నేటికీ దొరకని సూత్రధారి భూతం గోవిందు
గన్నవరంః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెదఆవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులోని నిందితులు శుక్రవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. కాల్పుల కేసుకు శనివారంతో రెండేళ్ళు పూర్తికానుంది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారులు పగిడిమారయ్య, పెదమారయ్యలు 2014 సెప్టెంబర్ 24న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఏలూరుకు వెళ్తుండగా పెదఆవుటపల్లి వద్ద దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ హత్యాకాండలో మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటివరకు 45 మందిని నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 35 మంది వరకు బెయిల్‌పై విడుదలకాగా హత్యలు చేసిన ఢిల్లీకి చెందిన పది మంది కిరాయి షూటర్లు జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ముగ్గురు మినహా 42 మంది నిందితులు కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. విచారణను తిరిగి వచ్చెనెల 7వ తేదికి న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భూతం గోవింద్‌తో పాటు మరో ముగ్గురు షూటర్లు ఇప్పటికీ దొరక్కపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. సూత్రధారి గోవిందు దొరికితే తమకు న్యాయం జరగదని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.