US First Lady
-
వైట్‌హౌస్‌పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు. గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
అమెరికా మరింత నాగరికం కాబోతోందా?
యు.ఎస్. ప్రతినిధుల సభలోకి కొత్తగా తొమ్మిదిమంది మహిళా ఫెమినిస్టులు వచ్చారు! ఇప్పటికే సభలో స్పీకర్ మహిళ. ఆమె కూడా ఫెమినిస్టే. రెండు సభల్లోనూ (ఇంకోటి సెనెట్) మహిళలకు మద్దతుగా ఉండే ‘ప్రథమ మహిళ’ కూడా ఫెమినిస్టే. ఉపాధ్యక్షురాలు స్త్రీవాది. వీళ్లందరి శక్తి యుక్తులతో అమెరికా మరింత నాగరికం కాబోతోందా? ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని మనం కేరళను అంటున్నట్లుగా.. యూఎస్ ‘బ్లాక్స్ ఓన్ కంట్రీ’ అన్నంతగా సెన్సివిలైజ్ (సహజాతీయకరణ) చెందబోతోందా? యు.ఎస్. ప్రతినిధుల సభలో ప్రస్తుతం 119 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారిలో కొత్తగా ఈ ఏడాది జనవరిలో సభలోకి అడుగుపెట్టిన వారిలో తొమ్మిది మంది స్త్రీవాదులే కావడం ఇప్పుడొక విశేషం అయింది. సాధారణంగా ప్రతి మహిళా స్త్రీవాదిగానే ఉంటారు. స్త్రీల సమస్యల్ని ఆలోచించి పరిష్కారాల కోసం మార్గాలను అన్వేషించేవారు, అవసరమైతే పోరాడే వారే స్త్రీవాదులు. అయితే ఈ తొమ్మిది మంది మరింత శక్తిమంతమైన వారు. ప్రత్యక్షంగా పోరులో పాల్గొన్నవారు. అవసరం అయితే ప్రథమ మహిళను, సభ స్పీకర్, ఉపాధ్యక్షురాలినీ ప్రభావితం చేయగలిగినవారు. ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోగలిగినవారు. చట్టాలను చేయించగలిగినవారు. నికేమా విలియం, కోరీ బుష్, మ్యారీ న్యూమేన్, మ్యారిలిన్ స్ట్రిక్‌ల్యాండ్, తెరిసా లేజర్, శారా జాకబ్స్, క్యాథీ మ్యానింగ్, డొబోరా రాస్, కొరొలీన్.. ఆ తొమ్మిది మంది శక్తి స్వరూపిణులు. మన భాషలో ‘నవ దుర్గ’లు. వీళ్లంతా కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారే. స్పీకర్ నాన్సీ పెలోసీ డెమోక్రాటిక్ పార్టీనే. ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎలాగూ అదే పార్టీ. పై తొమ్మిది మందిలో నలుగురు ‘ఉమెన్ ఆఫ్ కలర్’. అంటే నాన్–అమెరికన్లు. ∙∙∙ ఈ తొమ్మిది మందిలో ప్రతి ఒక్కరికీ ఒక పోరాట నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వ పాలనలో.. స్త్రీ సంక్షేమం కోసం, నల్లజాతి ప్రజలతో సమభావన కోసం వీరు ప్రతిపాదించే విధానాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. నికేమా విలియమ్స్‌నే తీసుకోండి. సభలో ఎవరి పదవీకాలం అయినా రెండేళ్లు కనుక ఈ రెండేళ్లలోనూ నికేమా అనేక ఆశ్చర్యాలను చేయబోతున్నారనే అనిపిస్తోంది. సభలోకి రాకముందు జార్జియా స్టేట్ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఎన్నికలలో అక్రమాలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపి అరెస్ట్ అయ్యారు. కోరీ బుష్, మ్యారీ న్యూమేన్ తమ పురుష ప్రత్యర్థుల్ని ఓడించి సభలోకి అడుగుపెట్టినవారు. అదొక ఘన విజయం. నిజమైన జాతీయ భావన అంటే అన్ని జాతుల్ని కలుపుకుని వెళ్లడం అని ఈ ఇద్దరూ తమ ప్రసంగాలతో మెప్పించారు. కొత్తగా సభలోకి వచ్చిన ఈ తొమ్మిది మందిలో విలియమ్స్‌తో పాటు కోరీ బుష్, మ్యారిలీన్ స్టిక్‌ల్యాండ్, థెరెసా లేజర్ ‘నాన్–అమెరికన్’లు. ‘బ్లాక్ లైవ్జ్ మేటర్’ కార్యకర్తలు. శారా జాకబ్స్ స్త్రీ శిశు సంక్షేమ చట్టాల చట్టాలకు అవసరమైన సవరణలు సూచించగలరు. క్యాథీ మ్యానింగ్ స్కూళ్ల సంస్కరణ వాది. డెబోరా రాస్ మానవ హక్కుల న్యాయవాది. కరోలిన్ ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు. ఈ నైపుణ్యాలు, పోరాట పటిమలు అన్నీ యూఎస్ ప్రతినిధుల సభ ప్రో–ఉమెన్ నిర్ణయాలు తీసుకునేలా చేయ గలిగినవే. ఈ స్త్రీవాదులకు ఎలాగూ మిగతా మహిళా సభ్యుల మద్దతు ఉంటుంది. అంటే.. మనమొక సమభావన కలిగిన సరికొత్త ఆమెరికా ను, ఆ కొత్త వెలుగులో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే. -
డాక్టర్ ఫస్ట్ లేడీ అంటే తప్పేంటి!?
అమెరికా కొత్త అధ్యక్షుడి సతీమణి డాక్టర్ జిల్ బైడెన్ తన పేరులోని ‘డాక్టర్’ అనే మాటను వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టకముందే తీసి పక్కన పెట్టేయాలని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు సూచించడం.. పురుషాహంకారంపై మహిళల ఆగ్రహాగ్నికి తాజా ఆజ్యం అయింది. ఒక మహిళ సొంతంగా ఏం సాధించినా గుర్తింపు లభించదా?! అమెరికా ప్రథమ మహిళ అయినా, భర్త చాటున ఆయన నీడలో ఉండిపోతేనే ఆమెకు గుర్తింపూ గౌరవమూనా?! తనకంటూ ఒక ఉనికిని, అస్తిత్వాన్ని ఆమె ఏర్పరచుకుంటే వెక్కిరింపులు, పరిహాసాలు తప్పవా అని హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబామా, ఇంకా ఇతర ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ జిల్ బైడెన్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. కొద్ది రోజుల్లో డాక్టర్ జిల్ బైడెన్ అమెరికా ‘ప్రథమ మహిళ’ కాబోతున్నారు. అయితే ‘డాక్టర్’ అనే టైటిల్‌ని మించిన తలమానికం మాత్రం కాదు ఆమెకు ఆ ‘ఫస్ట్ లేడీ’ అనే గుర్తింపు. విద్యాబోధనలో పదమూడేళ్ల క్రితం పీహెచ్డీ చేశారు జిల్ బైడెన్. అప్పట్నుంచే ఆమె పేరుకు ముందు డాక్టర్ అనే మాట ఉంది. ఊరికే మాట వరసకు ఉండటం కాదు. ఆ మాటను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు జిల్ బైడెన్. ప్రేమించడం అంటే.. ఒబామా హయాంలో ఎనిమిదేళ్ల తన ‘ద్వితీయ మహిళ’ హోదాలో కూడా ఒక్కనాడూ ఆమె తన ఉద్యోగాన్ని రెండోస్థానంలో వదిలేయలేదు! యూనివర్సిటీ ప్రొఫెసర్‌గానే ఉండిపోయారు. ఒకవేళ తను ప్రథమ మహిళ అయినా కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే తన తొలి ప్రాధాన్యం అని ఎన్నికలకు ముందే ప్రకటించారు డాక్టర్ జిల్ బైడెన్. డాక్టరేట్ అన్నది ఆమె సాధించిన విజయం. అది ఆమె సంతోషం. అయితే ఆమె ప్రథమ మహిళ అయ్యాక తన పేరుకు ముందున్న ‘డాక్టర్’ అనే ఆ టైటిల్‌ను తీసి పక్కన పెట్టేయకపోతే వైట్ హౌస్ గౌరవానికి భంగం కలుగుతుందని జోసెఫ్ ఎప్‌స్టెయిన్ అనే ఆయన ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికలో డిసెంబర్ 11 న రాసిన ఒక అపహాస్య వ్యాసం ఆమె అస్తిత్వాన్ని, సంతోషాన్ని హరించే విధంగా ఉంది. ఒక స్త్రీ.. ‘డాక్టరేట్’ను తన ఉనికిగా చెప్పుకోవడం కూడా తప్పేనా! ఆమె భర్త అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రం ఆమె తన డాక్టరేట్‌ను దాచిపెట్టి, అతడి నీడలో ఉండిపోవలసిందేనా అని హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబమా, మార్టిన్ లూథర్ కింగ్ కుమార్తె బెర్నీస్ కింగ్, మరికొందరు ప్రముఖులు జిల్ బైడెన్‌కు మద్దతుగా నిలబడంతో స్త్రీని లోకువ చేసే మగబుద్ధిపై అగ్రరాజ్య విద్యావంతులలో చర్చ మొదలైంది. ∙∙ ‘ఇదొక పెద్ద కామెడీ. నియమ విరుద్ధం’ అంటాడు జోసెఫ్ ఎప్‌స్టెయిన్. కామెడీ, నియమ విరుద్ధం ఏంటంటే జిల్ బైడెన్ తన పేరుకు ముందు ‘డాక్టర్’ అనే టైటిల్‌ని అలాగే ఉంచేసుకోవడం అట! వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఆయన రాసిన ఆ వ్యాసం శీర్షిక ఎలా ఉందో చూడండి. ‘వైట్ హౌస్‌లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? లేకుంటే కనుక ఒక ఎం.డి. కావాలి’. వెక్కిరింపు అన్నమాట. డాక్టర్ అంటే ఆయన ఉద్దేశంలో డెలివరీ చేయగలిగిన డాక్టర్ మాత్రమే. ఆ మాట కూడా రాశాడు. ‘జిల్ బైడెన్ ఎడ్యుకేషన్ సైన్సెస్‌లో పీహెచ్.డి చేశారు. ఆమె చేసింది మెడికల్ డిగ్రీ కాదు. కాన్పు చేసి, బిడ్డను బయటికి తీసినవాళ్లు మాత్రమే తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అని ఉంచుకోవాలి’ అంటాడు! ఇంకా ఆ వ్యాసంలో జిల్ బైడెన్‌ను ‘కిడ్డో’ అని, ‘ఫ్రాడ్యులెంట్’ అని, ‘ఎ టచ్ కామిక్’ అనీ నానా మాటలూ అన్నాడు. ఆమె చిన్న పిల్లట. జోసెఫ్ ఎప్‌స్టెయిన్ కూడా చిన్నపిల్లాడేం కాదు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ‘ది అమెరికన్ స్కాలర్ మేగజీన్’ మాజీ ఎడిటర్. అంతటి మనిషిలో ఇంతటి స్త్రీద్వేషం, పురుషాహంకారం ఏమిటి?! ∙∙ జనవరి 20 తన భర్త అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జిల్ బైడెన్‌కు రెండు బాధ్యతలు అవుతాయి. అమెరికా ప్రథమ మహిళగా ఒకటి, నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్న బాధ్యత ఒకటి. ఈ రెండో బాధ్యతనే ఆమె ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పేరుకు ముందు డాక్టర్ అనే టైటిల్ ఉన్నా, లేకున్నా పాఠాలు చెప్పడం అనే ఆసక్తి ఆమెకు మొదటి నుంచీ ఉంది. జోసెఫ్ ఎప్స్టీన్ గారు మాత్రం పాఠాలు చెప్పడంలోని ఆమె నిబద్ధతను వదిలేసి, పాఠాలు చెప్పడంలో ఆమె సాధించిన డాక్టరేట్ వెంట పడ్డారు! ఈయన వ్యాసానికి వెస్టెర్న్ కెంటకీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాల్టన్ హాన్లీ తగిన సమాధానమే చెప్పారు. ‘జిల్ బైడెన్ తన టైటిల్‌ని వదిలేయడం కాదు. జోసెఫ్ ఎప్స్టెయినే అదనంగా ఒక డిగ్రీ పట్టాను సంపాదించాలి. తన ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోడానికి’’ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ భర్త ఎంహాఫ్.. ‘ఇలాంటివి ఒక పురుషుడిపై రాయరెందుకు?’ అని ట్వీట్ చేశారు. అందరికన్నా ముందు జిల్ బైడెన్‌కు మద్దతుగా మాట్లాడింది ఆయనే. తర్వాత మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్, మార్టిన్ లూథర్ కింగ్ కూతురు బెర్నైస్ కింగ్, జో బైడెన్ ప్రతినిధి మైఖేల్ లా రోసా, మరో ప్రథమ మహిళ మిషెల్ ఒబామా.. జిల్ బైడెన్ వైపు గట్టిగా నిలబడ్డారు. ప్రముఖులు, మెడికల్ డాక్టర్లు కూడా జిల్ బైడెన్ కు సంఘీభావం తెలిపారు. అనేకమంది మహిళలు ఆమె గౌరవార్థం తమ ట్విట్టర్ అకౌంట్లో తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అనే మాట (ఆనరఫిక్)ను జత కలుపుకున్నారు. కొందరైతే ‘పురుషాహంకారం’, ‘స్త్రీ ద్వేషం’లో జోసెఫ్ ఎప్‌స్టెయిన్‌కు డబుల్ పీహెచ్డీ ఇవ్వాలి అని సున్నితంగా రెండు అంటించారు. ఇన్‌స్టాలో మిషెల్ మద్దతు ‘‘ఆడపిల్లలకు మాత్రమే కాదు. మహిళలందరికీ జిల్ రోల్ మోడల్. వైట్ హౌస్‌లో ఎనిమిదేళ్లు తనను దగ్గరగా చూశాను. ప్రొఫెషనల్ ఉమన్ అంటే తనే అనిపించింది. ఒక బాధ్యత కాదు. కాలేజ్‌లో పాఠాలు, ఇంట్లో తల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా అన్ని పాత్రల్లోనూ తను ఆదర్శంగా ఉండేవారు. ప్రొఫెషనల్‌గా ఉండే ఒక మహిళ.. ఆమె ‘డాక్టర్’, ‘మిస్’, ‘మిసెస్’, ఆఖరికి ‘ఫస్ట్ లేడీ’ అయినా, ఎంత సాధించినా ఆమె శక్తిని గౌరవించడం కన్నా, ఆమెను అపహాస్యం చేయడమే ఎక్కువగా ఉంటుంది. తరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న వివక్షే ఇది. అయినా స్త్రీ ఎప్పటికప్పుడు తనను తను నిరూపించుకుంటూనే ఉంది. జిల్ బైడెన్ కన్నా మెరుగైన ‘ఫస్ట్ లేడీ’ ఉంటారా?!’’ కాబోయే అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో మిషెల్ ఒబామా -
ఇరుక్కుపోయిన ట్రంప్ భార్య.. బయటలొల్లి
హాంబర్గ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ హాంబర్గ్‌లోని అతిథి గృహంలో ఇరుక్కుపోయారు. హాంబర్గ్‌లో జీ 20 శిఖరాగ్ర సమావేశానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె బయటకు రాలేక లోపలే ఉండిపోయారు. ఒక్క ట్రంప్ భార్య మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రతినిధుల సతీమణులు కూడా అందులోని ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే, జీ 20 సదస్సులో భాగంగా వారికి పలు కార్యక్రమాలు ఉండగా ఆందోళన కారణంగా బయటకు రాకుండానే ఉండాల్సి వచ్చిందని అక్కడి మీడియా తెలిపింది. ‘ఆందోళనల కారణంగా అతిథి గృహం నుంచి బయటకు వెళ్లేందుకు హాంబర్గ్ పోలీసులు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు’ అని ట్రంప్ అధికారిక ప్రతినిధి స్టీఫెన్ గిరీషం మీడియాకు చెప్పారు. వాతవరణ కేంద్రానికి వారు వెళ్లకుండానే నేరుగా వాతావరణ శాస్త్రవేత్తలే హాంబర్గ్‌లో హోటల్లో వారికి ప్రసంగాలు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.