కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ కేంద్రాలు డెత్ ఛాంబర్‌లుగా తయారయ్యాయని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోచింగ్ కేంద్రాలు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని వ్యాఖ్యానించింది. రావూస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లో వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఉదంతంపై సూమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీచేసింది. ‘‘ మేం చదివే అంశాలు భయంకరంగా ఉన్నాయి. వాస్తవానికైతే ఇలాంటి కోచింగ్ కేంద్రాలను మనం వెంటనే మూసేయించాలి. కానీ ప్రస్తుతానికి కోచింగ్ ఆపకూడదనే ఉద్దేశంతో వీటిని కేవలం ఆన్‌లైన్‌లో అయినా కొనసాగించాలి.
భవన నిర్మాణ మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి కోచింగ్ సెంటర్లు డెత్ చాంబర్లుగా మారాయి. పోటీపరీక్షల ఆశావహుల ఆశలు, జీవితాలతో కోచింగ్‌కేంద్రాలు ఆటలాడుతున్నాయి. ఎన్నో కలలతో దేశరాజధానికొచ్చిన వారికి తమ కలల సాకారం ఎంతో కష్టమవుతోంది. ముగ్గురు అభ్యర్థుల మరణం నిజంగా మనందరికీ కనువిప్పు కల్గించే ఘటన. అసలు కోచింగ్ సెంటర్లలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు? వాటిని ఏ మేరకు అమలుచేస్తున్నారో మాకు వివరణ ఇవ్వండి’’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment