నర్సాపూర్: అమ్మ..ఎవరికైనా అమ్మే...బిడ్డకు జన్మనిస్తుంది..దేశానికి సేవ చేసే పౌరులనిస్తుంది. మరి అంతటి అమ్మను ఎలా చూడాలి. మన పాలకులు మాత్రం అమ్మేకదా...అని...అష్టకష్టాలు పెడుతున్నారు. కు.ని. పేరుతో కడుపులు కోసేస్తూ కటిక నేలపైనే పడుకోబెడుతున్నారు. పచ్చి బాలింతలైన అమ్మలకు నరకం చూపుతున్నారు. దాదాపు ప్రతి కు.ని. శిబిరంలోనూ ఇదే పరిస్థితి తలెత్తినా అధికారులు మాత్రం మేల్కొనడం లేదు. అమ్మలకు అవస్థలు తప్పడం లేదు.
తాజాగా బుధవారం కూడా నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో అధికారులు కు.ని. శిబిరం నిర్వహించగా, దాదాపు 82 మంది మహిళలు ఆపరేషన్‌లు చేయించుకునేందుకు వచ్చారు. అయితే ఆస్పత్రి వద్ద కనీస సౌకర్యాలు కల్పించిన వైద్య అధికారులు, సిబ్బంది కు.ని శిబిరానికి వచ్చిన మహిళలకు, వారి బంధువులకు నరకం చూపారు. ఆస్పత్రిలో 30 పడకలే ఉండడంతో మిగిలిన వారినంతా కటిక నేలపై పడుకోబెట్టారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఉక్కపోతతో అల్లాడిపోయారు.
దీంతో వారి బంధువులే చీరలతో ఊపుతూ వారికి సాంత్వన కలిగించారు. ఇక చిన్నారులంతా ఉక్కపోతతో అల్లాడిపోవడంతో ఆస్పత్రి ఆవరణలోని చెట్లకు ఊయలలు వేసి వారిని బుజ్జగించారు. కు.ని. శిబిరానికి ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ఏర్పాటు చేసి కు.ని. శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలతో పాటు వారికి సాయంతో వచ్చే బంధువుల కోసం కనీస వసతులు కల్పించాలని చెబుతున్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రుల ఆవరణలో కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళల వెంట వచ్చిన వారు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
అయ్యో.. అమ్మలకెంత కష్టం
Published Thu, Sep 18 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement