బైక్పై ఉండి కాల్పుల ఘటనను ప్రత్యక్షంగా చూశారు
ఏలూరు : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు ... ఇద్దరు నిందితుల్ని గుర్తించారు. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు మరికొన్ని ఆధారాలు సేకరించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ దొరికిన సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుల విషయంలో పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు.
వీరితో పాటు నలుగురు నిందితులు ముంబైకి చెందినవారుగా పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా పుటేజ్లో శ్రీనివాసరావు, పురాణం గణేష్లను హతుల కుటుంబ సభ్యురాలు శ్రీదేవి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుల సెల్ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. మరోవైపు నిందితుల వేలిముద్రలు కూడా సరిపోలాయి. కాగా ఘటనా స్థలంలో బైక్పై ఉండి కాల్పుల ఘటనను శ్రీనివాసరావు, గణేష్ ప్రత్యక్షంగా చూసినట్లు సమాచారం. ఏలూరు, హనుమాన్ జంక్షన్ లాడ్జిల్లో ఉండి మూడు రోజుల పాటు హత్యలకు పథకం వేసినట్లు సమాచారం.
ఇక గతంలో భూతం దుర్గారావు హత్యకేసులో ప్రధాన నిందితుడు నాగరాజు సహా పదిమంది పోలీసులకు లొంగిపోయారు. అయితే ఏడుగురు నిందితులను అదుపులో ఉంచుకుని, మిగతా ముగ్గురిని పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతి చెందిన ముగ్గురికి ఇంకా పోస్ట్మార్టం పూర్తి కాలేదు. పోలీసులు అందుబాటులో లేకపోవటం....సమయం మించిపోయిన తర్వాత పంచనామా పత్రాలు ఇవ్వటంతో నిన్న పోస్ట్మార్టం కాలేదు. ఈరోజు పోస్ట్మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది.