డీపీఎల్ క్యాంపులో అవస్థలు | Stranding camp in double fankar laparoscopic | Sakshi
Sakshi News home page

డీపీఎల్ క్యాంపులో అవస్థలు

Published Sat, Dec 21 2013 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Stranding camp in double fankar laparoscopic

నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శుక్రవారం కుటుంబ నియంత్రణ కోసం డీపీఎల్ (డబుల్ ఫంక్షర్ ల్యాప్రోస్కోపిక్) క్యాంపు నిర్వహిం చారు. ఈ క్యాంపులో ఆపరేషన్లు చేసిన మహిళలను ఆసుపత్రి సిబ్బంది కింద పడుకోబెట్టారు. కనీసం కార్పెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఆపరేషన్ నొప్పులతో ఉన్న వారు పడుకోడానికి సరైన వసతి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  వీరి గోసను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారి వెంట వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. నిబంధనల ప్రకారం శస్త్ర చికిత్స నిర్వహించిన అనంతరం వారికి మంచం ఏర్పాటు చేయడంతో పాటు తినడానికి బ్రెడ్, తాగేందుకు పాలు అందించాలి.

సహాయకులుగా వచ్చిన వారికి కూడా తాగునీరు, టీ, స్నాక్స్ అందించాలి. వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ, ఆసుపత్రి సిబ్బంది ఇవేవీ సమకూర్చలేదు. ఈ సమస్య కేవలం జిల్లా కేంద్రాసుపత్రిలోనే కాదు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ నుంచి 20 వరకు డీపీఎల్ క్యాంపులు నిర్వహిస్తారు. దీనికి కావాల్సిన నిధులను  జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ద్వారా విడుదల చేస్తారు. క్యాంపు నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు సుమారు రూ 6వేల నుంచి 10వేల వరకు నిధులిస్తారు. కానీ, క్యాంపులకు వచ్చే వారికోసం ఆ నిధులు ఖర్చు చేయకుండా అధికారులు జేబు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 కుటుంబ నియంత్రణ పేరుతో కుమ్ముతున్నారు
 జిల్లాలో ప్రతి నెల నిర్వహిస్తున్న డీపీఎల్ క్యాంపులకు ప్రతి నెలా సుమారు రూ లక్ష వరకు నిర్వాహకులు వెనుకేసుకుంటున్నట్టు కార్యాలయం సిబ్బందే బాహాటంగా ఆరోపిస్తున్నారు. నెలలో కనీసం 20 వరకు క్యాంపులను నిర్వహిస్తున్నందున ప్రతినెల ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నుంచి రూ లక్షల్లో నిధులు డ్రా చేస్తున్నారు. క్యాంపులో టెంట్‌లు, కుర్చీలు, కనీస సౌకర్యాలు కల్పించకుండానే.. కల్పించినట్టుగా బిల్లులు సృష్టించి నిధులు డ్రా చేస్తున్నారు. డీపీఎల్ క్యాంపులో ఉపయోగించే సర్జికల్ కిట్ ప్రతి నెల రిపేర్ చేయించినట్టుగా రాసి రూ వేలల్లో  బిల్లులు డ్రా చేస్తున్నారని సమాచారం. కుటుంబ నియంత్రణ క్యాంపులను పర్యవేక్షించడం కోసం ఒక అద్దెకారును కూడా వినియోగిస్తున్నారు. దీనికోసం ప్రతి నెల రూ 24 వేలు వెచ్చిస్తున్నారు. కానీ  కారును క్యాంపుల కోసం కాకుండా స్వంత పనుల కోసం వినియోగిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. డీపీఎల్ క్యాంపుల పేరుతో నిధులను వెనుకేసుకుంటున్న అంశంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement