minimum facilities
-
చార్మినార్‌లో కనీస సౌకర్యాలు కరువు
హైదరాబాద్: చార్మినార్ చూసేందుకు వచ్చన సందర్శకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో పర్యాటకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి తాగునీటితో పాటు బ్యాగులు ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు క్లాక్‌రూంలు అందుబాటులో లేవు. భద్రతాచర్యల దృష్ట్యా చార్మినార్‌కట్టడంలోని బ్యాగ్‌లతో పాటు ఇతర వస్తువులను అనుమతించరు. దీంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ► రోజూ సందర్శకుల ద్వారా వస్తున్న ఆదాయం రోజురోజుకు పెరుగుతున్నా.. సందర్శకులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లభించడం లేదనే విమర్శలున్నాయి. ► వీకెండ్లలో పర్యాటకుల సంఖ్య రోజుకు 5 వేల నుంచి 6 వేలకు పైగా ఉంటుండటంతో వారి ద్వారా ఏఎస్ఐకు దాదాపు రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. రోజుకు లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని ప్రశ్నిస్తున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ... దేశ విదేశాల నుంచి చార్మినార్ కట్టడాన్ని సందర్శించే పర్యాటకుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపట్టడానికి పురాతత్వశాఖ (ఏఎస్ఐ– ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు ఆసక్తి చూపడం లేదని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధ సౌకర్యాల ఏర్పాటులో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినార్ల కెమికల్ ట్రీట్మెంట్ పనులు.. మినార్లకు కేవలం కెమికల్ ట్రీట్మెంట్ పనులు మాత్రమే చేపడుతున్నారని సందర్శకులకు అవసరమైన సౌకర్యాల పట్ల ఏమాత్రం దృష్టి సారించడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారి్మనార్ కట్టడంలో సందర్శకులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. కట్టడంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని పలువురు వాపోతున్నారు. రిమోట్ ప్రెసెంస్ కియోస్కీని ఏర్పాటు చేయాలి.. చారి్మనార్ కట్టడంలో గతంలో ఏర్పాటు చేసిన రిమోట్ ప్రెసెంస్ కియోస్కీ ప్రస్తుతం కనుమరుగైంది. మక్కా మసీదు, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు, యునాని, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్ తదితర పురాత న కట్టడాలను దగ్గరగా కనులారా తిలకించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2002 జూన్ 8న చార్మినార్ కట్టడంలోని ఒక చోట చార్మినార్ రిమోట్ ప్రెసెంస్ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. రూ.28 లక్షల వ్యయంతో.. దాదాపు రూ. 28 లక్షల రూపాయల వ్యయంతో పురాతన కట్టడాలను దూరంగా ఉన్నవాటిని దగ్గరగా చూసేందుకు చార్మినార్ కట్టడంలో రిమోట్ ప్రెసెంస్ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. దీనికోసం చారి్మనార్ పైభాగంలో నాలుగు కెమెరాలను అమర్చారు. కొన్నేళ్ల పాటు రెండు కెమెరాలు పనిచేయకుండా పోయాయి. మిగిలిన రెండు కెమెరాల ద్వారా సందర్శకులు చార్మినార్, మక్కామసీద్, ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లను తిలకిస్తున్నారు. ప్రస్తుతం అవి కూడా పనిచేయడం లేదని సమాచారం. టచ్ స్క్రీన్ ఆనవాళ్లు కూడా చారి్మనార్ కట్టడంలో కనిపించకుండా పోయాయి. పనిచేయని రిమోట్ ప్రెసెంస్ కియోస్కీ టచ్ర్‌స్కీన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. -
కోచింగ్ సెంటర్ల నిలువు దోపిడీ
ఒకే గదిలో వందల మంది. తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. కనీసం ఫ్యాన్ ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉడికిపోవాల్సిందే. మరుగుదొడ్డి బాధలు అన్నీఇన్నీ కావు. ఫీజులు మాత్రం రూ.వేలల్లో బాదేస్తారు. జిల్లాలోని కోచింగ్ సెంటర్ల తీరిది. ఉద్యోగంపై ఆశతో వందలాది మంది అక్కడే ‘శిక్ష’ణ పొందుతున్నారు. నెలరోజులు ఓర్చుకుంటే భవిష్యత్ బాగుంటుందని బాధలన్నీ భరిస్తున్నారు. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. – అనంతపురం ఎడ్యుకేషన్ ► నగరంలోని ఆర్ఎఫ్ రోడ్డులో నిర్వహిస్తున్న సాయిగంగ కోచింగ్ సెంటర్. ఓ ప్రయివేట్ ఆసుపత్రిపైన నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్లో అభ్యర్థుల అవస్థలు చెప్పుకుంటే తీరేవికావు. ► రఘువీరా టవర్స్‌లో నిర్వహిస్తున్న ప్రగతి కోచింగ్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా అభ్యర్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ► గుల్జార్‌పేటలోని ఓ రేకులషెడ్‌లో నిర్వహిస్తున్న శ్రీధర్ కోచింగ్ సెంటర్లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ వందలాది మంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ షెడ్లో మగ్గిపోతున్నారు. ► ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులు అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం గమనార్హం. సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పలు నోటిఫికేషన్లు...కోచింగ్ సెంటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. దీంతో ఏ కోచింగ్ సెంటర్లో చూసినా అభ్యర్థులతో కిటకిటలాడుతున్నారు. ఇదే అదునుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 8,545 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5) పోస్టులు 571, ఏఎన్ఎం/మల్టీపర్సస్ పోస్టులు 1,041, హెల్త్ అసిస్టెంట్ వీఆర్ఓ (గ్రేడ్–2) 384, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు 19, పశుసంరక్షణ అసిస్టెంట్ పోస్టులు 805, ఉద్యానశాఖలో అసిస్టెంట్లు 483, వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ పోస్టులు 282, మహిళా పోలీస్ పోస్టులు 1,217, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 159, డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ(సెక్రటరీ గ్రేడ్–6) పోస్టులు 896, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 896, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పోస్టులు 896, విలేజ్ సర్వేయర్ పోస్టులు 896 భర్తీ చేయనున్నారు. కిక్కిరిసిన కోచింగ్ సెంటర్లు : ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం తెచ్చుకోవాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. నెలరోజులు మాత్రమే గడువు ఉండటంతో శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇదే అదనుగా జాబ్ గ్యారెంటీ పేరుతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆర్భా ట ప్రచారాలు చేస్తూ నిరుద్యోగులకు వల వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేశ శిక్షణ ఇప్పిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. నెల రోజుల శిక్షణకు రూ.8 వేల దాకా ఫీజు ఫిక్స్ చేశారు. హాస్టల్ వసతి కావాలంటే మరో రూ.3,500 అదనంగా వసూలు చేస్తున్నారు. అధికారుల నియంత్రణ కరువు : ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై అధికారులకు నియంత్రణ లేదు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్లను ఏ అధికారీ పర్యవేక్షించరు. ఇవి ఎవరి పరిధిలోకి వస్తాయనే విషయంపై అధికారులకే స్పష్టత లేదు. ఇదే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కలిసి వస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడం, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నోరు మెదపకపోవడంతో ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. పైగా కనీస సౌకర్యాలు కల్పించడం లేగు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుని, కనీస సదుపాయాలు కల్పించేలా చూడాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. చుక్కల చిక్కులు తీరుస్తాం అనంతపురం అర్బన్: చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన ఫైళ్లన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ అవినీతి పాల్పడిన సిబ్బందిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ‘‘ రైతులకు చుక్కలు’’ శీర్షిక ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. చుక్కల భూములకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వారం రోజుల్లో ఫైళ్లన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ రైతులను వేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైళ్ల పరిష్కారంలో ఎవరైనా సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే రైతులు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఆపద వస్తే అంతే సంగతి
సాక్షి, మల్కాపురం (విశాఖపట్నం): రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. పొట్టకూటి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే సుమారు ఐదు కిలీమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి వచ్చిన వారు అనేక బాధలు పడుతున్నారు. 48వ వార్డు అచ్చినాయుడులోవ కొండ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 4,600 ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ విభాగం పర్యవేక్షణలో ఏడు నెలల నుంచి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సుమారు ఐదు వందల మంది కార్మికులు సివిల్ పనులు, రాడ్‌బెండింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం కాంట్రాక్టర్ (టాటా)బీహార్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చారు. అయితే నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కార్మికులకు కనీస వసతులు లేవు. వీరికి మరుగుదొడ్లు, సేద తీరేందుకు షెల్టర్‌గానీ లేవు. ముఖ్యంగా వైద్య సదుపాయం పెద్ద సమస్యగా మారింది. సివిల్ పనులు చేస్తున్న కార్మికులకు ఏదైన ప్రమాదం జరిగిన, మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయినా ప్రాథమిక వైద్యం అందించేందుకు కూడా సదుపాయం లేదు. గత నెల తివారీ అనే వ్యక్తి రాడ్‌బెండిగ్ పనులు చేస్తుండగా ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తొటి కార్మికులు సైట్ ఇన్చార్జ్కు సమాచారం అందించారు. ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనం లేకపోవడంతో తోటి కార్మికులే చేతుల మీద ఐదు కిలో మీటర్ల కొండ దిగువకు తీసుకువచ్చి వైద్యం చెయ్యించారు. కొండ ప్రాంతంలో పనిచేస్తుండడంతో విషసర్పాలు కాటు వేసినా లేక మరేం ప్రమాదం జరిగినా తక్షణ వైద్యం సాయం ఇక్కడ అందుబాటులో లేదు. ఒక్కోసారి క్షణం ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. బతుకు దెరువు కోసం ఇక్కడకు వస్తే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యపై ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.ఆర్.కే.రాజును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. అత్యవసర పరిస్థితి వస్తే అంతే.. తమ కార్మికులకు ప్రాణాపాయం వస్తే పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఎవరూ లేరు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఐదు కిలీమీటర్లు రావాలి. సమీపంలో వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. – రామ్‌జీ, బీహార్ కనీస వసతులు కల్పించాలి బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చాం. ఇక్కడ పరిస్థితి చూస్తే భయం కలుగుతోంది. కొండ ప్రాంతంలో తమపై ఏదైనా జంతువులు గానీ, విషసర్పాలు గానీ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటీ. వైద్య సదుపాయాలు ఇక్కడ కల్పించాలి. - ముఖేష్ తమర్, జార్ఖండ్ -
ఇల్లు లేని పేదలు ఎందరు?
సాక్షి, హైదరాబాద్: నీడ లేని పేదల లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడు లేని బడుగులను జూన్ 10 కల్లా గుర్తించాలని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించింది. మున్సిపాలిటీల్లో రహదారులు, చెట్లే అడ్డాగా జీవనం సాగిస్తున్న పేదల డేటా సేకరించాలని.. వారందరికీ కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సేకరించే వివరాల ఆధారంగా ఇల్లు లేని పేదలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పింఛన్, బ్యాంక్ ఖాతాలు తెరిచేలా చొరవ చూపాలన్నారు. నీడ లేని వారందరినీ షెల్టర్లకు తరలించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కమిషనర్లు విధిగా షెల్టర్లను సందర్శించాలని, వారికి అందుతున్న సేవలను తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ స్థానిక సంస్థలుండగా.. ఇందులో 53 మున్సిపాలిటీల్లోనే షెల్టర్లు ఉన్నాయని, 11,389 మంది ఇక్కడ నివసిస్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో 5,807 మందికి ఆధార్ కార్డులు, 787 మందికి ఓటరు గుర్తింపు కార్డులు, 1,555 మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. 3,497 మందికి రేషన్ కార్డులు కూడా ఉన్నాయని, 201 మందికి బీమా సౌకర్యం కూడా కల్పించినట్లు కమిషనర్లు వివరించారు. 694 మందిని అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నామని, 5,728 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,050 ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో 129 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఆస్పత్రులకు సిఫారసు చేసినట్లు వివరించారు. 1,541 మందికి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్లు తెలిపారు. -
‘అరణ్య’ రోదన..
పాల్వంచరూరల్: చెట్టు.. పుట్ట... పశువులు.. అడవి సంపదే సర్వస్వంగా బతికే ఆదివాసీలు వారంతా. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆ ఆదివాసీ గూడెంలో మాత్రం కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. నేటికీ చీకటిలోనే బతుకీడుస్తున్న గిరిజనులు.. నీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని చెపుతున్న పాలకులకు ఇలాంటి ఆదివాసీ గూడేలు ఎందుకు కనిపించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆదివాసీ గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కూడా వీరి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, చిన్నచూపుతో తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆదివాసీ గూడేల్లో ఉంటున్న వీరి జీవనశైలిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, అమాయకత్వంతో అరణ్యంలో కాపురం చేస్తూ అభివృద్ధి పథకాలకు నోచుకోక దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇంతటి దీనావస్థలో ఉన్న గిరిజన గూడెం చిరుతానిపాడు. జిల్లా కేంద్రం కొత్తగూడేనికి 34 కిలో మీటర్ల దూరంలో గల ఈ గూడెం.. పాల్వంచ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్నో ఏళ్ల క్రితం వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ గుట్టల మధ్య నివసిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు ఏ ఒక్కటీ వీరికి అందడం లేదు. ఇక్కడ 33 గిరిజన కుటుంబాల్లో 120 మంది నివాసం ఉంటున్నారు. తునికాకు, అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఒక్కో గిరిజనుడికి 20 నుంచి 30 వరకు తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి కానీ రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలేదు. విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యాలు శూన్యం.. మండలంలోని బంజర పంచాయతీ నుంచి 3–4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరుతానిపాడు గ్రామంలో నివాసం ఉంటున్న గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కనీస రహదారి సౌకర్యం కూడా లేదు. వర్షాకాలంలో అయితే చుట్టూ తిరిగి 5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తే తప్ప పంచాయతీ కేంద్రానికి చేరుకోలేరు. ఇక విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నారు. తాగునీరు లేకపోవడంతో వర్షాకాలం, వేసవికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యసేవలు అందని ద్రాక్షే... చిరుతానిపాడులోని గిరిజన ప్రజలకు వైద్య సౌకర్యం కూడా అందుబాటులో లేదు. దీంతో గ్రామంలో ఎవరికైనా జబ్బుచేస్తే మంచంతో కావడి కట్టుకుని నలుగురు వ్యక్తులు కలిసి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్వనూరు అరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి. కనీసం టీకాలు వేయడానికి కూడా గ్రామంలోకి వైద్యసిబ్బంది రారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక నాటు వైద్యంపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో చదువుకుంటున్నది ఇద్దరే.. ఈ గిరిజన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాల లేదు. గ్రామంలోని 120 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే చదువుకుంటున్నారు. వారిలో అక్కా చెల్లెళ్లు లక్ష్మి భద్రాచలం గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్, కోసమ్మ ఉల్వనూరులోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారు కూడా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక మిగితా పిల్లలెవరూ చదువుపై అసక్తి చూపడం లేదు. తాగునీరు లేక పాట్లు.. చిరుతానిపాడు గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదు. దీంతో గిరిజనులు వర్షకాలం, వేసవిలోకూడా గ్రామ సమీపంలో ఉన్న కుంటలు, వాగులు, వంకలో ప్రవహించే నీటినే తాగుతున్నారు. కలుషితంగా ఉండే ఆ నీటిని తాగడంతో అనారోగ్యాల పాలవుతున్నారు. కనీసం ఒక బోరు వేయడానికి కూడా అటవీశాఖ అధికారులు అంగీకరించడం లేదు. నిత్యావసర సరుకులకు 4 కిలోమీటర్లు... చిరుతానిపాడు గ్రామంలోని గిరిజనులకు అవసరమైన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉల్వనూరు గ్రామానికి నడిచి వెళ్లాల్సిందే. వారం, పది రోజులకు ఒకసారి వెళ్లి తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను విక్రయించి నిత్యావసర సరుకులను తెచ్చుకుంటారు. గ్రామంలోని గిరిజనులకు ఒక్కరికి కూడా బ్యాంక్ ఎకౌంట్ లేదు. జీసీసీ సరుకులు కూడా అందని దుస్థితి నెలకొంది. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు.. అటవీ ప్రాంతంలో అభివృద్దికి ఆమడదూరంలో జీవనం సాగిస్తున్న వలస ఆదివాసీ గిరిజన సమస్యలను ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు మాత్రం నాయకులు తమపై కపట ప్రేమ చూపుతారని, ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రభుత్వ పథకాలంటే తెలియదు మా గ్రామంలో చాలావరకు ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. మేము కూడా జనాభా లెక్కల్లో ఉన్నాం. కానీ ప్రభుత్వం అందించే ఏ ఒక్క పథకం కూడా మాకు రావడం లేదు. అసలు మా గ్రామంలో ఇంతవరకు ఎవరికీ బ్యాంకు ఖాతాలు లేవు. – జోగారాం, చిరుతానిపాడు ఐటీడీఏ కూడా పట్టించుకోవడం లేదు ఏళ్ల తరబడి ఇదే గూడెంలో నివాసం ఉంటున్నాం. అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. అడవిలో చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులను అమ్ముకుని వచ్చిన డబ్బుతో అవసరమైన సరుకులు కొనుక్కుంటాం. ఆదివాసీ గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన భద్రాచలం ఐటీడీఏ కూడా మా గోడు పట్టించుకోవడం లేదు. – లక్ష్మి, చిరుతానిపాడు మాపై చిన్నచూపు ఎందుకు..? ఆదివాసీ గ్రామంలో ఉంటున్న మాపై అధికారులు, నాయకులు చిన్నచూపు చూస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలేదు. కనీసం రోడ్డు కూడా లేదంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుస్తుంది. మంచినీళ్లు లేక ఎండిన చెరువులో చెలిమలు తీసుకుని నీళ్లు తాగుతున్నాం. – కోవాసి మంగమ్మ, చిరుతానిపాడు -
ఆపదలో అగ్నిమాపక కేంద్రాలు
అగ్నిమాపక కేంద్రాలకు ఆపద వచ్చింది. ప్రమా దం జరిగినప్పుడు ఆదుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ఫైర్స్టేషన్లకు సరైన భవనాలు లేక రేకుల షెడ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. వాహనం కండీషన్ ఉండదు. డీజిల్‌కు బడ్జెట్ లేదు. కనీసం ట్యాంకర్లో నింపేందుకు నీరు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం వస్తే సిబ్బంది వెళ్లేలోపే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది. చివరకు బూడిదే మిగులుతోంది. నర్సంపేట: ఆపదలో ఆదుకునే అగ్నిమాపక కేంద్రాలకు సౌకర్యాలు లేక సిబ్బంది ఇబ్బందుల గురవుతున్నారు. చాలా ఏళ్ల నాటి ఫైర్ స్టేషన్లకు సరైన భవనాలు లేక రేకుల షెడ్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. వాహనం కండీషన్లో ఉండదు. డీజిల్‌కు బడ్జెట్ కేటాయింపు ఉండదు. ట్యాంకర్లో నింపేందుకు నీరు దొరకదు. ఇలాంటి తరుణంలో ఏదైనా ప్రమాదం జరిగి...ఫోన్ చేస్తే... సిబ్బంది గంట కొట్టుకుంటూ వచ్చే వరకు పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. అగ్నికి ఆస్తి ఆహుతి అవుతోంది. బాధితులకు బూడిదే మిగులుతోంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి. గతేడాది ఆధునిక పరికరాలు ఇచ్చారే తప్పా.. అందులో పనిచేసే సిబ్బంది సమస్యలను వదిలేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఈ ఏడాది వర్ధన్నపేటలో ఫైర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి ఆధునాతన ఫైర్ ఇంజిన్ అందించడం మినహా ఏళ్ల తరబడి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. రానున్నది అసలే ఎండాకాలం.. ఈ నెల 23న పరకాల నియోజకవర్గంలో ఒకేరోజు ఒగ్లాపూర్, శనిగరం గ్రామాల్లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు రానున్న రోజుల్లో జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణ తీసుకోవాల్సిన అవపరం ఉంది. వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతుంటుంది. జిల్లాలో ప్రతి ఏటా వేసవి కాలంలో జరిగిన అగ్ని ప్రమాదాల నివారణ కోసం కొత్తగా ఫైర్స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నా.. ఒక్క వర్దన్నపేటలోనే ఏర్పాటు చేసి మిగతా చోట్ల విస్మరించారు. దీంతో పాత అగ్నిమాపక కేంద్రాలతోనే సేవలు అందిస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు సకాలంలో అగ్నిమాపక శకటం చేరుకున్నప్పుడే ఆస్తులు కాపాడుకోగలుగుతున్నారు. దూర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే అంతేసంగతులు. బాధితుల ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం.. అగ్ని ప్రమాదాలు చిన్న చిన్న తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతుంటాయి.అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కి సమాచారం అందించాలి. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలో సంభవిస్తాయి.విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీల కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో గడ్డివాములు, పూరిళ్లు, ఎండిన పొలాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. జిల్లాలో మూడు కేంద్రాలు.. జిల్లాలో రెండు నెలల క్రితం వరకు రెండు అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉండగా వర్ధన్నపేటలో తాజాగా ఏర్పాటు చేశారు. నర్సంపేట అగ్నిమాపక కేంద్రంలోని ఫైరింజన్ మహబూబాబాద్ జిల్లాల్లోని గ్రామాలకు కూడా వెళ్లాల్సి ఉండడంతో దూర ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే సమాచారం అందించిన తర్వాత బయలుదేరినప్పటికి ఆలస్యమై ఆస్తి నష్టం ఎక్కువగా కలిగేది. కొన్ని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. కనీసం మూడు మండలాల పరిధిలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంటేనే అవి సకాలంలో సంఘటన స్థలాలకు చేరుకొని సిబ్బంది మంటలు అదుపులో చేసే అవకాశం ఉంటుంది. అగ్నిమాపక శాఖకు ఇటీవల బుల్లెట్లు మంజూరు చేసింది. కేంద్రాలు, వాహనాల నిర్వహణకు బడ్జెట్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అగ్నిమాపక ట్యాంకర్లకు నీటి సరఫరా కోసం బోర్లు అవసరం ఉంది. డీజిల్ కేటాయింపులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ప్రతిబింబంగా మారాయి. పట్టణాల్లో అగ్ని ప్రమాదాల తరుణంలో సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా బహుళ అంతస్తులు, సినిమా థియేటర్లు, వాణిజ్య భవంతులు, ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడా కూడా అగ్ని నిరోధక పరికరాలు లేవు. పైగా అంగుళం కూడా వదలకుండా భవనాలు నిర్మిస్తున్నారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగితే ఆస్తి నష్టం తీవ్రంగా ఉంటోంది. ఇబ్బందులను అధికమించి సేవలు... అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో సంఘటన స్థలానికి వెళ్లే సమయంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐనప్పటికి సాధ్యమైనంత వరకు నష్ట నివారణ చేసేందుకు ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యుత్ అధికారులకు కూడా ఇదే విషయంపై సహకరించాలని కోరాం. ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం అందించాలి. – పోకల రామకృష్ణ, అగ్నిమాపక అధికారి, నర్సంపేట -
గత వైభవం ఏదీ?
చిన్నశంకరంపేట(మెదక్): సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో గతంలో ఎంతో చరిత్ర కలిగిన మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నేడు వెలవెలబోతుంది. ఈ స్టేషన్ గత వైభవం కోసం చేస్తున్న ప్రయత్నాలు నేరవేరకపోవడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో సమాన దూరం ఉండడంతో పాటు ఇక్కడ రైల్వే రన్నింగ్ రూంతో పాటు రైళ్లకు అవసరమైన బొగ్గు, నీరు ఇక్కడే నింపుకునేవారు. దీంతో ఇక్కడ ప్రతి రైలు ఆగడంతో ప్రయాణికులతో పాటు ఉద్యోగులతో కిటకిటలాడేది. రైల్వే ఉద్యోగులకు క్వార్టర్స్‌తో పాటు రన్నింగ్ రూం ద్వారా రైల్వే ఉద్యోగులకు విశ్రాంతి వసతి సౌకర్యం ఉండేది. అలాంటి స్టేషన్లో నేడు అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకుండనే దూసుకుపోతున్నాయి. దీంతో నగరాలకు ఉద్యోగాలకు వెళ్లేవారితో పాటు పుణ్యక్షేత్రాలకు, దూర ప్రాంతాలకు వెళ్లేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అజాంత ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రబాద్–నిజామాబాద్ మార్గలో బోల్లారం, మిర్జాపల్లి, కామారెడ్డి మాత్రమే హల్టీంగ్ ఉండేవి. ప్రస్తుతం ఈ రైళ్లు మిర్జాపల్లిలో ఆగడం లేదు. మరో వైపు కొత్తగా వచ్చిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరికొన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు మిర్జాపల్లి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పటికీ ఇక్కడ హల్టీంగ్ లేకపోవడంతో మిర్జాపల్లి గ్రామాస్తులను నిరాశపరుస్తున్నాయి. నెరవేరని హామీ.. మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ ఫాం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రెండు రైళ్లు క్రాసింగ్ ఉన్న సమయంలో ఉన్న ఒక్క ప్లాట్ ఫాంపై ట్రైన్ ఉండగా, మరో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎత్తైన ప్లాట్ ఫాం నుంచి పట్టాలపైకి దిగడం నరకాన్ని తలపిస్తోంది. అలాగే ట్రైన్ కోసం పరుగులు పెట్టే సమయంలో అదుపుతప్పి ప్రమాదాలకు గురైతున్న సంఘటనలున్నాయి. మరో వైపు చిన్నారులు, వృద్ధులు లాగేజీతో ప్లాట్ ఫాం దిగడం ఎక్కడం ఇబ్బందిగా మారింది. గత జనవరిలో అప్పటి జీఎం వినోద్ కూమార్ సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంతో ప్రయాణిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో మిర్జాపల్లిలో అజాంత ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హల్టీంగ్తో పాటు అదనపు ప్లాట్ ఫాం, పుట్వేర్ బ్రిడ్జి మంజూరు కోసం ప్రతిపాదనలు అందించారు. అదనపు ప్లాట్ ఫాం, పుట్వేర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి వాటి పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే అధికారులు తమ సమస్యలు తీర్చి మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు పూర్వ వైభవం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పట్టాలు దాటలేకపోతున్నాం.. రైలు కోసం ప్లాట్ ఫాం ఎక్కడం దిగడానికి ఇబ్బందులు పడుతున్నాం. రెండు రైళ్లు క్రాసింగ్ ఉన్నప్పుడు మొదటి ఫ్లాట్ ఫాంపై ఉన్న రైలును దాటుకుని పట్టాలపైకి వెళ్లడం నరకాన్ని తలపిస్తోంది. ఆడవాళ్లతో పాటు వృద్ధులు, చిన్నపిల్లలు చాల బాధపడుతున్నారు. వెంటనే రెండో ఫ్లాట్ ఫాం నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. –పోచమ్మ, మిర్జాపల్లి. బాల్యంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లేవాళ్లం... నిజామాబాద్–సికింద్రాబాద్ వెళ్లాలంటే అజాంత, జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లేవాళ్లం. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్న ఎంతో సౌకర్యంవంతంగా ఉండేది. మీటర్ గేజ్ టైమ్‌లో మిర్జాపల్లిలో ఆగని ట్రైన్ లేకుండే. ఆ టైంలో ఎక్కడెక్కోడోల్లో వచ్చి మిర్జాపల్లి నుంచి రైలు ప్రయాణం చేసేవాళ్లు. ప్రస్తుతం అజాంత, జైపూర్ రైలళ్లు ఆగకపోవడంతో ఎంతో ఇబ్బదులు పడుతున్నాం. అధికారులు మిర్జాపల్లిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపేందుకు చర్యలు చేపాట్టాలి. –బ్రహ్మయ్య, చిన్నశంకరంపేట -
సమీక్ష.. ఇదేమి శిక్ష?
ఏటూరునాగారం: సమావేశ మందిరంలో కనీస సౌకర్యాలు లేక అంగన్వాడీ టీచర్లు నానా అవస్థలు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంగన్వాడీ కేంద్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు సంగూలాల్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి మొత్తం ఆరు మండలాల పరిధిలోని 442 కేంద్రాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు హాజరయ్యారు. వారికి కనీసం కూర్చోవడానికి సదుపాయం కల్పించలేదు. కుర్చీలు లేకపోవడంతో కొందరు సమావేశ మందిరంలోని టేబుళ్ల మధ్యలో కూర్చోగా.. చాలా మంది వరండాలోనే సర్దుకున్నారు. సుమారు రెండు గంటల పాటు నరకం అనుభవించాల్సి వచ్చిందని పలువురు అంగన్వాడీ టీచర్లు వాపోయారు. -
విప్ ఊరు.. ఉప్పు నీరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు : అరకు నియోజకవర్గం.. పెదబయలు మండలం.. గిన్నెలకోట పంచాయతీ నడిమివాడ గ్రామం... తొమ్మిది కుటుంబాలు, 55 మంది జనాభా ఉన్న మన్యంలోని అతి చిన్న పల్లెల్లో ఒకటి. ఒకప్పుడు 35కుటుంబాల వారు నివాసమున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న గుండాలగరువుకు వెళ్ళిపోయారు. కానీ ఆ 9 కుటుంబాల గిరిజనులు మాత్రం అక్కడే దశాబ్దాలుగా నివాసముంటున్నారు. ఇప్పుడు ఆ చిన్న పల్లె గురించి ప్రస్తావన ఎందుకుంటే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సొంతూరు అది. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆ తర్వాత కిడారి కుటుంబం జి.మాడుగుల మండలం కిల్లంకోట గ్రామానికి వలస వెళ్ళిపోయింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో అరకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ్యుడైన తొలి నాళ్ళలోనే ఆయన తన సొంతూరు నడిమివాడకు వచ్చి పల్లె రూపురేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఇక్కడే నివాసముంటున్న గిరిజనులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. అప్పుడు ఆయన మాటలకేమో గానీ తమ పల్లె బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు ఆ గ్రామస్తులు మురిసిపోయారు. సంబరం చేసుకున్నారు. అంతే... అక్కడితో కిడారి ఆ ఊరి సంగతే మరచిపోయారు. నాలుగేళ్ళుగా ఊరివైపు కన్నెత్తి చూడలేదు.. 2016లో కిడారి తన నయవంచన రూపాన్ని బయటపెట్టారు. రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. కేవలం అభివృద్ధి కోసమే ఫిరాయిస్తున్నట్టు చెప్పారు. ఆ సందర్భంలో మళ్ళీ ఊరి ప్రస్తావన తెచ్చారు. నడిమివాడను వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. కానీ షరా మామూలుగానే పట్టించుకోలేదు. ఇక ఆర్నెల్ల కిందట ప్రభుత్వ విప్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ ఆయనకు క్యాబినెట్ హోదాతో విప్ పదవిని ఇచ్చింది. కనీసం ఆ పదవిలోకి వచ్చిన తర్వాతైనా ఆ ఊరి గురించి పట్టించుకుంటారని భావించిన గ్రామస్తుల ఆశలు అడియాసలే అయ్యాయి. ఇంకా దారుణమేమిటంటే ఈ నాలుగేళ్ళలో మళ్ళీ ఆ ఊరివైపు ఆయన కన్నెత్తి చూడలేదు. ఎప్పుడైనా ఆయన అరకు అరుదెంచిన సందర్భాల్లో నడిమివాడ గ్రామస్తులు కలిసి మొరపెట్టుకున్నా కనీసంగా కూడా పట్టించుకోలేదు. గ్రామం పరిస్థితి ఎలా ఉందంటే.... ఒక్కోసారి వంటకు వర్షపు నీరే గతి. నడిమివాడలో గ్రామస్తులు తాగేందుకు మంచినీటి సరఫరా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరకు పుట్టపర్తి సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి గ్రావిటీ పథకం ద్వారా నీరు వచ్చేది. కానీ ఆ పైపు లైన్లలో అవాంతరాలు రావడంతో ప్రస్తుతం ఆ నీరు కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో గ్రామస్తులు ఊట గెడ్డ( వాగు) నీటిపైనే ఆధారపడుతున్నారు. ఆ నీరు ఉప్పగా ఉన్నా... ఎలా ఉన్నా... అదే వారికి దిక్కు. ఇక వర్షాకాలాల్లో ఊటగెడ్డకు బురద నీరు చేరితే... చివరికి ఇంటి పైకప్పు నుంచి పడిన వర్షం నీటితో వండుకుని తిన్న రోజులే ఎక్కువని గ్రామస్తులు చెబుతున్నారంటే అక్కడి దయనీయ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నెలకు 20 రోజులు అంధకారమే గ్రామానికి పేరుకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉంది గానీ... నెలలో 20రోజులు కరెంటు రాదు. ఇక వర్షాకాలంలో నెలల తరబడి రాత్రిళ్ళు చీకట్లోనే మగ్గాలి. గతంలో కిరోసిన్ సక్రమ సరఫరా వల్ల ఆ బుడ్డీలన్నీ వెలిగించుకునే వాళ్ళమని, ఇప్పుడు కిరోసిన్ కోటాలో కోతతో చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమిదల్లో రిఫైండ్ అయిల్ వేసి దీపంలో వెలుగులో ఉండాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. అర్హులు ఉన్నా... మంజూరు కాని పెన్షన్లు గ్రామంలో వృద్ధాప్య పింఛను, వికలాంగ పింఛన్ కోసం ఐదుగురు అర్హులు గడుతూరి రామూర్తిపడాల్, గడుతూరి దేవుడమ్మ,మ తమర్భ జంగంరాజు, గడుతూరి హరినాధ్ పడాల్, తమర్భ చంద్రమ్మలు ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా... నేటికీ మంజూరు కాలేదు. గ్రామంలో మహిళలు శ్రీకోరబమ్మ ఎస్‌హెచ్‌జీ ఏర్పాటు చేసుకుని పదేళ్ల నుంచి పొదుపు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తరఫున సాయం మాత్రం అందడం లేదు. మొత్తం గ్రామంలో 9 కుటుంబాలు ఉంటే.. మూడు కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. ఊరికి రోడ్డే లేదు.. నడిమివాడ వెళ్ళేందుకు కనీసం రోడ్డు లేదు. గ్రామస్తులు కష్టపడి ఏర్పాటు చేసుకున్న కాలిబాట వర్షాకాలంలో పనికిరాదు. బొయితిల పంచాయతీ చామగెడ్డ జంక్షన్ నుంచి 5 కిలో మీటర్ల మేర మట్టి రోడ్డు ఉంది. వాస్తవానికి ఆ మట్టి రోడ్డు కూడ అధ్వాన్నమే. ఆ మట్టిరోడ్డు నుంచి కిలో మీటర్ దూరం కాలిబాటలోనే నడిమివాడకు వెళ్ళాలి. ఇక ఊరికి ఆనుకుని ఉన్న గెడ్డపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో గెడ్డలు పొంగిన సందర్భాల్లో చుట్టు పక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోతుంటాయి. కనీస వసతులు కల్పించండి చాలు.. గ్రామానికి కనీస సౌకర్యాలైన రోడ్డు, తాగునీరు, పక్కా గృహాలు, అర్హులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలి. ఇవన్నీ ఎమ్మెల్యే తలచుకుంటే వెంటనే అయిపోతాయి.. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. – కిడారి వినాయక కృష్ణమూర్తి, రైతు, నడిమివాడ గ్రామం -
ప్చ్.. రామప్ప!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ హోదా అందినట్లే అంది చేజారింది. నిర్మాణ చాతుర్యం, వైశిష్ట్యం పరంగా ప్రత్యేకత చాటుకుంటున్న రామప్ప దేవాలయం యునెస్కో జాబితాలోకి చేరినట్టే చేరి దారితప్పినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం లేదన్న లోటును రామప్ప తీరుస్తుందని ఆశించినా.. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించిన రామప్ప దరఖాస్తును కేంద్రం బుట్టదాఖలు చేసిందని, దాని స్థానంలో జైపూర్ ప్రతిపాదనను పంపిందని సమాచారం. గతంలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధు లతో కలిపిన ప్రతిపాదన, ఆ తర్వాత వేయిస్తంభాల గుడి ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడంతో ఈసారి పక్కాగా దరఖాస్తు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రామప్ప దేవాలయాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించింది. కానీ అది యునెస్కో తలుపు తట్టకుండానే తిరుగుటపాలో వచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ఢిల్లీ స్థాయిలో స్క్రూటినీ కమిటీనే తిరస్కరించినట్లు్ల సమాచారం. రెండు సార్లు తయారు చేసినా.. గత చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి కొంత పక్కాగానే ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామప్ప ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చారు. కానీ ఆలయ ప్రతిపాదన (డోషియర్) రూపకల్పనలో పక్కాగా వ్యవహరించకపోవడమే తిరస్కరణకు కారణమని తెలుస్తోంది. కేవలం రామప్ప ఆలయ నిర్మాణ కౌశలంపైనే దృష్టి సారించి వివరాలు సేకరించిన నిపుణులు.. ఆ కోణంలోనే దాన్ని ప్రతిపాదించారని, యునెస్కోకు పంపాల్సిన పద్ధతిలో ప్రతిపాదన లేదని ఢిల్లీ స్క్రూటినీ కమిటీ అభిప్రాయ పడినట్లు తెలిసింది. కట్టడానికి సంబంధించిన కొన్ని వివరాలూ తప్పుగా పేర్కొన్నట్లు కమిటీ గుర్తించిందని తెలుస్తోంది. కొన్ని శిల్పాలకు సంబంధించి కుడి వైపు వివరాలను ఎడమవైపు, ఎడమ వైపు వివరాలు కుడివైపు ఉన్నట్లు తప్పుగా నమోదు చేసిన విషయాన్నీ కమిటీ గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రానికి సమాచారం లేదు.. జైపూర్ ప్రతిపాదనను కేంద్రం వారం క్రితం యునెస్కోకు పంపి రామప్పను పెండింగులో పెట్టిందని ఢిల్లీ సమాచారం. కానీ దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందలేదు. యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపం చ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రాజస్తాన్ ఈ విషయంలో గట్టి లాబీ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో బాగా వెనుకబడిన తెలంగాణ, యునెస్కో గుర్తింపు పొందే విషయంలోనూ మంచి అవకాశం చేజార్చుకున్నట్లయింది. యునెస్కో ప్రతిపాదనలు రూపొందించటంలో అనుభవం ఉన్నవారి మార్గదర్శనంలో కొత్త ప్రతిపాదన రూపొందిస్తే భవిష్యత్‌లోనైనా రామప్పకు గుర్తింపు తథ్యమన్న విషయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాట్లు కూడా లేకుండా డోషియర్ రూపొందించాలని సూచిస్తున్నారు. కనీస వసతులూ లేవు..! ప్రపంచ వారసత్వ హోదా పొందే కట్టడం వద్ద పర్యాటకులకు కనీస వసతులు అవసరం. కానీ రామప్ప ఆలయానికి ఇప్పటికీ సరైన రహదారి లేదు. అక్కడ పర్యాటకులకు మంచి భోజనం లభించే వసతి లేదు. మంచి నీరు, టాయిలెట్లకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కనీస వసతులు కల్పించి దరఖాస్తు చేసి ఉండాల్సిందని, దాన్ని కూడా పట్టించుకోకపోవడాన్ని కమిటీ తప్పుబట్టిందని తెలుస్తోంది. వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయాన్ని రుద్రేశ్వరాలయంగా పిలుస్తారు. రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వరాలయంగా పేర్కొంటారు. కానీ యునెస్కో ప్రతిపాదనలో దాన్ని రుద్రేశ్వరాలయంగా పేర్కొన్నట్లు తెలిసింది. దీన్ని కూడా కమిటీ గుర్తించిందని చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టిందని సమాచారం. ఇదే కేటగిరీలో పోటీ పడిన రాజస్తాన్ రాజధాని నగరం జైపూర్ ప్రతిపాదనకు కమిటీ జై కొట్టిందని తెలుస్తోంది. -
చచ్చినా.. కష్టమే..!
సాక్షి కడప : గండికోట ముంపు గ్రామాల ప్రజలు.. ప్రాజెక్టు కోసం అన్నీ త్యాగం చేసినా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీస వసతులు కల్పించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ముంపు గ్రామమైన బొమ్మేపల్లె వాసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి కాస్త తిండి.. చనిపోతే కొంత స్థలం అవసరం. అయితే మొదటి దానికి ఇబ్బంది లేకున్నా.. రెండవ దానికి మాత్రం నానాయాతన పడుతున్నారు. గండికోట ముంపు గ్రామమైన బొమ్మేపల్లె వాసులకు ఆర్టీపీపీ పరిధిలోని కలమల వద్ద పునరావాసం కల్పించారు. అయితే అక్కడ శ్మశాన వాటికకు స్థలం కేటాయించక పోవడంతో చనిపోయిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎర్రన్న (85) రెండు రోజుల క్రితం చనిపోయారు. అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా అక్కడ నివసిస్తున్న బొమ్మేపల్లె వాసులకు శ్మశాన స్థలం లేదు. దీంతో అక్కడే విలపిస్తూ తరువాత ఆలోచన చేసిన ఆయన కుటుంబ సభ్యులు ఎట్టకేలకు మనువడి ఊరికి తీసుకెళ్లి అంత్య క్రియలు నిర్వహించారు. మనువడి గ్రామమైన అనంతపురం జిల్లా తిమ్మంపల్లి మండలం కల్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి బొమ్మేపల్లెకు సంబం« దించి ఎక్కడో ఒక చోట శ్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు కోరుతున్నారు. -
నిబంధనలకు నీళ్లు
– ప్రైవేటు విద్యాసంస్థల్లో కరువైన సదుపాయాలు – తరచూ ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థులు హిందూపురం టౌన్ : తాగునీటి సౌకర్యం ఉండదు.. ఆటస్థలం ఉండదు.. మరుగుదొడ్డి ఉండదు.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉండరు.. ఇలా ఏ సౌకర్యం లేకున్నా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి పాఠశాల, కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. పాఠశాల లేదా కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క నిబంధన పాటించకపోయినా విద్యాశాఖ వారు అనుమతి ఇస్తూ విద్యార్థుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని చెబుతున్నారు. కానీ కొంతమంది ప్రైవేటు, కార్పొరేటు శక్తులు విద్యాశాఖ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి అనుమతులు పొందుతున్నార నే ఆరోపణలు లేకపోలేదు. రూ.వేల ఫీజులు దండుకుంటూ తమ విద్యాసంస్థల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు విధిలేక చెల్లిస్తున్నారు. పట్టణంలో మూడు కార్పొరేటు పాఠశాలలు, ఒక కార్పొరేటు కళాశాల, సుమారు 10 ప్రైవేటు కళాశాలలు, 52 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 శాతం విద్యాసంస్థలకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి– చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కు.ని. కష్టాలు
కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం 90 మంది మహిళలు, పురుషులు శస్త్రచికిత్స కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉదయం ఆపరేషన్లు చేస్తామని చెప్పిన అధికారులు సాయంత్రం 4గంటల వరకు కూడా ప్రారంభించలేదు. దీంతో భోజనాలు చేయకుండా వచ్చిన కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సరిపడా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆపరేషన్ థియేటర్లో నేలపై, మెట్లపై కూర్చొని డాక్టర్ల కోసం పడిగాపులు కాశారు. రాత్రి వరకు 65 మంది మహిళలకు డాక్టర్ రజినీప్రియదర్శిని, 22 మంది పురుషులకు డాక్టర్ రవీందర్ ఆపరేషన్లు చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత మహిళలను నేలపై పడుకోబెట్టారు. ఆస్పత్రిలో ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రతిసారీ ఇదే దుస్థితి ఎదురవుతోంది. కు.ని. ఆపరేషన్లలో క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీ, డాక్టర్లు కృపాభాయి, రవళి, రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
హిల్.. కిల్
{పాణాలు తీస్తున్న కొండలు పాలకులు, ల్యాండ్ మాఫియాతో అనర్ధాలు కొండవాలు ప్రాంతాల్లో 25 వేల కుటుంబాలు విశాఖపట్నం : విశాఖ నగరంలో కొండ లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అనధికార కట్టడాలతో ప్రకృతి ప్రసాదిత గిరులను ఆక్రమించుకుంటున్నందుకు ఫలితంగా ప్రాణాలనే బలికోరుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా శాశ్వత చర్యలు కానరావడం లేదు. నగరంలో 25వేల కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు అంచనా. ప్రమాదమని తెలిసినా తుపాను, సునామీ, భూకంపం ఇలా ఏ హెచ్చరికలు జారీ అయినా కొండవాలు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. హూద్‌హూద్ తుఫాను సమయంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. అయినా వేరే ఎక్కడా గూడు దొరకకపోవడంతో మళ్లీ అక్కడే గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తామని, రక్షణ గోడలు నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలు గుప్పిస్తున్నా అవేవీ అమలులోకి రావడం లేదు. ల్యాండ్ మాఫియా నిర్వాకం ల్యాండ్ మాఫియా రంగంలోకి దిగి కొండలను ఆక్రమిస్తోంది. ప్రజాప్రతినిధుల అండతో కొందరు గ్రూపులుగా ఏర్పడి కొండ ప్రాంతాలలో హద్దులు నిర్ణయిస్తున్నారు. 30 నుంచి వంద గజాల స్థలాలు చదును చేసి బహిరంగంగా అమ్మేస్తున్నారు. ముందుగా అక్కడి చెట్లకు నిప్పు పెట్టి స్థలాలను చదును చేస్తున్నారు. తర్వాత చిన్నపాక వేసి దానిని రేకుల షెడ్డుగా, భవనంగా మారుస్తున్నారు. అనంతరం ఇళ్లు లేని వారికి వాటిని విక్రయిస్తున్నారు. ప్రమాదంలో జీవనం విశాఖ నగరానికి ఉపాధి, కూలీ పనులు కోసం చాలా మంది వలస వస్తుంటారు. కొమ్మాది, ఆరిలోవ, మధురవాడ, తాడిచెట్లపాలెం, మాధవధార, సీతమ్మధార, వెంకోజిపాలెం, హనుమంతవాక, కప్పరాడ, మురళీనగర్, సింహిద్రిపురం, వరాహగిరి కాలనీ, గాజువాక, మల్కాపురం, కస్తూరినగర్, రాంజీఎస్టేట్, సంజీవయ్యాకాలనీ, తిక్కవానిపాలెంకాలనీ, బాపూజీనగర్, శివలింగపురం, అరుంధతినగర్, అంబేద్కర్ ఎస్టేట్, జైభారత్‌నగర్, బర్మానగర్, శ్రీనివాసనగర్, మధుసూధన నగర్, సురేష్‌రాంనగర్, సూరిబాబునగర్, శాంతినగర్ కొండలపై ఇలా వేలాది నివాసాలు వెలిశాయి. కనీస వసతులు కరువు కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి కనీస వసతులు కూడా ఉండవు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటివి అందుబాటులో లేవు. ఇళ్లకు చేరే దారులు కూడా శిథిలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తున్నా, అవి పైపులైన్లు ద్వారా కొండపైకి చేరడం లేదు. -
అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు
-
ఇక్కడ క్షేమం లేదు
అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు మౌలిక వసతుల కరువు శిథిలావస్థలో భవనాలు విద్యార్థులకు అందని దుప్పట్లు, దుస్తులు జ్వరమొచ్చినా పట్టించుకునే వారుండరు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన తిండి లేక... రోగ మొస్తే పట్టించుకునే వారు లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఎదురయ్యే సమస్యలను మౌనంగా భరిస్తూనే ఉన్నారు. వీరి దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్... - సాక్షి, సిటీబ్యూరో పిల్లి కూనల్లా చలికి వణుకుతూ ఒకరిపై ఒకరు... ఒకే దుప్పట్లో నలుగురైదుగురు విద్యార్థులు సర్దుకొని పడుకోవడం... పగిలిన కిటికీలు...తలుపుల సందుల్లోంచి ఇబ్బంది పెట్టే చలిగాలిని తట్టుకోలేక.... ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా నిద్ర లేకుండా గడపడం... స్నానాలకు గంటల తరబడి క్యూలో వేచి ఉండడం...ఇవేవో రైల్వే స్టేషన్లోనో...బస్సు కాంప్లెక్స్లలోనో కనిపించే దృశ్యాలు కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల కష్టాలు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లు 161 ఉన్నాయి. ఇందులో బాలుర 117, బాలికలవి 44 ఉన్నాయి. వీటిలో 15,652 మంది చదువుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 36 హాస్టళ్లలో 2,702 మంది చదువుతుండగా... రంగారెడ్డి జిల్లాలోని 125 హాస్టళ్లలో 12,950 మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల దుస్తులు (రెండు స్కూల్, రెండు జనరల్ డ్రెస్సులు) ఇవ్వాల్సి ఉండగా... కొన్ని హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేశారు. పాఠశాలలు తెరచి ఆరు నెలలు దాటుతున్నా ఇంతవరకూ దుస్తులు అందలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చలిలో వణుకుతున్నా అనేక చోట్ల ఇంకా దుప్పట్లు అందలేదు. ఒకటి, రెండు చోట్ల ఇచ్చినా నాణ్యత లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి ప్లేట్లు, గ్లాసులు ఇవ్వాలన్న సంగతి అధికారులు మరచిపోయినట్లున్నారు. మంచినీరు, స్నానపు గదులు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతుల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. ఇక జంట జిల్లాల్లోని 83 కాలేజీ హాస్టళ్లలో 8,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 46 బాలురు, 37 బాలికలవి ఉన్నాయి. అధిక సంఖ్యలో హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉండడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. -
సిగ్గేస్తోంది
నేటికీ 2199 స్కూళ్లలో అందుబాటులో రాని మరుగుదొడ్లు 1264 స్కూళ్లలో అందని చుక్కనీరు సుప్రీం ఆదేశించినా ఫలితం శూన్యం నేడు పాఠశాలలను పరిశీలించనున్న సుప్రీం కోర్టు కమిషన్ సభ్యులు అనంతపురం ఎడ్యుకేషన్ : విద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు తిలోదకాలిచ్చాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతుండడం ఇందుకు అద్దం పడుతోంది. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగా ఉన్నాయి. విద్యాభిృద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వం... క్షేత్ర స్థాయిలో ఆ నిధులను సక్రమంగా వెచ్చించలేకపోతోంది. ఫలితంగా పలు సమస్యలతో పాఠశాలలు సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం కల్పించుకోవాల్సి వచ్చింది. 2012 మార్చి 31 నాటికి ప్రతి ప్రభత్వు పాఠశాలలోనూ తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సిందేనని ఆదేశించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు పొడగించింది. ప్రస్తుతం గడువు ముగిసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ అత్యధిక స్కూళ్లను మౌలిక వసతుల సమస్య వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలోనే.. అనంతపురంలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో 6-10 తరగతుల విద్యార్థినులు సుమారు 825 మంది చదువుతున్నారు. ఇంతమందికి ఉన్నది కేవలం ఏడు మరుగుదొడ్లు. నీటి వసతి అంతంత మాత్రమే. ఇంటర్వెల్ సమయంలో అంతమంది యూరినల్స్‌కు వెళ్లాలంటే సమయం ఉండదు. ఓ వైపు కంపు కొడుతుండడం, మరోవైపు అమ్మాయిలు క్యూలో నిల్చోని ఉండడం ఇంతలోనే బెల్ మోగడంతో చాలా మంది కనీస అవసరాలను సైతం తీర్చుకోలేక వెనుదిరగాల్సి వస్తోంది. మరికొందరు కంపు వాసన భరించలేక ఆవైపు కూడా వెళ్లరు. అలాగే శ్రీ పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో సుమారు 800 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. నీరు పుష్కల ంగా అందుబాటులో ఉన్నాయి. మరుగుదొడ్లు కూడా ఆశించిన స్థాయిలో ఉన్నాయి. అయినా వాటిల్లోకి విద్యార్థులు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇందుకు కారణం వాటిని శుభ్రం చేయకపోవడమే. ఆ దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మరుగుదొడ్లకు దగ్గర్లో ఉన్న తరగతుల విద్యార్థులు కూడా దుర్వాసన భరించలేక పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్యే... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మొత్తం 3896 ఉన్నాయి. వీటిలో 3559 స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. 337 స్కూళ్లలో మొన్నటిదాకా లేవు. కలెక్టర్ హడావుడి చేయడంతో ఇవి ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరుగుదొడ్లు ఉన్న 3559 పాఠశాలల్లో కేవలం 1360 స్కూళ్లలో మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. నీటి వసతి, తదితర సమస్యలతో మిగిలిన 2199 స్కూళ్లలోని మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా విద్యార్థినుల వెతలు వర్ణణాతీతం. చాలా స్కూళ్లలో మహిళా ఉపాధ్యాయునులదే ఇదే సమస్య. ఉదయం స్కూల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సాయంత్రం ఇంటికెళ్లే వరకు వ్యక్తిగత అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక లోలోపు మదననపడుతున్నారు. 1264 స్కూళ్లలో తాగునీరు కరువు జిల్లాలోని 1264 పాఠశాలల విద్యార్థులు తాగునీరు దొరక్క విలవిల్లాడుతున్నారు. మొత్తం 2632 స్కూళ్లలో తాగునీటి సదుపాయం ఉంటే వాటిలో 1788 స్కూళ్లలో మాత్రమే ప్రస్తుతం అమలులో ఉంది. వివిధ కార ణాల వల్ల తక్కిన 844 స్కూళ్లలో విద్యార్థులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక వంటగది సంగతి దేవుడెరుగు. 2011-13 విద్యా సంవత్సరంలో కిచెన్షెడ్లు మంజూరైనా నేటికీ నిర్మాణాలు ప్రారంభం కాని స్కూళ్లు కొకొల్లలుగా ఉన్నాయి. 2216 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కిచెన్షెడ్లు నిర్మించేందుకు ఒక్కొ యూనిట్ రూ. 75 వేలు ప్రకారం మొత్తం రూ. 13 కోట్ల 10 లక్షల 97 వేలు మంజూరైంది. ఈ మొత్తం ఆయా స్కూళ్ల ఎస్ఎంసీ ఖాతాల్లో ఉంది. అయినా నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. నేడు సుప్రీం కోర్టు కమిషన్ సభ్యుల బృందాలు పరిశీలన సుప్రీం కోర్టు కమిషన్ సభుృల బందం జిల్లాలో శుక్రవారం వివిధ పాఠశాలలను పరిశీలించనుంది. ముగ్గురు సభ్యులు మూడృు బందాలుగా విడిపోయి వివిధ మార్గాల ద్వారా వెళ్లి పాఠశాలలను పరిశీంచనున్నారు. వీరు ముఖ్యంగా సుప్రీంకోర్టు సూచనలు అమలు చేస్తున్నారా...లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ల పరిశీలన ప్రధానంగా ఉంటుంది. కాగాృఈ బందం పర్యటన జిల్లా అధికారుల్లో ఒత్తిడి చోటు చేసుకుంది. -
అయ్యో.. అమ్మలకెంత కష్టం
నర్సాపూర్: అమ్మ..ఎవరికైనా అమ్మే...బిడ్డకు జన్మనిస్తుంది..దేశానికి సేవ చేసే పౌరులనిస్తుంది. మరి అంతటి అమ్మను ఎలా చూడాలి. మన పాలకులు మాత్రం అమ్మేకదా...అని...అష్టకష్టాలు పెడుతున్నారు. కు.ని. పేరుతో కడుపులు కోసేస్తూ కటిక నేలపైనే పడుకోబెడుతున్నారు. పచ్చి బాలింతలైన అమ్మలకు నరకం చూపుతున్నారు. దాదాపు ప్రతి కు.ని. శిబిరంలోనూ ఇదే పరిస్థితి తలెత్తినా అధికారులు మాత్రం మేల్కొనడం లేదు. అమ్మలకు అవస్థలు తప్పడం లేదు. తాజాగా బుధవారం కూడా నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో అధికారులు కు.ని. శిబిరం నిర్వహించగా, దాదాపు 82 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకునేందుకు వచ్చారు. అయితే ఆస్పత్రి వద్ద కనీస సౌకర్యాలు కల్పించిన వైద్య అధికారులు, సిబ్బంది కు.ని శిబిరానికి వచ్చిన మహిళలకు, వారి బంధువులకు నరకం చూపారు. ఆస్పత్రిలో 30 పడకలే ఉండడంతో మిగిలిన వారినంతా కటిక నేలపై పడుకోబెట్టారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో వారి బంధువులే చీరలతో ఊపుతూ వారికి సాంత్వన కలిగించారు. ఇక చిన్నారులంతా ఉక్కపోతతో అల్లాడిపోవడంతో ఆస్పత్రి ఆవరణలోని చెట్లకు ఊయలలు వేసి వారిని బుజ్జగించారు. కు.ని. శిబిరానికి ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ఏర్పాటు చేసి కు.ని. శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలతో పాటు వారికి సాయంతో వచ్చే బంధువుల కోసం కనీస వసతులు కల్పించాలని చెబుతున్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రుల ఆవరణలో కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళల వెంట వచ్చిన వారు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. -
అధికారిక భవనం లేక.. అతిథిలా..!
►క్యాంపు కార్యాలయం ఖాళీ లేక కలెక్టర్‌కు ఇబ్బందులు ►నెల రోజులుగా గెస్ట్‌హౌస్‌లోనే బస ►అధికారిక నివాసం ఖాళీ చేయని అహ్మద్‌బాబు ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం.. అబ్బో ఎన్ని హంగులు.. మరెన్ని సౌకర్యాలో.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడడంలేదు. దానికీ కారణం లేకపోలేదు.. మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు ఆ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడమే..! కొత్త కలెక్టర్ ఎం.జగన్మోహన్ బసచేస్తున్న అతిథిగృహం వద్ద కనీస సౌకర్యాలు లేక ఆయన్ను కలిసేందుకు వస్తున్న ప్రజలు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. అసలే వర్షాకాలం.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అంతటి వర్షంలోనూ తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారూ వర్షంలోనే వేచి చూడాల్సి వస్తోంది. ఈ బాధ ప్రజలకే కాకుండా అధికారులకూ తప్పడం లేదు. వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు అతిథిగృహం ఆవరణలోనే పడిగాపులు కాయాల్సి వస్తోం ది. ఇక్కడ మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు జూన్ 26న బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని జలమండలి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన స్థానంలో జగన్మోహన్ జూన్ 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే.. బదిలీ అయిన కలెక్టర్ అహ్మద్‌బాబు క్యాంపు కార్యాలయా న్ని ఖాళీ చేయలేదు. దీంతో కొత్త కలెక్టర్ టీటీడీసీ (సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం) అతిథిగృహంలో బస చేయాల్సి వస్తోంది. ఇందులో కనీసం పది మంది కూడా నిలబడేందుకు స్థలం కూడా లేదు. వేచి చూడడానికి వెయిటింగ్ హాల్ కూడా లేదు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా శాఖల సమీక్ష సమావేశాలు కలెక్టర్ అధికారిక నివాసంలో నిర్వహిస్తున్న సమయంలో అధికారులు గంటల కొద్దీ బయటే ఉండాల్సి వస్తోంది. అందుబాటులో మంచినీటి సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వ అధికారిక బంగ్లా (క్యాంప్ కార్యాలయం)లో పాత కలెక్టర్ అహ్మద్‌బాబు ఇంటి సామగ్రి ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుండటంతో ప్రస్తుత కలెక్టర్ అతిథిగృహంలోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘మీ సేవ’లు అధ్వానం!
కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం సకాలంలో అందని స్టేషనరీ కనీస సౌకర్యాలు కరవు జీతాలందక ఉద్యోగుల సతమతం భోలక్‌పూర్: నగరంలోని ‘మీ సేవ’ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. ఆయా కేంద్రాలను మొక్కుబడిగా నడిపిస్తున్నారు. సరైన సేవలందక వినియోగదారులు సైతం ఇబ్బందు లు పడుతున్నారు. జీతాలు రాక ఆపరేటర్లు, మేనేజర్లు, స్వీప ర్లు సతమతమవుతున్నారు. జంట నగరాల్లో 53 మీ సేవ కేం ద్రాలున్నాయి. అందులో ఔట్సోర్సింగ్ పద్ధతిన సుమారు 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, మేనేజర్లు, స్వీపర్లు పని చేస్తున్నారు. 2002లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను తొలుత జ్యోతి కంప్యూటర్స్ చేపట్టింది. ఆ తర్వాత స్పాన్కో టెలీ సిస్టమ్స్ సంస్థ ఈ కేంద్రాలను కొనసాగింది. గత ఏడాదినుంచి ఉపాధి టెక్నో సర్వీసెస్ వారు వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆయా కేంద్రాల్లోని ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడంలేదు. అదేమంటే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదం టూ నిర్వాహకులు చెబుతున్నట్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని బకాయిలు.. ఇదివరకు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన స్పాన్కో టెలీ సిస్టమ్స్ సంస్థ ఉద్యోగులకు 19 రోజుల వేతనాలు బకాయి పడినట్టు తెలిసింది. 2013 మార్చి నెలలో కొత్త సంస్థ ఉపాధి టెక్నో సర్వీసెస్ సంస్థ బాధ్యతలు చేపట్టింది. అదే నెలలో ఈ సంస్థ 11 రోజుల వేతనం చెల్లించగా మిగతా 19 రోజుల వేతనాన్ని పాత సంస్థ చెల్లించాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆ సంస్థ దాదాపు 600 మంది ఉద్యోగులకు గాను రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. సకాలంలో చేరని స్టేషనరీ.. కేంద్రాల నిర్వహణకు అవసరమైన తెల్ల పేపర్లు, సర్టిఫికెట్ పేపర్లు, రశీదులు తదితర స్టేషనరీ సకాలంలో అందక సిబ్బం ది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిల్లులు చెల్లించిన వారి కి రశీదులు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పలువురైతే సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆయా కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పాత బకాయిలు అందక, మూడు నెలలుగా రెగ్యులర్ జీతాలు లేక సతమతమవుతున్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జీతాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను మెరుగు పరచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
‘కస్తూర్బా’లో బోలెడు సమస్యలు
అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్: బడి మానేసిన బాలికల కోసం ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను స్థాపించింది. అయితే కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది. అల్లాదుర్గం లోని కస్తూర్బా విద్యాలయంలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. గదుల కొరత కారణంగా విద్యార్థులు తరగతి గదుల్లోనే భోజనం చేయాల్సి వస్తోంది. ఇక్కడే సేద తీరుతున్నారు. ఈ విద్యాలయంలో బాలికలకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన అదనపు గదులు నిరుపయోగంగా ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. పొగ కారణంగా విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన జ్యోతీర్మయిని కొన్ని కారణాల వల్ల అధికారులు తొలగించారు. ప్రస్తుతం జ్యోతి అనధికారికంగా ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల జ్యోతి విధులు సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారు. ఈ కారణాల వల్ల సిబ్బందికి వేతనాలు అందడం లేదు. సొంత డబ్బుతో విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు వివరించినట్లు జ్యోతి తెలిపారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 160 మంది బాలికలు చదువుకుంటున్నారు. శనివారం సగం మంది విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యాలయంలో లక్షలు వెచ్చించి నిర్మించిన 6 అదనపు గదులు వృథాగా ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించ పోవడంతో ఆ గదులను అధికారులకు అప్పగించలేదు. ప్రస్తుతం తరగతి గదుల్లోనే విద్యార్థులు పెట్టెలు, దుప్పట్లు, బక్కెట్లు ఉంచుకుంటున్నారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ జోగిపేటలో నివాసం ఉంటున్నారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వసతులు లేకపోవడం వల్ల సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు. కస్తూర్బా విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సంబంధిత సన్నిహిత అధికారిగా వ్యవహరిస్తున్న తహశీల్దార్ గపార్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా, బ్యాంకు ఖాతా తెరవాలని మూడు రోజుల క్రితం ప్రిన్సిపాల్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఖాతా తెరచిన తరువాత ప్రభుత్వం అందులో డబ్బు జమ చేస్తుందని, తరువాత సిబ్బంది జీతాలు, ఇతర అవసరాలు తీరుతాయని వివరించారు. -
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు సమస్యల నిలయాలుగా మారుతున్నాయి. అద్దె భవనాల్లో.. అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. జిల్లాలోని గ్రంథాలయాల స్థితిగతులను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది. జిల్లాలో పెరుగుతున్న పాఠకుల సంఖ్యకు తగినట్లుగా కొత్త గ్రంథాలయాలు ఏర్పాటుకావడంలేదు. గ్రంథాలయాల వల్ల ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం కూడా వీటి అభివృద్ధిపై ఉదాసీనత కనబరుస్తోంది. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, నూతన నియామకాలకు ప్రభుత్వం అనుమతి అంతగా ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల సిబ్బంది కొరత ఏర్పడి పలు గ్రంథాలయాలు మూతపడుతున్నాయి. పేరుకుపోతున్న పన్ను బకాయిలు: గ్రంథాలయాలు నడవడానికి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సెస్ ముఖ్యాధారం. సిబ్బంది ఉదాసీనత వల్ల పన్ను బకాయిల వసూలు మందగిస్తోంది. దీంతో గ్రంథాలయాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది * 1.20 కోట్ల సెస్సు వసూలుకాగా, ఈ ఏడాది వసూలు మందగించింది. మైనర్ పంచాయతీల నుంచి సెస్సు వసూలు బాగా పడిపోయింది. వీటి నుంచి * 60 లక్షల దాకా బకాయిలు వసూలు కావలసి ఉంది. అయితే మార్చి వరకు సమయం ఉన్నందున సెస్సు బకాయిల వసూలు కొంత ఆశాజనకంగానే ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాల కొనుగోలు కూడా ఏటా నిర్ణీత సమయంలో కాకుండా కొన్నేళ్లకు ఒకసారి జరుపుతుండడంతో పాతపుస్తకాలే పాఠకులకు దిక్కవుతున్నాయి. ఇటీవలి కాలంలో కొంత ధోరణి మార్చుకుని పోటీపరీక్షల పుస్తకాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిదానికీ హైదరాబాద్‌లోని పౌర గ్రంథాలయ అధికారుల అనుమతి అవసరమవుతుండడంతో ఒక్కోసారి తీవ్రజాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లాలో 66 శాఖా గ్రంథాలయాలుండగా వీటిలో ప్రస్తుతం 64 మాత్రమే పనిచేస్తున్నాయి. సంతరావూరు, ముండ్లమూరు లైబ్రరీలు మూతపడ్డాయి. గ్రామీణ గ్రంథాలయాలు 12 పనిచేస్తున్నాయి. బుక్‌డిపాజిట్ సెంటర్లు 70 ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలు లేనిచోట్ల బుక్‌డిపాజిట్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లోనే... జిల్లాలో 22 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 15 అద్దె భవనాల్లో, మిగిలినవి ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొరిశపాడు, పర్చూరు, కనిగిరి, కొండపి, మార్కాపురం గ్రంథాలయాలకు 2013-14 సంవత్సరంలో సొంత భవనాలు నిర్మించారు. కనిగిరి, మార్కాపురం లైబ్రరీలలో అదనపు నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పొదిలి, హనుమంతునిపాడు గ్రంథాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపారు. పామూరు, దర్శి, పొన్నలూరు గ్రంథాలయాలకు స్థలం కేటాయిస్తే సొంత భవనాలు నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది కొరత.. జిల్లా గ్రంథాలయ సంస్థలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో గ్రంథపాలకుడికి రెండు, మూడు గ్రంథాలయాల బాధ్యతలను అప్పగించడంతో అవి వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఇటీవల ప్రభుత్వం 6 అటెండర్ల పోస్టులతోపాటు 3 లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టరు నుంచి అనుమతి రాగానే ఈ పోస్టుల భ ర్తీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల సీజన్ కావడంతో పాఠకులు గ్రంథాలయాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని కూడా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. కనీస వసతులేవీ... అనేకచోట్ల వసతుల లేమి పాఠకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. కొన్ని గ్రంథాలయాల్లో కనీసం సరైన ఫర్నిచరు లేదు. కరెంటు సౌకర్యం లేనివి కూడా ఉన్నాయి. పాఠకులకు మంచినీటి వసతి దాదాపు శూన్యం. టాయిలెట్ సౌకర్యం అనేక చోట్ల లేదు. ముఖ్యంగా మహిళా పాఠకులకు అవసరమైన సౌకర్యాలు పలు గ్రంథాలయాల్లో లేవు. దీంతో వారు ఆ గ్రంథాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పలుచోట్ల గ్రంథాలయాధికారులు సరిగా విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ చక్కదిద్ది పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అదనపు పుస్తకాల రాక... రాజా రామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నుంచి ఇటీవల 800 రకాల పుస్తకాలకు సంబంధించి 3200 ప్రతులు వచ్చాయి. వీటిని జిల్లాలోని ఇతర గ్రంథాలయాలకు పంపే యత్నాలను అధికారులు చేపట్టారు. ఆన్లైన్ నమోదు సౌకర్యం... పాఠకులు తమకు కావలసిన పుస్తకాన్ని ఇంతకాలం గ్రంథాలయాల్లోని రిజిస్టర్లలో నమోదు చేసుకోవలసి వచ్చేది. ఈ పద్ధతికి పౌర గ్రంథాలయ ఉన్నతాధికారులు స్వస్తి పలికి ఆనలైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని నూతనంగా కల్పించారు. పాఠకులు ఇకనుంచి ్చఞఞఠఛజీఛిజీఛట్చటజ్ఛీట.జీఛి.జీ అనే దానిలో నమోదు చేసుకుంటే ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. ఈ వినూత్న విధానాన్ని పాఠకులు, ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సౌకర్యాల కల్పనకు కృషి ఆర్సీహెచ్ వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకు చర్యలు చేపడుతున్నాం. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటికి సొంత భవనాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. డ్వాక్రా బజారులోని బాలల గ్రంథాలయాన్ని వేరే చోటకు మారుస్తాం. సెస్ బకాయిల వసూలుపై దృష్టి సారించాం. -
డీపీఎల్ క్యాంపులో అవస్థలు
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శుక్రవారం కుటుంబ నియంత్రణ కోసం డీపీఎల్ (డబుల్ ఫంక్షర్ ల్యాప్రోస్కోపిక్) క్యాంపు నిర్వహిం చారు. ఈ క్యాంపులో ఆపరేషన్లు చేసిన మహిళలను ఆసుపత్రి సిబ్బంది కింద పడుకోబెట్టారు. కనీసం కార్పెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఆపరేషన్ నొప్పులతో ఉన్న వారు పడుకోడానికి సరైన వసతి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి గోసను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారి వెంట వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. నిబంధనల ప్రకారం శస్త్ర చికిత్స నిర్వహించిన అనంతరం వారికి మంచం ఏర్పాటు చేయడంతో పాటు తినడానికి బ్రెడ్, తాగేందుకు పాలు అందించాలి. సహాయకులుగా వచ్చిన వారికి కూడా తాగునీరు, టీ, స్నాక్స్ అందించాలి. వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ, ఆసుపత్రి సిబ్బంది ఇవేవీ సమకూర్చలేదు. ఈ సమస్య కేవలం జిల్లా కేంద్రాసుపత్రిలోనే కాదు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ నుంచి 20 వరకు డీపీఎల్ క్యాంపులు నిర్వహిస్తారు. దీనికి కావాల్సిన నిధులను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ద్వారా విడుదల చేస్తారు. క్యాంపు నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు సుమారు రూ 6వేల నుంచి 10వేల వరకు నిధులిస్తారు. కానీ, క్యాంపులకు వచ్చే వారికోసం ఆ నిధులు ఖర్చు చేయకుండా అధికారులు జేబు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ పేరుతో కుమ్ముతున్నారు జిల్లాలో ప్రతి నెల నిర్వహిస్తున్న డీపీఎల్ క్యాంపులకు ప్రతి నెలా సుమారు రూ లక్ష వరకు నిర్వాహకులు వెనుకేసుకుంటున్నట్టు కార్యాలయం సిబ్బందే బాహాటంగా ఆరోపిస్తున్నారు. నెలలో కనీసం 20 వరకు క్యాంపులను నిర్వహిస్తున్నందున ప్రతినెల ఎన్ఆర్హెచ్ఎం నుంచి రూ లక్షల్లో నిధులు డ్రా చేస్తున్నారు. క్యాంపులో టెంట్లు, కుర్చీలు, కనీస సౌకర్యాలు కల్పించకుండానే.. కల్పించినట్టుగా బిల్లులు సృష్టించి నిధులు డ్రా చేస్తున్నారు. డీపీఎల్ క్యాంపులో ఉపయోగించే సర్జికల్ కిట్ ప్రతి నెల రిపేర్ చేయించినట్టుగా రాసి రూ వేలల్లో బిల్లులు డ్రా చేస్తున్నారని సమాచారం. కుటుంబ నియంత్రణ క్యాంపులను పర్యవేక్షించడం కోసం ఒక అద్దెకారును కూడా వినియోగిస్తున్నారు. దీనికోసం ప్రతి నెల రూ 24 వేలు వెచ్చిస్తున్నారు. కానీ కారును క్యాంపుల కోసం కాకుండా స్వంత పనుల కోసం వినియోగిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. డీపీఎల్ క్యాంపుల పేరుతో నిధులను వెనుకేసుకుంటున్న అంశంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.