మెదక్: క్రైమ్ బ్రాంచి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గమధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి డ్రైవర్‌ను బిర్యానీ తెమ్మని చెప్పాడు. అతడు వచ్చేలోపే కారుతో ఉడాయించాడు. ఈసంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గంగాపూర్‌కు చెందిన గండ్ల నరేష్‌గౌడ్ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈక్రమంలో శనివారం జహీరాబాద్‌లో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి క్రైమ్ బ్రాంచి పోలీసునని సంగారెడ్డి వరకు కారు కిరాయికి కావాలని రూ. 2 వేలకు మాట్లాడుకున్నాడు. జహీరాబాద్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో బుదేరా వద్ద ఓ దాబాలో లంచ్ చేసి, అక్కడి నుంచి సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ వద్ద ఐదు నిమిషాలు ఆపమన్నాడు. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ వద్ద ఫోన్‌లో మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో సాయంత్రం మీటింగ్ ఉందని డ్రైవర్‌కు తెలిపాడు.
అదనంగా రూ. 3 వేలు కిరాయి అవుతుందని చెప్పగా సరే అన్నాడు. హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలోని ఓ హోటల్ వద్దకు రాగానే మూడు బిర్యానీలు తీసుకురమ్మని డ్రైవర్‌కు చెప్పి రూ.1000 ఇచ్చాడు. దీంతో డ్రైవర్ బిర్యాని ఆర్డర్ చేశాడు. పది నిమిషాలు పడుతుందని హోటల్ నిర్వాహకుడు తెలపగా.. కారులో ఉన్న వ్యక్తికి చెప్పేందుకు వచ్చాడు. అప్పటికే అతడు కారుతో పరారయ్యాడు. ఈ మేరకు డ్రైవర్ నరేష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment