కోచింగ్‌ సెంటర్ల నిలువు దోపిడీ  | Many Of The Recent Notifications Issued By The State Government Are Causing Profit To Coaching Centers | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్ల నిలువు దోపిడీ 

Published Fri, Aug 2 2019 1:18 PM | Last Updated on Fri, Aug 2 2019 1:19 PM

Many Of The Recent Notifications Issued By The State Government Are Causing Profit To Coaching Centers - Sakshi

ఒకే గదిలో వందల మంది. తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. కనీసం ఫ్యాన్‌ ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉడికిపోవాల్సిందే. మరుగుదొడ్డి బాధలు అన్నీఇన్నీ కావు. ఫీజులు మాత్రం రూ.వేలల్లో బాదేస్తారు. జిల్లాలోని కోచింగ్‌ సెంటర్ల తీరిది. ఉద్యోగంపై ఆశతో వందలాది మంది అక్కడే ‘శిక్ష’ణ పొందుతున్నారు. నెలరోజులు ఓర్చుకుంటే భవిష్యత్‌ బాగుంటుందని బాధలన్నీ భరిస్తున్నారు. ఇదే అదనుగా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు     నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు.           – అనంతపురం ఎడ్యుకేషన్‌

► నగరంలోని ఆర్‌ఎఫ్‌ రోడ్డులో నిర్వహిస్తున్న సాయిగంగ కోచింగ్‌ సెంటర్‌. ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిపైన నిర్వహిస్తున్న ఈ కోచింగ్‌ సెంటర్‌లో అభ్యర్థుల అవస్థలు చెప్పుకుంటే తీరేవికావు. 
► రఘువీరా టవర్స్‌లో నిర్వహిస్తున్న ప్రగతి కోచింగ్‌ సెంటర్‌లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా అభ్యర్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
► గుల్జార్‌పేటలోని ఓ రేకులషెడ్‌లో నిర్వహిస్తున్న శ్రీధర్‌ కోచింగ్‌ సెంటర్‌లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ వందలాది మంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ షెడ్‌లో మగ్గిపోతున్నారు.  
► ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులు అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం గమనార్హం.  

సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పలు నోటిఫికేషన్లు...కోచింగ్‌ సెంటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో నిరుద్యోగులంతా కోచింగ్‌ సెంటర్ల బాట పట్టారు. దీంతో ఏ కోచింగ్‌ సెంటర్లో చూసినా అభ్యర్థులతో కిటకిటలాడుతున్నారు. ఇదే అదునుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 8,545 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్‌–5) పోస్టులు 571, ఏఎన్‌ఎం/మల్టీపర్సస్‌ పోస్టులు 1,041, హెల్త్‌ అసిస్టెంట్‌ వీఆర్‌ఓ (గ్రేడ్‌–2) 384, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు 19, పశుసంరక్షణ అసిస్టెంట్‌ పోస్టులు 805,  ఉద్యానశాఖలో అసిస్టెంట్లు 483, వ్యవసాయ శాఖలో అసిస్టెంట్‌ పోస్టులు 282, మహిళా పోలీస్‌ పోస్టులు 1,217, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 159, డిజిటల్‌ అసిస్టెంట్‌ పంచాయతీ(సెక్రటరీ గ్రేడ్‌–6) పోస్టులు 896, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 896, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 896, విలేజ్‌ సర్వేయర్‌ పోస్టులు 896 భర్తీ చేయనున్నారు.  

కిక్కిరిసిన కోచింగ్‌ సెంటర్లు : ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో కోచింగ్‌ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం తెచ్చుకోవాలనే లక్ష్యంతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. నెలరోజులు మాత్రమే గడువు ఉండటంతో శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్‌ తీసుకునేందుకు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇదే అదనుగా జాబ్‌ గ్యారెంటీ పేరుతో కొన్ని కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఆర్భా ట ప్రచారాలు చేస్తూ నిరుద్యోగులకు వల వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేశ శిక్షణ ఇప్పిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. నెల రోజుల శిక్షణకు రూ.8 వేల దాకా ఫీజు ఫిక్స్‌ చేశారు. హాస్టల్‌ వసతి కావాలంటే మరో రూ.3,500 అదనంగా వసూలు చేస్తున్నారు. 

అధికారుల నియంత్రణ కరువు : ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న కోచింగ్‌ సెంటర్లపై అధికారులకు నియంత్రణ లేదు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్‌ సెంటర్లను ఏ అధికారీ పర్యవేక్షించరు. ఇవి ఎవరి పరిధిలోకి వస్తాయనే విషయంపై అధికారులకే స్పష్టత లేదు. ఇదే కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు కలిసి వస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడం, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నోరు మెదపకపోవడంతో ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. పైగా కనీస సౌకర్యాలు కల్పించడం లేగు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోచింగ్‌ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుని, కనీస సదుపాయాలు కల్పించేలా చూడాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.    
చుక్కల చిక్కులు తీరుస్తాం 

అనంతపురం అర్బన్‌: చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన ఫైళ్లన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ అవినీతి పాల్పడిన సిబ్బందిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ‘‘ రైతులకు చుక్కలు’’ శీర్షిక ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. చుక్కల భూములకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వారం రోజుల్లో ఫైళ్లన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ రైతులను వేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైళ్ల పరిష్కారంలో ఎవరైనా సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే రైతులు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement