టాప్‌ పోస్ట్‌.. సిటీ హోస్ట్‌! | UPSC Coaching Centres in Ashok Nagar | Sakshi
Sakshi News home page

Ashok Nagar: టాప్‌ పోస్ట్‌.. సిటీ హోస్ట్‌!

Published Sun, Dec 1 2024 6:55 AM | Last Updated on Sun, Dec 1 2024 6:57 AM

UPSC Coaching Centres in Ashok Nagar

ఢిల్లీ.. నుంచి హైదరాబాద్‌ గల్లీకి.. 

భాగ్యనగరం బాట పడుతున్న సివిల్స్‌అభ్యర్థులు 

అక్కడితో పోలిస్తే ఇక్కడ మరిన్ని ప్రయోజనాలు 

రోజురోజుకూ పెరుగుతున్న కోచింగ్‌ సంస్థలు 

సివిల్‌ సర్వీసెస్ దేశంలోకెల్లా అత్యంత కఠినమైన పరీక్ష అంటారు. నిజమే మూడంచెలుగా ఉండే ఈ ప్రక్రియ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కో దశ దాటాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ప్రిపరేషన్‌ కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే చాలా మంది ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరి కోచింగ్‌ తీసుకుంటుంటారు. ఒకప్పుడు సివిల్స్‌ కోచింగ్‌ అంటే ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడే నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్‌ తీసుకుని, ప్రిపరేషన్‌ అయితే కానీ అత్యున్నత ఉద్యోగాన్ని సాధించడం సులువు కాకపోయేది. కానీ కరోనా తర్వాత ఈ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. మన భాగ్యనగరం సివిల్స్‌ కోచింగ్‌కు హబ్‌గా మారిపోయింది. దీంతో ప్రిపేర్‌ అయ్యే వారు అశోక్‌నగర్‌కు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా కోచింగ్‌ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీతో పోల్చుకుంటే అశోక్‌నగర్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు..? అనుకూల అంశాలేంటి.. నాణ్యతగల కోచింగ్‌ లభిస్తోందా..? వంటి అంశాలను తెలుసుకుందాం. 

సాధారణంగా ఢిల్లీలో వాతావరణం గురించి తెలిసిందే. చలికాలంలో అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన వాయు కాలుష్యంతో బయటకు వెళ్లేందుకు కూడా జంకుతుంటారు. పైగా అక్కడ జీవన వ్యయం కూడా ఇక్కడితో పోల్చుకుంటే రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటుంది. భోజనం కూడా మనకు నచి్చనట్టు ఉండదు. నార్త్‌ ఇండియన్‌ వంటకాలు మన శరీర తత్వానికి సరిపడవు. ఆ ఫుడ్‌కు అలవాటు పడేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఏడాది కాలంలో ఢిల్లీలో విద్యుత్‌ షాక్, వరదలతో సెల్లార్‌లోకి నీళ్లు రావడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి చాలా మంది తల్లిదండ్రులు అదే కోచింగ్‌ హైదరాబాద్‌లో తీసుకోవచ్చనే ఆలోచనకు వస్తున్నారు. ఈ కారణాలన్నీ మన హైదరాబాద్‌కు పాజిటివిటీని తీసుకొచ్చాయి అనొచ్చు. 

ఆన్‌లైన్‌ క్లాసులతో..  
కరోనా ముందు వరకూ ప్రిపరేషన్‌ అంటే దాదాపు ఢిల్లీకి వెళ్లాల్సిందే అనే ఆలోచన అభ్యర్థుల్లో ఉండేది. అయితే కరోనా తర్వాత ఆ పరిస్థితులు మారాయి. ఎక్కడి నుంచైనా టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే వాటిల్లో కూడా ఇంట్లో ఉండే కోచింగ్‌ తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో కోచింగ్‌ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా సంస్థలు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాయి. కరోనా అనంతరం విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల కన్నా నేరుగా క్లాసులు వినేందుకు మొగ్గుచూపారు. దీంతో ఆన్‌లైన్‌ సంస్థలు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచి్చంది. దీంతో సంస్థలు ఏర్పాటు చేస్తేనే బెటర్‌ అని చాలా మంది నగరంలో సంస్థలు ఏర్పాటు చేశారు.  

అశోక్‌నగర్‌కు క్యూ.. 
ఇదే మంచి అవకాశమని ఇటు అభ్యర్థులు, అటు కోచింగ్‌ సంస్థల నిర్వాహకులూ భావించి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అభ్యర్థులు భారీగా అశోక్‌నగర్‌కు రావడమే కాకుండా.. కోచింగ్‌ సంస్థలు కూడా ఈ బూమ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకే కాకుండా కోచింగ్‌ సంస్థల మధ్య కూడా భారీగా కాంపిటీషన్‌ పెరిగిందని చెప్పొచ్చు.

వరుస నోటిఫికేషన్లతో.. 
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తుండటంతో సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యే వారు కూడా రాష్ట్రస్థాయి పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. దీంతో నగరంలోని చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌ సివిల్స్‌ కోచింగ్‌తో పాటు టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించి కోచింగ్‌ ఇవ్వడం, టెస్ట్‌ సిరీస్‌లను రూపొందించడం వంటివి చేస్తున్నారు.  

వికేంద్రీకరణ జరుగుతోంది.. 
సివిల్స్‌ కోచింగ్‌ అంటే ఢిల్లీ వెళ్లాలనే భావన క్రమంగా తగ్గుతోంది. మెటీరియల్‌ కానీ, టెస్ట్‌ సిరీస్‌ కానీ ఢిల్లీలోనే దొరికేవి. కానీ ఇప్పుడు అక్కడి సంస్థలకు దీటుగా ఇక్కడ కూడా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. నైపుణ్యం గల టీచర్లు కూడా ఉన్నారు. అక్కడి ప్రతికూల పరిస్థితుల వల్ల చాలా మంది హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. సక్సెస్‌ శాతం కూడా ఢిల్లీకి సమానంగానే ఉంది. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు.  
– బాల లత, సివిల్స్‌ మెంటార్‌

అన్నీ ఇక్కడే అందుబాటులో.. 
టెస్ట్‌ సిరీస్‌ రాసేందుకు ఢిల్లీకే వెళ్లేవారు. కానీ క్వాలిటీతో టెస్ట్‌ సిరీస్‌లను ఇచ్చే సంస్థలు మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షనల్స్‌కు కూడా మంచి మెటీరియల్‌ లభ్యం కాకపోయేవి. కానీ ఇప్పుడు అన్ని రకాల సోర్స్‌ మనకు దొరుకుతున్నాయి. సబ్జెక్ట్‌ పరంగా ప్రత్యేక కోచింగ్‌ తీసుకునే వెసులుబాటు వచ్చింది.    
  – బొప్పని జగన్‌మోహన్, సివిల్స్‌ అభ్యర్థి  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement