, వారిని హతమార్చిన వ్యక్తులు దగ్గరి బంధువులే. కుటుంబ కలహాలు, వృత్తిలో ఏర్పడిన విభేదాలు, రాజకీ య విద్వేషాలు బంధుత్వాన్ని సైతం మర్చిపోయేలా చేశాయి. వారి మధ్య పగ, ప్రతీకారాలు మొత్తంగా ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. -
బైక్‌పై ఉండి కాల్పుల ఘటనను ప్రత్యక్షంగా చూశారు
ఏలూరు : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు ... ఇద్దరు నిందితుల్ని గుర్తించారు. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు మరికొన్ని ఆధారాలు సేకరించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్‌ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్‌లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ దొరికిన సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుల విషయంలో పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. వీరితో పాటు నలుగురు నిందితులు ముంబైకి చెందినవారుగా పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా పుటేజ్‌లో శ్రీనివాసరావు, పురాణం గణేష్‌లను హతుల కుటుంబ సభ్యురాలు శ్రీదేవి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుల సెల్‌ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. మరోవైపు నిందితుల వేలిముద్రలు కూడా సరిపోలాయి. కాగా ఘటనా స్థలంలో బైక్‌పై ఉండి కాల్పుల ఘటనను శ్రీనివాసరావు, గణేష్ ప్రత్యక్షంగా చూసినట్లు సమాచారం. ఏలూరు, హనుమాన్ జంక్షన్ లాడ్జిల్లో ఉండి మూడు రోజుల పాటు హత్యలకు పథకం వేసినట్లు సమాచారం. ఇక గతంలో భూతం దుర్గారావు హత్యకేసులో ప్రధాన నిందితుడు నాగరాజు సహా పదిమంది పోలీసులకు లొంగిపోయారు. అయితే ఏడుగురు నిందితులను అదుపులో ఉంచుకుని, మిగతా ముగ్గురిని పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతి చెందిన ముగ్గురికి ఇంకా పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు. పోలీసులు అందుబాటులో లేకపోవటం....సమయం మించిపోయిన తర్వాత పంచనామా పత్రాలు ఇవ్వటంతో నిన్న పోస్ట్‌మార్టం కాలేదు. ఈరోజు పోస్ట్‌మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది. -
భయం గుప్పిట్లో పినకడిమి గ్రామస్తులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి మండలం పినకడిమిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గ్రామంలో 15 చోట్ల పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు పినకడిమిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 300మంది పోలీసులతో ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోకి మీడియా సిబ్బందిని కూడా అనుమతించటం లేదు. పినకడిమి పోలీసుల దిగ్బంధంలో ఉంది. బయటివారిని గ్రామంలోనికి అనుమతించడం లేదు. గ్రామంలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. నిందితులు, బాధితుల ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు అనుక్షణం పహారా కాస్తున్నారు. మరోవైపు ఏలూరులోని కొన్ని అపార్ట్మెంట్లలో కూడా పోలీసులు సోదాలు చేపట్టారు. -
హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు...
విజయవాడ : విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులకు క్లూ లభించింది. హంతకులు వాడిన కారును పోలీసులు గుర్తించారు. వాళ్లు బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే .. కారును వదిలి వెళ్లారు. కారులోని రెండు కత్తులు,తుపాకీతో పాటు రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా తాపీగా హోటల్‌కు చేరుకున్న ..బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తరువాత మరో రెండు కార్లలో రాజమండ్రి వైపు వెళ్లినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరో వైపు ట్రావెల్స్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరగాళ్ల కోసం రెండు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. హంతకుల్లో అయిదుగురు బీహార్‌కు చెందినవారు కాగా, ఒకరిని స్థానికుడిగా గుర్తించినట్లు సమాచారం. -
లండన్‌లోనే ప్లాన్, రూ.3 కోట్లకు ఒప్పందం
విజయవాడ : విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి కుట్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు ముంబయి ప్రొఫెషనల్ కిల్లర్స్‌తో రూ.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా కిల్లర్స్ పరారీలో ఉన్నారు. హత్యలకు 032 రివాల్వర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కుట్రదారులకు ముంబయి, కెనడా, లండన్‌ల్లో ఆస్తులు ఉన్నాయి. జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హత్య చేయించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. లండన్‌లో ఉంటున్న దుర్గారావు బంధువు ఇక్కడ అనుచరుల సాయంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచి, కిరాయి హంతకులతో పథకం రచించి అదును చూసి హత్యలు చేయించినట్లు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన ముగ్గురు వ్యక్తులను నిన్న నడిరోడ్డుపై దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. -
పక్కా ప్లాన్‌తోనే హత్య.. రాజమండ్రికి పరారీ
-
పక్కా ప్లాన్‌తోనే హత్య.. రాజమండ్రికి పరారీ
పక్కాగా ప్లాన్ వేసుకున్న తర్వాతే విజయవాడ సమీపంలోని పెద అవుటపల్లి వద్ద దుండగులు హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వివరాలన్నీ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. మూడు రోజుల నుంచి గన్నవరంలోని రాయల హంపి అనే హోటల్లో మకాం వేసిన దుండగులు.. కాల్పుల తర్వాత కూడా మళ్లీ అదే హోటల్‌కు వచ్చినట్లు తాజాగా తేలింది. అక్కడే తాము ఉపయోగించిన కారును వదిలేసి, మరో రెండు కార్లలో అక్కడినుంచి రాజమండ్రి వెళ్లారని చెబుతున్నారు. ముందుగా విశాఖపట్నం వరకు మాట్లాడుకుని కూడా రాజమండ్రిలో దిగిపోయి అక్కడినుంచి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాళ్లు ప్రయాణించిన వాహనాల ట్రావెల్స్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. హోటల్ ప్రాంగణంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం, సూపర్ బజార్లలో గల సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. సూపర్ బజార్ కెమెరాలో అస్పష్టంగా నిందితుల చిత్రాలు కనిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా చినకడిమిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి చెందిన ముగ్గురిని ఒకేసారి హతమార్చడంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.