శైలేంద్రరెడ్డి మృతదేహం. అతడి ఫొటో (ఇన్ సెట్లో)
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రరెడ్డిని నలుగురు యువకులు బండరాయితో మోది హతమార్చారు. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా శైలేంద్రరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ శైలేంద్రరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి నంద్యాల వచ్చారు.
నంద్యాల బస్టాండు సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో మద్యం కోనుగొలు చేసి.. అందరూ బాగా తాగారు. ఆ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి నలుగురు యువకులు డాక్టర్ శైలేంద్రరెడ్డిని బండరాయితో తలపై మోది హతమార్చి రోడ్డుపై పడేసి పరారైయ్యారు. రాత్రి పెట్రోలింగ్‌లో నిర్వహిస్తున్న పోలీసులు ... వైద్యుడు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్ శైలేంద్రరెడ్డి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు పరిశీలించి.... నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.