అడ్మిషన్ కోసం ఓ కోచింగ్ సెంటర్ ముందు బారులు తీరిన నిరుద్యోగులు(ఫైల్)
శిక్షణార్థులను లూటీ చేస్తున్న కోచింగ్ సెంటర్లు
సర్కారీ కొలువుల కోసం లక్షల మంది ఎదురుచూపు
హైదరాబాద్‌కు చేరి కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు
సిలబస్ మార్పులు ఖరారు కాకున్నా పుస్తకాలతో కుస్తీ
నోటిఫికేషన్ల జారీపై ఇంకా లేని స్పష్టత
సిలబస్‌నే నిర్ణయించని సర్కారు.. నిరుద్యోగుల్లో ఆందోళన
శిక్షణ కేంద్రాలపై నియంత్రణ కరువు.. నిబంధనలు బేఖాతర్
ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. అప్పులపాలవుతున్న యువత
సాక్షి, హైదరాబాద్: సర్కారీ కొలువుల కోసం నిరుద్యోగులు పట్నం బాట పట్టారు. ఉద్యోగ ప్రకటనలు రాకముందే రాజధానికి చేరుకుని కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కొత్త రాష్ట్రంలో వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారన్న ప్రచారంతో కనీసం నాలుగైదు లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. మరెంతో మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నగరంలోని అశోక్‌నగర్, గాంధీనగర్, దోమల్‌గూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, మలక్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నిరుద్యోగులే.
అసలు ఉద్యోగమే లేని వారిని పక్కనబెడితే.. ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి కొందరు, ఉద్యోగాలనే వదిలేసి మరికొందరు, కింది స్థాయి ప్రభు త్వ ఉద్యోగాల్లోని వారు కూడా ఉన్నత ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా, పోటీ పరీక్షల సిలబస్ కూ డా ఖరారు చేయకపోయినా శిక్షణ కేంద్రాలకు నిరుద్యోగుల రాక కొనసాగుతూనే ఉంది. దీంతో రాజధానిలో ఏ మూలన చూసినా హాస్టళ్లు కిటకిటలాడుతున్నాయి.
ఉద్యోగాలు వదిలేసి.. అప్పులు చేస్తూ..
గ్రూపు-1, గ్రూపు-2 వంటి ఉన్నత స్థాయి పోస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను పక్కనబెట్టి మరీ అనేక మంది సిద్ధమవుతున్నారు. కోచింగ్ ఫీజులు, రూమ్ అద్దెలు, భోజనం, వసతి, పుస్తకాల కోసం ఏడాది కాలంలో ఒక్కొక్కరు సగటున రూ.84 వేలకుపైగా వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అప్పులు చేసి మరీ శిక్షణ పొందుతున్నారు.
సిలబస్ లేకుండా సన్నద్ధమయ్యేదెలా?
మరోవైపు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులను రాష్ర్ట ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, 1948 నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తదితర మార్పులు ఉంటాయని టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే పేర్కొంది. కాని పూర్తిస్థాయి సిలబస్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాక రాత పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు మించి సమయం ఉండదు. అలాంటపుడు సిలబస్ ఏంటో తెలియకుండా పరీక్షకు తామెలా సన్నద్ధం కావాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి సిలబస్‌ను ముందుగా ప్రకటించకున్నా శిక్షణ తీసుకోకుండా వారు ఉండలేకపోతున్నారు.
ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లు
కోచింగ్ కేంద్రాల్లో కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాత షాపింగ్ మాల్స్, ఫంక్షన్‌హాళ్లు, కాలేజీలు, స్కూళ్ల ఆడిటోరియాల్లోనూ శిక్షణ కేంద్రాల పేరుతో బహిరంగ సభలనుతలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బ్యాచ్‌లో 700 నుంచి వెయ్యి మందికి శిక్షణ ఇస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బదులు తెలంగాణకు సంబంధించిన అంశాలు చదువుకుంటే సరిపోతుందని చెబుతూ శిక్షణ కొనసాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 ప్రకారం ఈ కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఇందుకు సంబంధించిన 1997 నాటి జీవో 200ను పాలకులు పట్టించుకోవడం లేదు. జీవోలో మార్గదర్శకాలు స్పష్టంగా లేవని పక్కన పడేశారు.
రాజధానిలో కోచింగ్ కేంద్రాలు
అశోక్‌నగర్ పరిసరాల్లో: 80కి పైనే
దోమల్‌గూడ పరిసరాల్లో: 20కి పైనే
చిక్కడపల్లి పరిసరాల్లో: 25కు పైనే
దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ పరిసరాల్లో: 250కి పైనే
ఏడాదిగా శిక్షణ పొందుతున్న వారు: లక్ష మందిపైగా
శిక్షణ పూర్తయి సిద్ధమవుతున్న వారు: 2లక్షలకు పైనే
మూడు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారు: మరో లక్షకుపైగా.
గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా..
గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా సిద్ధమవుతున్నాను. ఇప్పు డు పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులంటున్నారు. మరి త్వరగా సిలబస్‌ను ప్రకటిస్తే సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా? నోటిఫికేషన్‌లోనే సిలబస్‌ను ప్రకటిస్తే కష్టం. ప్రిపేర్ అయ్యేందుకు సమయం par సరిపోదు.
- గుమ్మడి అనురాధ, ఇల్లెందు
ప్రైవేటు ఉద్యోగం వదులుకున్నా..
గ్రూపు-1 రాసి డీఎస్పీ కావాలన్నది నా లక్ష్యం. 2013లో ఎంటెక్ పూర్తయింది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాను. తెలంగాణ రాష్ట్రం రావడంతో నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో గతేడాది ఉద్యోగం మానేసి కోచింగ్ తీసుకుంటున్నాను.
- బి. తిరుపతి, మహబూబ్‌నగర్
ఇప్పటికే రెండున్నర లక్షల అప్పు
గ్రూప్-2 కోచింగ్ కోసం వరంగల్ నుంచి వచ్చాను. అశోక్‌నగర్‌లో రూం తీసుకొని చదువుతున్నా. గ్రూపు-2 అధికారి కావాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు అప్పు రెండున్నర లక్షలైంది.
- ఎ. సురేష్, గ్రూప్-2 అభ్యర్థి