అన్‌టైడ్‌లో కోత
భువనగిరి : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ద్వారా పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు కేటాయిస్తున్న అన్‌టైడ్(తిరిగి చెల్లించని) నిధుల్లో కోతపడింది. ఈ నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలు సమర్పించడంలో వైద్యసిబ్బంది అలసత్వం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం కోత విధించింది. దీంతో వైద్యసేవలకు విఘాతం కలగనుంది.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్‌సెంటర్లలో..
జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 565 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటిలో వసతుల కల్పన, అత్యవసర మందుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా 2005 నుంచి అన్‌టైడ్ నిధులు (ఆస్పత్రిస్థాయిని బట్టి) విడుదల చేస్తోంది. ఈ నిధులతో ఆయా పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో సౌకర్యాలు కల్పించడమే గాక అత్యవసర మందులు కొనుగోలు చేసి మెరుగైన వైద్యసేవలు అందించేవారు. అలాగే సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శానిటేషన్ పనులు నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యం కాపాడేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకునేది.
ఎస్‌ఓఈ సమర్పించకపోవడంతో..
ఏటా విడుదలయ్యే అన్‌టైడ్ నిధులు, చేసిన ఖర్చుల వివరాలు పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లు ఎన్‌ఆర్‌హెచ్‌ఎంకు సమర్చించాలి. కానీ జిల్లాలో ఉన్న 50శాతం పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఓఈ (విడుదలైన నిధులు, ఖర్చులు వివరాలు)సమర్పించలేదు. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధుల్లో కేంద్రప్రభుత్వం కోత విధించినట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ నిధులు సరిపోక పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో సరైన వైద్యసేవలు అందే అవకాశం లేదు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జిల్లా అధికారులు సకాలంలో స్పందించకపోతే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
నిధుల దుర్వినియోగమే కారణమా?
పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు ఎన్‌ఆర్ హెచ్‌ఎం ద్వారా వస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా తప్పుడు నివేదికలను రూపొందించడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రావడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. నిధుల వినియోగంలో సరైన నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.