మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు
ధారూరు(వికారాబాద్): పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి అయ్యారు. ఈ ఘటనలో తల్లి, కూతురు, కుమారుడు మృతి చెందగా కుటుంబపెద్ద తీవ్రంగా గాయపడ్డాడు. కూతురు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రాజాపూర్‌కి చెందిన ఫక్రుద్దీన్(43)కు ఇద్దరు భార్యలు. చిన్న భార్య ఖాజాబీ(38), ఆమె కుమారుడు అక్రమ్ (12), కూతురు తబస్సుమ్(15)లతో కలసి సోమ వారం పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న పంటను మెషీన్ ద్వారా తీయించి మధ్యాహ్నం భోజనం తర్వాత మొక్కజొన్న గింజలను సంచుల్లో నింపే పనిమొదలు పెట్టారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వారంతా కలసి పొలంలో ఉన్న మంచె వద్దకు చేరుకున్నారు.
అదే సమయంలో వారి సమీపంలో పిడుగు పడింది. దీంతో ఖాజాబీ, అక్రమ్, తబస్సుమ్ ఘటనాస్థలంలోనే తుదిశ్వాస వదిలారు. వీరి పక్కన ఉన్న రెండు మేకలు కూడా చనిపోయాయి. ఫక్రుద్దీన్ తీవ్రంగా గాయపడటంతో సమీప పొలాల రైతులు, పెద్ద భార్య కుమారుడు ఫయాజ్ గమనించి అతనిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫక్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
కాలేజీకి వెళ్లాల్సిన కూతురు పరలోకానికి..
ఫక్రుద్దీన్ పెద్ద భార్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఖాజాబీని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కుమారుడు సంతానం. చిన్న కొడుకు అక్రమ్ కొడంగల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కూతురు పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఇటీవల 9.0 గ్రేడ్‌తో ఉత్తీర్ణురాలై స్కూల్ ఫస్ట్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment