యు.ఎస్. ప్రతినిధుల సభలోకి కొత్తగా తొమ్మిదిమంది మహిళా ఫెమినిస్టులు వచ్చారు! ఇప్పటికే సభలో స్పీకర్ మహిళ. ఆమె కూడా ఫెమినిస్టే. రెండు సభల్లోనూ (ఇంకోటి సెనెట్) మహిళలకు మద్దతుగా ఉండే ‘ప్రథమ మహిళ’ కూడా ఫెమినిస్టే. ఉపాధ్యక్షురాలు స్త్రీవాది. వీళ్లందరి శక్తి యుక్తులతో అమెరికా మరింత నాగరికం కాబోతోందా? ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని మనం కేరళను అంటున్నట్లుగా.. యూఎస్ ‘బ్లాక్స్ ఓన్ కంట్రీ’ అన్నంతగా సెన్సివిలైజ్ (సహజాతీయకరణ) చెందబోతోందా?
యు.ఎస్. ప్రతినిధుల సభలో ప్రస్తుతం 119 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారిలో కొత్తగా ఈ ఏడాది జనవరిలో సభలోకి అడుగుపెట్టిన వారిలో తొమ్మిది మంది స్త్రీవాదులే కావడం ఇప్పుడొక విశేషం అయింది. సాధారణంగా ప్రతి మహిళా స్త్రీవాదిగానే ఉంటారు. స్త్రీల సమస్యల్ని ఆలోచించి పరిష్కారాల కోసం మార్గాలను అన్వేషించేవారు, అవసరమైతే పోరాడే వారే స్త్రీవాదులు. అయితే ఈ తొమ్మిది మంది మరింత శక్తిమంతమైన వారు. ప్రత్యక్షంగా పోరులో పాల్గొన్నవారు.
అవసరం అయితే ప్రథమ మహిళను, సభ స్పీకర్, ఉపాధ్యక్షురాలినీ ప్రభావితం చేయగలిగినవారు. ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోగలిగినవారు. చట్టాలను చేయించగలిగినవారు. నికేమా విలియం, కోరీ బుష్, మ్యారీ న్యూమేన్, మ్యారిలిన్ స్ట్రిక్‌ల్యాండ్, తెరిసా లేజర్, శారా జాకబ్స్, క్యాథీ మ్యానింగ్, డొబోరా రాస్, కొరొలీన్.. ఆ తొమ్మిది మంది శక్తి స్వరూపిణులు. మన భాషలో ‘నవ దుర్గ’లు. వీళ్లంతా కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారే. స్పీకర్ నాన్సీ పెలోసీ డెమోక్రాటిక్ పార్టీనే. ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎలాగూ అదే పార్టీ. పై తొమ్మిది మందిలో నలుగురు ‘ఉమెన్ ఆఫ్ కలర్’. అంటే నాన్–అమెరికన్‌లు.
∙∙∙
ఈ తొమ్మిది మందిలో ప్రతి ఒక్కరికీ ఒక పోరాట నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వ పాలనలో.. స్త్రీ సంక్షేమం కోసం, నల్లజాతి ప్రజలతో సమభావన కోసం వీరు ప్రతిపాదించే విధానాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. నికేమా విలియమ్స్‌నే తీసుకోండి. సభలో ఎవరి పదవీకాలం అయినా రెండేళ్లు కనుక ఈ రెండేళ్లలోనూ నికేమా అనేక ఆశ్చర్యాలను చేయబోతున్నారనే అనిపిస్తోంది. సభలోకి రాకముందు జార్జియా స్టేట్ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఎన్నికలలో అక్రమాలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపి అరెస్ట్ అయ్యారు. కోరీ బుష్, మ్యారీ న్యూమేన్ తమ పురుష ప్రత్యర్థుల్ని ఓడించి సభలోకి అడుగుపెట్టినవారు. అదొక ఘన విజయం. నిజమైన జాతీయ భావన అంటే అన్ని జాతుల్ని కలుపుకుని వెళ్లడం అని ఈ ఇద్దరూ తమ ప్రసంగాలతో మెప్పించారు.
కొత్తగా సభలోకి వచ్చిన ఈ తొమ్మిది మందిలో విలియమ్స్‌తో పాటు కోరీ బుష్, మ్యారిలీన్ స్టిక్‌ల్యాండ్, థెరెసా లేజర్ ‘నాన్–అమెరికన్’లు. ‘బ్లాక్ లైవ్జ్ మేటర్’ కార్యకర్తలు. శారా జాకబ్స్ స్త్రీ శిశు సంక్షేమ చట్టాల చట్టాలకు అవసరమైన సవరణలు సూచించగలరు. క్యాథీ మ్యానింగ్ స్కూళ్ల సంస్కరణ వాది. డెబోరా రాస్ మానవ హక్కుల న్యాయవాది. కరోలిన్ ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు. ఈ నైపుణ్యాలు, పోరాట పటిమలు అన్నీ యూఎస్ ప్రతినిధుల సభ ప్రో–ఉమెన్ నిర్ణయాలు తీసుకునేలా చేయ గలిగినవే. ఈ స్త్రీవాదులకు ఎలాగూ మిగతా మహిళా సభ్యుల మద్దతు ఉంటుంది. అంటే.. మనమొక సమభావన కలిగిన సరికొత్త ఆమెరికా ను, ఆ కొత్త వెలుగులో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే.
Comments
Please login to add a commentAdd a comment