సాక్షి, వరంగల్ : చిల్లర మల్లర తిరుగుళ్లకు.. జల్సాలకు డబ్బులు తగలేసిన మహ్మద్ షఫీ అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యకు యత్నించాడా? ‘చావడమెందుకు చంపడమే పరిష్కారం’ అన్న స్నేహితుల బ్రెయిన్‌వాష్‌తో హంతకుడిగా మారాడా? చావాలనుకున్న షఫీ 15 రోజుల కిందట మనసు మార్చుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడా?’ అంటే నిజమేనంటోంది నిందితుల నేరాంగీకార పత్రం. సంచలనం కలిగించిన వరంగల్‌లోని ఎల్‌బీ నగర్‌లో బుధవారం తెల్లవారుజామున ముగ్గురి దారుణహత్య, మరో ఇద్దరిని గాయపరిచిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సొంత తమ్ముడే మరో ఐదుగురితో కలిసి దారుణానికి ఒడిగట్టిన సంఘటనపై కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు.
ఆ ఐదుగురి ప్రోద్బలంతోనే పథకం...
చావే మార్గమనుకున్న షఫీకి స్నేహితులు, సహచరులు బోయిని వెంకన్న, ఎండీ.సాజీద్, రాగుల విజేందర్, ఎండీ.మీరా అక్బర్, ఎండీ.పాషాలు.. ‘నువ్వెందుకు చావాలి.. మీ అన్నను చంపడమే మేలు’ అన్న మార్గం చూపించారు. దీంతో మనసు మార్చుకున్న షఫీ అన్నతోపాటు అతని కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పదిహేను రోజుల క్రితం స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐదు వేటకత్తులతోపాటు వరంగల్ నగరంలో బ్యాటరీతో పనిచేసే రంపాన్ని కొనుగోలు చేశాడు. వీటిని తన ఇంటిలోనే భద్రపర్చాడు. పథకం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మిగతా నిందితులు షఫీ ఇంటిపైన కలుసుకుని ఎవరెవరు ఏమి చేయాలి? అన్నకోణంలో హత్యాకాండకు పథక రచన చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తమ వెంట ఒక జత బట్టలను తీసుకుని సాజిద్, ఎండీ.పాషాల ఆటోల్లో మిగతా ముగ్గురు.. బయలుదేరారు. షఫీ తన అన్న ఇంటికి మార్గం చూపించేందుకు బైక్‌పై ముందు వస్తుండగా, అతని వెనుక ఆటోల్లో మిగతా వారు వచ్చారు.
చదవండి: సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాగింగ్.. ఆమెపై నీడలా భర్త
ఇంటి తలుపు కట్‌చేసి, కళ్లల్లో కారం చల్లి...
చాంద్‌పాషా ఇంటి ముందు ఆటోలో ఆగిన ఆరుగురు ముందుగా ఎలక్ట్రిక్ రంపం శబ్దం పక్క ఇళ్ల వాళ్లకు వినిపించకుండా ఉండేందుకు ఆటోను స్టార్ట్‌చేసి ఎక్స్‌లేటర్ పెంచారు. వెంకన్న అనే వ్యక్తి రంపాన్ని తీసుకోగా, మిగతా వారు వేట కత్తులతోపాటు కారం ప్యాకెట్లను పట్టుకున్నారు. చాంద్ పాషా ఇంటి ప్రధాన ద్వారం తలుపును రంపంతో కట్ చేసి ఇంటి కరెంట్‌ను నిలిపివేశారు. ప్రధాన ద్వారాన్ని మిషన్ కట్ చేసే క్రమంలో వచ్చిన శబ్దానికి చాంద్‌పాషా నిద్రనుంచి లేచి గట్టిగా అరిచాడు. ఆ తరువాత అతని భార్య సాబీరా బేగం, బావమరిది ఖలీల్‌పాషా, కుమారులు ఫహద్‌పాషా, సమద్‌పాషాలు నిద్రనుంచి లేచి ముందుకు వచ్చారు.
నిందితులు ఒక్కసారిగా చాంద్ పాషా కుటుంబ సభ్యులపై కారం చల్లి ఒకరు రంపం మిషన్‌తో, మిగతా ఐదుగురు వేట కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చాంద్‌పాషాతోపాటు సాబీరాబేగం, ఖలీల్‌పాషాలు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడగా, వారికి వరంగల్ ఎంజీఎంలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.
కర్కశత్వంలోనూ మానవత్వం..
డబ్బుల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని దారుణహత్యలకు ఒడిగట్టిన మహ్మద్ షఫీ.. చాంద్‌పాషా కూతురు రుబీనాను మాత్రం చంపకుండా ‘బయటకు వెళ్లిపో (బాహర్ చలో)’ అంటూ గద్దించాడు. ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. షఫీకి ముగ్గురు కూతుళ్లుండగా, అందులో ఇద్దరికి పెళ్లిళ్లు కాగా మరొకరు పెళ్లికి ఉన్నారు. రుబీనా అతని చిన్న కూతురుతోపాటు షఫీతో సన్నిహితంగా ఉండేదట. దీంతో హత్యలు జరుగుతున్న సమయంలో ‘ఈ గొడవలతో నీకు సంబంధం లేదు.. నువ్వు బయటకు వెళ్లూ’ అని పంపినట్లు నిందితుడు షఫీ వెల్లడించినట్లు సమాచారం. రుబీనాకు పెళ్లయింది. ఆమె భర్త ఉపాధి కోసం ఖతార్‌కు వెళ్లగా.. చాంద్‌పాషా ఇంట్లోనే ఉంటోంది.
నిందితులు ఆరుగురు.. వీరే
1. మహ్మద్ షఫీ, తండ్రి పేరు మనీసాబ్, వయసు 51, నివాసం మదీనా వీధి,
కాశిబుగ్గ, వరంగల్ జిల్లా(ప్రధాన నిందితుడు మృతుడి తమ్ముడు)
2. బోయిని వెంకన్న, తండ్రి పేరు చంద్రయ్య, వయసు 45, శాంతినగర్, నర్సంపేట,
వరంగల్
3. ఎండీ సాజీద్, తండ్రి పేరు మునీర్, వయసు 32, డాక్టర్స్ కాలనీ, వరంగల్.
4. రాగుల విజేందర్, తండ్రి పేరు పాపయ్య, గోపిరెడ్డిపల్లి, రేగొండ మండలం, భూపాలపల్లి
5. ఎండీ మీరాఅక్బర్, తండ్రి పేరు ఇమామ్ బేగ్, వయసు 40, సుభాష్ నగర్, ఉర్సు, వరంగల్
6. ఎండీ పాషా, తండ్రి పేరు హుస్సేన్, వయసు 37, ఎంహెచ్ నగర్, వరంగల్
వదిన వల్లే అన్న మారాడని..
అప్పుల పాలైన షఫీని తన భార్య తరచూ మందలించేదని, ఆ బాధ భరించలేక అన్న చాంద్‌పాషాతో అప్పులు చెల్లించి తన వాటా ఇవ్వాలని వాగ్వాదానికి దిగేవాడన్న ప్రచారం ఉంది. చాంద్‌పాషా భార్య సాబీరా బేగం తనకు డబ్బులు ఇవ్వకుండా అన్నపై ప్రభావం చూపుతుందని, వదిన పూర్తిగా తన అన్నను మార్చేసిందని కూడా ఇరుగు పొరుగు వారితో షఫీ చెప్పేవాడట. ఈ క్రమంలోనే అన్నతోపాటు వదినపైన కక్ష పెంచుకున్న షఫీ కిరాతకంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అన్నదమ్ముల భార్యలు సైతం తరచూ గొడవలు పెట్టుకున్న సందర్భాలున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment