పూర్తిస్థాయిలో ఉండేందుకు అయిష్టత
సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న ఫస్ట్ లేడీ
ప్రథమ మహిళ బాధ్యతలు నిర్వహిస్తూనే స్వతంత్రంగా ఉండాలని నిర్ణయం!
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది.
అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు.
ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు.
కొడుకుకు దగ్గరగా...
మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు.
అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్‌కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు.
తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు.
ప్రైవసీకే ప్రాధాన్యత..
పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు.
రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు.
గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment