అభిప్రాయం
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’, ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు ఆకర్షణీయమైన నినాదాలను ట్రంప్ ఇచ్చారు గానీ,వాటిని నిర్వచించలేదు. ఎంత అస్పష్టంగా ఉన్నప్పటికీ అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఈ నినాదాలు బలంగా ఆకర్షించాయి. ఈ విడతలో ట్రంప్ పాలన ఈ నినాదాలకు ఎంతవరకు అనుగుణంగా ఉండవచ్చునన్నది ప్రశ్న.
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్), ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు ఆకర్షణీయమైన నినాదాలు అయితే ఇచ్చారు గానీ, వాటికి నిర్వచనం ఏమిటో చెప్పకపోవటం ఆసక్తికరమైన విషయం. తన 2016 ఎన్నికలలోనూ ఈ నినాదాలు ఇచ్చిన ఆయన అపుడు గెలిచి, తర్వాతసారి ఓడి, ఈసారి తిరిగి గెలిచారు. అయినప్పటికీ ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆ మాటలకు ఎప్పుడూ నిర్వచనాలు చెప్ప లేదు. తన సమర్థకులు, వ్యతిరేకులు, మీడియా, ఇతరులు అయినా అడిగినట్లు కనిపించదు. ఇది ఆశ్చర్యకరమైన స్థితి.
పై రెండు నినాదాలు ట్రంప్ ఉబుసుపోకకు ఇచ్చినవి కావు.అందువల్లనే ఇన్నేళ్ళుగా వాటిని ఇస్తూనే ఉండటమేగాక, ‘మాగా’ను ఒక ఉద్యమంగా ప్రకటించారు. దీనిని బయటి ప్రపంచం అంతగా పట్టించుకోక సాధారణమైన ఎన్నికల నినాదాలుగా పరిగణించటం ఒకటైతే, అమెరికాలోని ట్రంప్ ప్రత్యర్థులు, అకడమీషియన్లలోని అధిక సంఖ్యాకులు, ప్రధాన మీడియా సైతం అదే వైఖరి తీసుకోవటం గమనించదగ్గది. అట్లాగని అందరూ వదలివేశారని కాదు. అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఈ నినాదాలు, అవి ఎంత అస్పష్టంగా ఉన్నప్పటికీ, బలంగా ఆకర్షించటాన్ని గుర్తించిన కొద్ది మంది పరిశీలకులు మాత్రం దాని లోతుపాతులలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
వారి అధ్యయనాలను గమనించినట్లయితే ఈ రెండు నినాదాలు ఏ పరిస్థితులలో ఎప్పుడు రూపు తీసుకున్నాయి? వాటి పరస్పర సంబంధం ఏమిటి? అవి ఏ తరగతులపై ఎందుకు ప్రభావాలు చూపుతున్నాయి? ఆ నినాదాల స్వభావం ఏమిటి? ట్రంప్ వంటి నాయకుల జయాపజయాలతో నిమిత్తం లేకుండా వారి వెంట బలంగా ఎందుకు నిలబడు తున్నారు? ‘మాగా’ను ట్రంప్ అసా ధారణమైన రీతిలో ఒక ఉద్యమమని ఎందుకు అంటు న్నారు? చివరిగా చూసినట్లయితే, ఈ ఉద్యమం అనేది అమెరికన్ సమాజంలో ఎందుకు ఇంకా విస్తరిస్తున్నది? అనే విషయాలు ఒక మేరకైనా అర్థమవుతాయి.
ఆ పరిశీలకులు చెప్తున్నది ముందు యథాతథంగా చూసి, ఈ నినాదాల లక్ష్యాల సాధనకు ట్రంప్ తన మొదటి విడత పాల
నలో చేసిందేమిటి? చేయలేక పోయిందేమిటి? చేసిన వాటి ఫలితాలేమిటి? ఈసారి చేయగలదేమిటి? అనే విషయాలు తర్వాత విచారిద్దాము. విశేషం ఏమంటే, ట్రంప్ రిపబ్లికన్ కాగా, తన ‘మాగా’ తరహా నినాదాన్ని అదే పార్టీకి చెందిన అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ (1981–89) మొదటిసారిగా 1980లోనే మరొక రూపంలో ఇచ్చారు. ఆయన నినాదం ‘లెట్ అజ్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’.
ఈ నినాదంలో రీగన్ ఆలోచనలకు ట్రంప్ ఉద్దేశాలతో పోలిక లేదన్నది అట్లుంచితే, రీగన్ తర్వాత ఆ నినాదం వెనుకకు పోయింది. తర్వాత 22 సంవత్సరాలకు రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ 2012లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామా చేతిలో ఓడినప్పుడు, ట్రంప్ తన ‘మాగా’ నినాదం తయారు చేశారు. అంతేకాదు, ఉత్పత్తులకు కాపీరైట్ పద్ధతిలో దీనిని రిజిస్టర్ కూడా చేయించారు. మరొక మూడేళ్లకు 2015లో అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ వేసి, ‘మాగా’ నినాదాన్ని ప్రకటించటంతోపాటు, అది ఒక ‘ఉద్యమ’మని కూడా అన్నారు.
‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు వెంటనే అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఆకర్షించాయి. వారిలో శ్వేతజాతీయులైన కార్మికులు, మామూలు పనులు చేసుకునేవారు, గ్రామీణ–పట్టణ ప్రాంత పేదలు, కన్సర్వేటివ్‌లు, సాంప్రదాయిక క్రైస్తవులు, డెమోక్రటిక్ పార్టీ సంపన్నుల కోసం పనిచేస్తుందనీ అందువల్ల తాము నష్ట పోతున్నామనీ భావించేవారు, తమ నిరుద్యోగ సమస్యకు ఆ పార్టీ విధానాలే కారణమనేవారూ ఉన్నారు. ఆ చర్చలోనే భాగంగా విదేశీ యుల సక్రమ, అక్రమ వలసలు ముందుకొచ్చాయి.
గమనించ దగినదేమంటే, 2012లో గానీ, 2015లో నామినేషన్ వేసిన సమ యానికిగానీ ట్రంప్ తన నినాదాలకు నిర్వచనం చెప్పలేదు. అయి నప్పటికీ వారంతా, ‘అనిర్వచనీయ అనుభూతి’ అన్న పద్ధతిలో ట్రంప్ నినాదాలలో తమ సమస్యలకు ‘అనిర్వచనీయ పరిష్కారం’ ఏదో చూసుకున్నారు. ట్రంప్ అన్నట్లు అదొక ఉద్యమంగా, లేక రహస్యోద్యమంగా వ్యాపించింది. దాని కదలి కలను డెమోక్రాట్లు, మీడియా, ఉదార వాదులు, అకడమిక్ పండి తులు ఎవరూ గమనించలేదు. తీరా 2016 ఎన్నికలో హిల్లరీ క్లింటన్ ఓడి ట్రంప్ గెలవటంతో వీరికి భూకంపం వచ్చినట్లయింది.
ట్రంప్ స్వయంగా నిర్వచించకపోయినా, ఆయన నినాదాలలో తన సమర్థకులకు కని పించిందేమిటి? అవి అమెరికాలో మొదటి నుంచిగల నేటివ్ అమెరికన్లకు ఉపయోగ పడతాయి. అమెరికా ఒకప్పుడు గొప్ప దేశం కాగా తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయింది. అందుకు కారణాలు విదేశీ ప్రభావాలు. ఆ ప్రభావాలు వలసలు, బహుళ సంస్కృతుల రూపంలో, అదే విధంగా ప్రపంచీకరణల ద్వారా కనిపిస్తూ స్థానిక జనాన్ని, సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులను దెబ్బ తీస్తున్నాయి.
అందువల్లనే ఉద్యోగ ఉపాధులు పోవటం, ధరలు పెరగటం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో విదేశీ ఆర్థిక ప్రభావాలను, వలసలను అరికట్టినట్లయితే, ‘అమెరికా ఫస్ట్’ నినాదం ప్రకారం తమకు రక్షణ లభిస్తుంది, తమ సంస్కృతి వర్ధిల్లుతుంది. ఈ తరగతుల ఈ విధమైన ఆలోచనల నుంచి వారికి ఈ నినాదాల ద్వారా, కొన్ని లక్షణాలు లేదా స్వభావం ఏర్పడ్డాయి. నాయకత్వం నుంచి నినాదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేకపోవటం అందుకు దోహదం చేసింది.
అట్లా కలిగిన లక్షణాలు తీవ్రమైన వైఖరి తీసుకోవటం, వలసలు వచ్చే వారిపై, ముస్లిం తదితర మైనారిటీలపై ఆగ్రహం, జాతివాదం, మహిళా వ్యతిరేకత, ఉదారవాద వ్యతిరేకత, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేదానిపట్ల వ్యతిరేకత, తీవ్రంగా వివాదా స్పదంగా మాట్లాడటం, చట్టాల ఉల్లంఘన, హింసకు వెనుకాడక పోవటం వంటివి వారిలో తలెత్తి నానాటికీ పెరుగుతూ పోయాయి.
విశేషం ఏమంటే, ట్రంప్ స్వయంగా ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చి తాను కూడా బిలియన్లకొద్దీ ధనం సంపాదించి కూడా తన భావజాలం ప్రభావంతో పై విధమైన తరగతులకు ప్రతినిధిగా మారారు. వారి ఆలోచనలూ, ఆకాంక్షలకు, తన ఆలో చనలకు తేడా లేనందున ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ప్రత్యేకంగా నిర్వచనాలు చెప్పవలసిన అవసరమే రాలేదు. ఒకరినొకరు అప్రకటితమైన రీతిలో అర్థం చేసుకుని సహజ మిత్రులయ్యారు.
గత పర్యాయం ట్రంప్ ప్రచారాంశాలు, మొదటి విడత పాలనలో తను తీసుకున్న కొన్ని చర్యలు వారి బంధాన్ని మరింత బలపరిచాయి. ఉదాహరణకు, ముస్లింల రాకను ‘పూర్తిగా’ నిషేధించగలనని 2015 నాటి ప్రచారంలోనే ప్రకటించిన ఆయన, అధ్యక్షుడైన తర్వాత పట్టుదలగా మూడుసార్లు ప్రయత్నించి కొన్ని అరబ్ దేశాల నుంచి వలసలను నిషేధించారు. అమెరికాకు, మెక్సికోకు మధ్య గోడ నిర్మాణం మొదలుపెట్టారు.
వీసాలపై పరిమితులు విధించారు. యూరప్‌తో సహా పలు దేశాల దిగుమతులపై సుంకాలు పెంచారు. తమకు ఆర్థిక ప్రత్యర్థిగా మారిన చైనాపై ఆర్థిక యుద్ధం ప్రకటించారు. తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నదంటూ ఇండియాను నిందించారు. చైనా నుంచి అమెరికాకు తిరిగి రావాలంటూ అమెరికన్ కంపెనీలను బెదిరించారు. ఆ దేశం తమ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉద్యోగాలను ‘దొంగిలిస్తూ’ తమ యువకులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదన్నారు.
ఈ చర్యల వల్ల అమెరికాకు అంతిమంగా కలిగిన ప్రయోజనాలు స్వల్పమన్నది వేరే విషయం. కానీ, గమనించవలసింది దీనంతటిలోని అంతరార్థం. అది గమనించినందువల్లనే, నినాదాలకు నిర్వచనాలంటూ లేకున్నా ఆ తరగతులు ఇప్పటి ఎన్నికల వరకు ట్రంప్‌కు అండగా నిలిచాయి. చివరకు, పోయినసారి ట్రంప్ ఓడిపోయి కూడా అధికార బదిలీకి వెంటనే అంగీకరించని అసాధారణ స్థితి గానీ, ఆయన ప్రోత్సా హంతో అనుచరులు క్యాపిటల్ హిల్ వద్ద హింసకు పాల్పడటంగానీ, పైన పేర్కొన్న స్వభావాల నుంచి పుట్టుకొచ్చినవే.
ట్రంప్ పాలన ఈ విడతలో ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఎంతవరకు అనుగుణంగా ఉండవచ్చునన్నది ప్రశ్న. గత పర్యాయపు పాలనానుభవాలు ఆయనకు ఉన్నాయి. అది గాక, ప్రపంచ పరిస్థితులు ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా అప్పటి కన్నా మారాయి.అందువల్ల, వాస్తవ పాలన ఏ విధంగా సాగేదీ వేచి చూడవలసిందే.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment