హైవే కాల్పులు: పోలీసుల అదుపులో సీఐ
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్స్ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ సీఐ మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరో ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు పెదవి విప్పటం లేదు. మరోవైపు నిందితులను రక్షించేందుకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ నెల 24న కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ కేసులో మారం శ్రీనివాస్, గణేష్ సహా స్థానికులు ఆరుగురు నిందితులుగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా వీరిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వీలైనంత త్వరలో పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోతారని, అప్పటివరకు వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టొద్దని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు కమిషనరేట్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను అధికారులు సున్నితంగా తిరస్కరించారని సమాచారం.